Monday, January 20, 2025

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ల వర్షం..

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ల వర్షం
75 డ్రోన్లతో రాజధాని కీవ్ లక్షంగా దాడి
ఉక్రెయిన్‌పై సైనిక చర్య తర్వాత ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి
చాలావరకు డ్రోన్లను కూల్చేశామని ఉక్రెయిన్ ప్రకటన
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. ఏకంగా 75 డ్రోన్లు ప్రయోగించింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలుపెట్టిన తర్వాత మాస్కో జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదే నని ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి. దేశ రాజధాని కీవ్ ప్రధాన లక్షంగా ఈ దాడి జరిగినట్లు ఉక్రెయిన్ వాయుసేన కమాండర్ మైకోలా ఒలేష్‌చుక్ తెలిపారు. మొత్తం 75 ఇరానియన్ ఆత్మాహుతి డ్రోన్లలో 71 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు.

కీవ్‌తో పాటుగా సుమీ, ద్నిప్రో పెట్రోవ్, జపోరిజియా, మైకోలోవ్ తదితర ప్రాంతాలపైనా రష్యా సేనలు డ్రొన్ దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. కీవ్‌పై ప్రయోగించిన 60కి పైగా రష్యా డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసినట్లు నగర పాలనా యంత్రాంగం వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలనుంచి ఉదయం 10 గంటలవరకుఈ డ్రోన్ దాడులు వెల్లువెత్తినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా 77 నివాస భవనాలు,120 కార్యాలయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు.

డ్రోన్ల ద్వారా కీవ్‌పై రష్యా జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని వారు తెలిపారు. ఈ దాడుల్లో ఐదుగురు పౌరులు గాయపడినట్లు కీవ్ మేయర్ విటాలి క్లిట్షో చెప్పారు. బాధితుల్లో 11 ఏళ్ల బాలిక కూడా ఉందని చెప్పారు. 1932 33లో ఉక్రెయిన్‌లో లక్షలాది మంది మరణానికి కారణమైన కరవు విషాదాన్ని గుర్తు చేసుకునే ‘హోలోదోమోర్ సంస్మరణ దినం’ రోజునే ఈ దాడి జరగడం గమనార్హం.‘ మన సైనికులు చాలావరకు డ్రోన్లను కూల్చివేశారు. కానీ కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.గగనతల రక్షణను మరింత పటిష్ఠం చేసి మరిన్ని లక్షాలను కూలుస్తామని తెలిపారు. అంతకు ముందు రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పంపై ఉక్రెయిన్ సైతం డోన్ దాడి చేసింది. గత 21 నెలల్లో ఉద్రెయిన్ చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని మాస్కో పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News