రష్యా రాయబారి ఆశాభావం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కీలక తీర్మానం చర్చకు వచ్చినపుడు భారత్ తమకు మద్దతు తెలుపుతుందని ఆశిస్తున్నట్లు రష్యా శుక్రవారం తెలిపింది. భారత్‌లోని రష్యా తాత్కాలిక దౌత్యవేత్త(చార్జి డిఅఫేర్స్) రోమన్ బబుష్కిన్ శుక్రవారం నాడిక్కడ ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులకు దారితీసిన కారణాలపై భారత్‌కు లోతైన అవగాహన ఉందని అన్నారు. భారత్, రష్యా మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని భారత్ నుంచి తమకు నిరంతర మద్దతు లభించగలదని భావిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రస్తుత సంక్షోభంపై భారత్ తీసుకున్న వైఖరిని ఆయన ప్రశంసిస్టూ మూడు రోజుల క్రితం పారిస్‌లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితి మూలాలు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానంతర రాజకీయాలు, నాటో విస్తరణలో ఉన్నాయని పేర్కొనడాన్ని బబుష్కిన్ ప్రస్తావించారు. భారత్ వైఖరి ఎంతో సమతుల్యంగా, స్వతంత్రంగా ఉందని బబుష్కిన్ అన్నారు.