ఖెర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామన్న పుతిన్ సేనలు
ఖార్కివ్‌ను హస్తగతం చేసుకునేందుకు విశ్వయత్నం
కీవ్‌లో కుప్పకూలిన ఫ్రీడమ్ స్కేర్
జైటోమిర్‌లో ప్రసూతి కేంద్రంపై బాంబుల వర్షం
ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా తన భీకర దాడులను కొనసాగిస్తోంది. ఏడో రోజు ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఇతర పెద్ద నగరాల్లో పోరును తీవ్రం చేసింది. దేశంలో రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఖార్కివ్ శక్తివంతమైన పేలుళ్లతో అట్టుడికి పోతోంది. ఈ నగరంలోకి రష్యా సేనలు ప్రవేశించినట్లు వార్తలు వస్తున్నాయి. నగరంలో పలు చోట్ల ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో వైపు దినిత్రో నగరంలో ఎయిర్ రెయిడ్ సైరన్లు మోగుతున్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకోపక్క ఖెర్సన్ నగరం తమ అధీనంలోకి వచ్చిందని రష్యా సైన్యం పేర్కొంది. అక్కడి రైల్వే స్టేషన్, పోర్టు దాని అధీనంలో ఉన్నాయి. మరో వైపు ఖార్కివ్ నగరాన్ని హస్తగతం చేసుకోవడానికి రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మంగళవారం ఈ నగరంలోని ప్రభుత్వ కార్యాలయంపై బాంబులు విసిరిన రష్యా బలగాలు బుధవారం పోలీసు భవనంపై దాడి చేశాయి.
ఖార్కివ్‌లో రష్యా జరిపిన ఫిరంగి దాడుల్లో ఇప్పటివరకు 21 మంది మృతి చెందగా, మరో వందమందికి పైగా గాయపడినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. బాంబుల వర్షం కారణంగా ఈ నగరంలోని మిలిటరీ అకాడమీలో 9 గంటలుగా మంటలు చెలరేగుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిపిన బాంబుదాడుల్లో నగరంలోని పరిపాలనా భవనమైన ఫ్రీడమ్ స్కేర్ కుప్పకూలింది. మరో వైపు రష్యా సైన్యాలు నగరంలోని ఓ ఆస్పత్రిపై దాడి చేశాయని ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. కాగా, ఖార్కివ్‌లో ఫ్రీడమ్ స్కేర్, ఆస్పత్రిపై దాడుల నేపథ్యంలో అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. ఈ దాడి రష్యా ప్రభుత్వ ఉగ్ర చర్య అని జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని ఎవరూ క్షమించలేరనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రసూతి కేంద్రంపై దాడి
అలాగే జైటోమిర్ నగరంలో పుతిన్ సేనలు జరిపిన దాడుల్లో ఓ ప్రసూతి కేంద్రం ధ్వంసమైంది.ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 16 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ‘ఇది మారణ హోమం కాక ’? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.