మాస్కో : ఉక్రెయిన్ష్య్రాయుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నాల్లో భాగంగా సౌదీ అరేబియాలో చర్చలు జరుగుతున్న సమయంలో ఆ రెండు దేశాల మధ్య దాడులు ఆగడం లేదు. దాదాపు 10 రష్యా రీజియన్లలో 337 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా మిలిటరీ మంగళవారం వెల్లడించింది. ఉక్రెయిన్ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారని పేర్కొంది. ఉక్రెయిన్ డ్రోన్లలో 126ని సరిహద్దు లోని కుర్స్ రీజియన్‌లో కూల్చివేశారు. ఈ ప్రాంతాలు కొన్ని కీవ్ బలగాల నియంత్రణలో ఉన్నాయి. మరో 91 డ్రోన్లు మాస్కో రీజియన్‌లో కూల్చివేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ సరిహద్దు లోని బెల్గొరోడ్, బ్రైయాన్స్ , వొరొనెజ్ రీజియన్లలో, రష్యాలో ఉన్న కలుగా, లిపెట్‌స్కి, నిఝ్నీ నొవొగొరాడ్, ఒరిల్, ర్యాజన్ తదితర జోన్లలో డ్రోన్లను కూల్చివేసినట్టు పేర్కొంది.
రష్యా రాజధానిగా టార్గెట్ చేసుకున 70 డ్రోన్లు దాడి చేయగా, వాటిని కూల్చివేసినట్టు మాస్కో మేయర్ సెర్గే సొబ్యనిన్ వెల్లడించారు. మాస్కో రీజియన్ గవర్నర్ అండ్రే వొరొబియోవ్ ఉక్రెయిన్ దాడుల్లో ఒకరు చనిపోయారని, తొమ్మిది మంది గాయపడ్డారని తెలియజేశారు. ఈ రీజియన్‌లో ఏడు అపార్టుమెంట్లు దెబ్బతిన్నాయన్నారు. వేరే ప్రాంతంలో పార్కింగ్ చేసి ఉన్న అనేక కార్లు మంటలకు దగ్ధమయ్యాయని, ఆ రీజియన్‌లో మరో రెండు అపార్టుమెంట్‌లు దెబ్బతిన్నాయని చెప్పారు. లిపెట్‌స్క్ లోని జాతీయ రహదారిపై ఒకరు గాయపడ్డారని తెలిపారు. మాస్కో అవతల, డొమొడిడోవో, వ్నుకోవో, షెరెమెట్యేవో, జుకోవ్‌స్కీ, లోను, యారోస్లావి, నిఝనీనొవొగొరోడ్ రీజియన్ల లోను మొత్తం ఆరు విమానాశ్రయాలలో విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. మాస్కో రీజియన్ లోని డొమొడిడోవో స్టేషన్‌లో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా కొంతసేపు రద్దు చేశారు.