జెలెన్‌స్కీ అంతమే రష్యా ముందున్న మార్గం
మాజీ అధ్యక్షులు మెద్వెదేవ్ వెల్లడి
ఉగ్ర చర్యలకు పాల్పడ్డ వ్యక్తిని వదిలిపెట్టం
ఆరోపణలను ఖండించిన ఉక్రెయిన్ నేత
మాస్కో: ఉక్రెయిన్ అధ్యక్షులు వోలోడిమిర్ జెలెన్‌స్కీని అంతమొందించడం ఒక్కటే ఇప్పుడు రష్యా ముందున్న ఏకైక మార్గం అని రష్యా మాజీ అధ్యక్షులు, ప్రధాని అయిన దిమిట్రీ మెద్వెదేవ్ చెప్పారు. ఉక్రెయిన్ కపటనాటకాలతో రష్యాలో ఉగ్రవాద దాడులకు దిగుతోందని, ఈ దశలో జెలెన్‌స్కీని తుదముట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మెద్వెదేవ్ ఇప్పుడు క్రెమ్లిన్ భద్రతా మండలి ఉప ఛైర్మన్ హోదాలో ఉన్నారు. ఉక్రెయిన్‌పై దాడులను మరింత ఉధృతపర్చాలని, వెంటనే అణుదాడులకు దిగాలని మెద్వెదేవ్ తరచూ ప్రకటనలు వెలువరిస్తూ వస్తున్నారు. రష్యాలో అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌ను టార్గెట్ చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్‌ల ద్వారా ఉగ్రదాడులకు దిగిందని ఇటీవలే వార్తలు వెలువడ్డాయి. ఈ దశలో పుతిన్‌ను రహస్య కందకంలోకి తరలించారని వెల్లడైంది. ఈ దశలోనే మెద్వెదేవ్ ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డారు.
ఆయన రష్యాకు 2008 నుంచి 2012 వరకూ దేశాధ్యక్షులుగా ఉన్నారు. ఉగ్రవాద దాడులకు దిగుతున్న దశలో జెలెన్‌స్కీని లేకుండా చేయడమే శరణోపాయం అని మెద్వెదేవ్ అభిప్రాయపడ్డారు. జెలెన్‌స్కీ ఇప్పుడు మన ముందున్న హిట్లర్ వంటివాడని, సరెండర్ కావడానికి ఆయన ముందుకు రాబోరని, అయినా ఆయన రాజీకి రష్యా అంగీకరించేది లేదన్నారు. రష్యా వెనువెంటనే ఓ ప్రత్యామ్నాయ దారి చూసుకోవల్సిందే. జెలెన్‌స్కీని లేకుండా చేయడమే ఈ దారి అని ఆయన న్యూస్‌వీక్ పత్రికకు పంపిన ఇ మొయిల్ వ్యాసంలో తెలిపారు. పుతిన్ అధికారిక నివాసం క్రెమ్లిన్‌పై ఇటీవలేవిరుచుకుపడ్డ రెండు ఉక్రెయిన్ మారణాయుధాల డ్రోన్లను తమ దేశ ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థల యుద్ధ వ్యవస్థలతో దెబ్బతీసినట్లు రష్యా వర్గాలు తెలిపాయి.
అయితే ఇటువంటి దాడులు తమ కలలో కూడా తలపెట్టలేదని జెలెన్‌స్కీ వివరణ ఇచ్చారు. తమ దేశం వద్ద అణ్వాయుధాలు ఉన్నాయనే వాదనను తోసిపుచ్చారు. రష్యా సైన్యంవిపరీత దాడుల నుంచి తమ దేశ గ్రామాలను ప్రజలను రక్షించుకునే దశలోనే ఉన్నామని, ఈ విధమైన దాడులకు దిగే సాధనాసంపత్తి తమ వద్ద లేదని జెలెన్‌స్కీ వివరణ ఇచ్చారు. డ్రోన్లతో ఉక్రెయిన్ పకడ్బందీగా దాడులకు ముందుకు వచ్చిందని, వీటిని తాము కూల్చివేశామని రష్యా సైన్యం తెలిపింది. ఉక్రెయిన్ ఈ విధంగా ఉగ్రవాద చర్యలకు దిగుతున్నదనే విషయాన్ని ప్రపంచదేశాలు గుర్తించాల్సి ఉంటుందని రష్యా తెలిపింది. డ్రోన్ దాడుల దశలో పుతిన్ అధికార నివాసంలో లేరని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ తెలిపారు.
అంతర్జాతీయ న్యాయస్థానం సందర్శనలో జెలెన్‌స్కీ
రష్యా నుంచి తీవ్రస్థాయి ఆరోపణలు వస్తున్న దశలోనే గురువారం జెలెన్‌స్కీ ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం క్రిమినల్ విభాగానికి వెళ్లారు. ఇది అప్రకటిత ఆకస్మిక సందర్శన అయింది. రష్యా అధ్యక్షులు పుతిన్‌పై యుద్ధ నేరాలకు సంబంధించి ఈ కోర్టు అరెస్టు వారంటు వెలువరించి ఉంది. తాము పుతిన్‌పై దాడికి దిగే వారిమి కామని, ఏదైనా ఉంటే న్యాయం కోసం ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తామని హేగ్‌లో జెలెన్‌స్కీ విలేకరులకు తెలిపారు. జెలెన్‌స్కీ ఉన్నట్లుండి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు ఎందుకు వచ్చారనే విషయంపై పలు రకాలుగా ప్రచారం జరిగింది. ఇక్కడి కార్యాలయం వెలుపల ఆయనకు కోర్టు అధ్యక్షులు పోలెండ్‌కు చెందిన పియోటర్ హాప్‌మాన్సికి, అక్కడి సిబ్బంది స్వాగతం పలికారు.
అమెరికాకు రష్యా తీవ్ర హెచ్చరిక
పుతిన్‌ను లక్షంగా చేసుకుని క్రెమ్లిన్‌పై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడి వెనుక అమెరికా ప్రోద్బలం ఉందని రష్యా ఆరోపించింది. దాడులకు వ్యూహాలను, ఎక్కడెక్కడ దాడులు చేయాలనే విషయాలను అమెరికా ముందుగా ఖరారు చేస్తోందని, దీనిని జెలెన్‌స్కీ అమలు చేస్తున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ విమర్శించారు. దాడులు ఎవరు చేశారో తెలుసు, ఎవరు చేయిస్తున్నారో తెలుసు, దీనికి ప్రతిగా తాము ఏం చేయాలో తెలుసునని, ఏమి చేయాలనే విషయంపై తమ వద్ద పలు మార్గాలు ఉన్నాయని, ప్రస్తుతం డ్రోన్ల దాడిపై తగు విధంగా దర్యాప్తు జరుగుతోందని, ఇది పూర్తి అయిన తరువాత చర్యకు దిగే వీలుంటుందని ఈ అధికార ప్రతినిధి తెలిపారు. మరో వైపు క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడి తీవ్ర విషయం అని , దీనిని ఖండిస్తున్నామని రష్యా భద్రతా వ్యవహారాల మండలి తెలిపింది.
Also Read: అంగరంగ వైభవంగా కింగ్ చార్లెస్ పట్టాభిషేకం