బీజింగ్ : రష్యా జి 20లో అత్యంత ముఖ్యమైన దేశమని, దీనిని ఇతరులెవ్వరూ బహిష్కరించలేరని చైనా బుధవారం తెలిపింది. ఈ బృందం నుంచి రష్యాను తప్పించాలనే అంశాన్ని ఇటీవలే అమెరికా ప్రధానంగా ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో ప్రస్తావిస్తోంది. ఈ దశలో చైనా నుంచి రష్యాకు దౌత్యపరమైన అండదండలు అందాయి. అంతర్జాతీయ ఆర్థిక సహకారం దిశలో జి 20 అతి పెద్ద వేదికగా ఉంది. ఇందులో కీలక పాత్రలో ఉన్న రష్యాను తొలిగించడం తేలికైన విషయం కాదని, ఈ అధికారం ఇతరులెవ్వరికి ఉండదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. శీతాకాలపు ఒలింపిక్స్ సందర్భంగా బీజింగ్‌కు రష్యా అధ్యక్షులు పుతిన్ వచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పటిష్టమైన అపరిమిత సంబంధాలు కొనసాగుతాయని జిన్‌పింగ్, పుతిన్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రత నేపథ్యంలో రష్యాను ఏకాకిని చేయాలని అమెరికా ఇతర దేశాలు ఆంక్షలు ఇతరత్రా చర్యలతో కార్యాచరణకు దిగాయి. ఈ దశలోనే రష్యాకు చైనా అన్ని విధాలుగా తన తోడ్పాటును అందిస్తోంది. జి 20 నుంచి రష్యా తొలిగింపు ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.