Sunday, December 22, 2024

ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడిన రష్యా.. సగం దేశంపై క్షిపణులు, డ్రోన్ల వర్షం

- Advertisement -
- Advertisement -

కీవ్: రష్యా సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఉక్రెయిన్‌లో సగ భాగంపై విరుచుకుపడింది. రష్యా అనేక క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఆ దాడిలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, డజను మందికి పైగా గాయపడ్డారు. క్షిపణులు, డ్రోన్ల వర్షానికి ఉక్రెయిన్‌లో విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఆ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ‘నీచమైనవి’గా గర్హించారు. సోమవారం అర్ధరాత్రి వందకు పైగా క్షిపణులు, అంతే సంఖ్యలో డ్రోన్లతో మొదలైన దాడి మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. ఇటీవలి వారాల్లో ఇదే రష్యా అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు.

తూర్పు, ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలపై రష్యన్ డ్రోన్ల ప్రయోగం జరిగిందని, ఆతరువాత క్రూజ్, బాలిస్టిక్ క్షిపణుల దాడి చోటు చేసుకుందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలియజేసింది. ‘గత రష్యన్ దాడులు పెక్కింటి వలె ఇది కూడా నీచమైనది, కీలకమైన పౌర ప్రాథమిక వసతులను లక్షంగా చేసుకున్నది’ అని జెలెన్‌స్కీ చెప్పారు. దేశంలో అధిక ప్రాంతాలను & ఖర్కీవ్ ప్రాంతం, కీవ్ నుంచి ఒడెశా, పశ్చిమ ప్రాంతం వరకు లక్షంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని కీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినవచ్చాయి. దాడి వల్ల నగరంలో విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం వాటిల్లిందని మేయర్ వితాలి క్లిష్కో తెలిపారు.

15 ఉక్రెయిన్ ప్రాంతాలు అంటే సగం పైగా ప్రాంతంపై రష్యా డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, హైపర్‌సోనిక్ బాలిస్టిక్ కింఝల్ క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మైహాల్ తెలియజేశారు. ‘విద్యుత్ మౌలిక వసతులు మరొక సారి రష్యన్ టెర్రరిస్టులకు లక్షంగా మారాయి’ అని ష్మైహాల్ చెప్పారు. ప్రభుత్వ రంగం విద్యుత్ గ్రిడ్ నిర్వహణ సంస్థ ఉక్రెనెర్గో వ్యవస్థ సుస్థిరత కోసం అత్యవసర విద్యుత్ కోతలకు ఉపక్రమించవలసి వచ్చిందని ఆయన తెలిపారు. దీర్ఘ శ్రేణి ఆయుధాలను సమకూర్చవలసిందని. రష్యా లోపలి లక్షాలపై వాటి ప్రయోగానికి అనుమతి ఇవ్వవలసిందని ఉక్రెయిన్ మిత్ర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

‘ఉక్రెయిన్ నగరాలపై పైశాచిక దాడులను నిలువరించేందుకు రష్యన్ క్షిపణుల ప్రయోగం జరుగుతున్న ప్రదేశాన్ని ధ్వంసం చేయవలసిన అగత్యం ఉంది’ అని ష్మైహాల్ అన్నారు. ‘మా మిత్ర దేశాల మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం, రష్యా మూల్యం చెల్లించుకునేలా చేస్తాం’ అని ఆయన చెప్పారు. ‘ఉక్రెయిన్ సైనిక, పారిశ్రామిక సముదాయం నిర్వహణకు దన్నుగా ఉన్న కీలకమైన విద్యుత్ మౌలిక వసతులపై దీర్ఘశ్రేణి కచ్చితత్వ గగనతల, సాగరతల ఆయుధాలు, లక్షిత డ్రోన్లు ప్రయోగించినట్లు రష్యన్ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. అన్ని నిర్దేశిత లక్ష్యాలను దెబ్బ తీశామని ఆ శాఖ తెలిపింది. నాలుగు ప్రాంతాల్లో కనీసం నలుగురు వ్యక్తులు మరణించినట్లు, మరి 13 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News