18 మంది పౌరుల దుర్మరణం
కీవ్ : ఓ వైపు సేఫ్ కారిడార్ ఏర్పాటు, ఇందులో భాగంగా కాల్పుల తాత్కాలిక విరమణ ప్రకటన చేస్తూనే రష్యా ఉక్రెయిన్‌పై బాంబు దాడులను తీవ్రతరం చేసింది. సోమవారం రాత్రి సుమీ నగరంపై రష్యా సేనలు పౌరులనే లక్షంగా చేసుకుని సాగించిన బాంబుల దాడిలో 18 మంది పౌరులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సాంస్కృతిక సమాచార మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. మానవత్వాన్ని మంటగలుపుతూ రష్య సేనలు దాదాపుగా 500 కిలోల బాంబులను కురిపించాయని, ఈ దాడులలో ఇద్దరు చిన్నారులతో పాటు 18 మంది పౌరులు దుర్మరణం చెందారని మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రజలు నివాసం ఉండే భవనాలపైనే దాడులు సాగించారని, చెర్నిహ్‌వ్‌లో కూడా ఇదే విధంగా ఓ చోట 500 కిలోల బాంబు ప్రయోగించారని అది పేలలేదని వివరించారు.
కీవ్‌ను చుట్టుముట్టిన రష్యా సేనలు
ఓ వైపు ఉక్రెయిన్‌లోని ఐదు ప్రధాన నగరాలకు సురక్షిత మార్గం ఏర్పాటు కాల్పుల విరమణకు ముందుకు వచ్చిన రష్యా మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టేందుకు మరింత ముందుకు వచ్చింది. ఉత్తరదిశ నుంచి పశ్చిమ తూర్పు ప్రాంతాల నుంచి అన్ని విధాలుగా కీవ్‌ను దిగ్బంధం చేసేందుకు రష్య సేనలు కదులుతున్నాయి. ఇది తమకు కీలక తుది మజిలీ అవుతుందని రష్యా అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి.