Monday, December 23, 2024

50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి రష్యా రాకెట్ ప్రయోగం

- Advertisement -
- Advertisement -

మాస్కో: దాదాపై ఐదు దశాబ్దాల తరువాత చంద్రుడి పైకి రష్యా మళ్లీ “లూనా 25” పేరుతో రాకెట్‌ను ప్రయోగించింది. ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్ విడుదల చేసిన చిత్రాల ప్రకారం … మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరం లోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ ప్రాంతం నుంచి శుక్రవారం వేకువ జామున 2.10 గంటలకు ‘లునా 25’ నింగి లోకి దూసుకెళ్లింది. కేవలం ఐదు రోజుల్లోనే ఇది చంద్రుడి కక్షలోకి చేరనుంది.

ఆ తర్వాత జాబిల్లిపై ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో మరో 3 లేదా 7 రోజుల్లో ల్యాండర్‌ను దిగేలా ఈ ప్రయోగం చేపట్టారు. అన్నీ అనుకూలంగా జరిగితే ఆగస్టు 21న ఈ ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టనున్నట్టు రోస్‌కాస్మోస్ అధికారులు ఓ ఇంటర్వూలో వెల్లడించారు. ఆ తర్వాత ఏడాది పాటు ఇది చంద్రునిపై పరిశోధనలు జరపనుంది. 1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్ ల్యాండర్ ప్రయోగం ఇదే. ఇప్పటివరకు ఏ దేశ అంతరిక్ష నౌక కూడా చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తోన్న ఇస్రోకు లునా 25 ప్రయోగంతో రష్యా పోటీ ఇస్తోంది.

చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న ల్యాండ్ కానుండగా, అంతకంటే ముందే రష్యా పంపిన లునా 25 అక్కడే అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చంద్రయాన్ 3 మాదిరి కాకుండా ఇది కేవలం ల్యాండర్ మిషన్ మాత్రమే. కేవలం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. ఇందులో చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్ చేతులు, డ్రిల్లింగ్ హార్డ్‌వేర్‌తోపాటు ఇతర శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి.

చంద్రయాన్3 కి ఇబ్బందులుంటాయా?
జాబిల్లి దక్షిణ ధ్రువంలో గణనీయమైన పరిమాణంలో మంచు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ ల్యాండింగ్ సవ్యంగా జరిగితే ఆక్సిజన్, ఇంధనం, నీరు వంటి వనరులపై సమాచారం సేకరించే అవకాశం లభిస్తుంది. ఈ క్రమం లోనే దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23 కంటే ముందే లునా 25 ల్యాండర్ దిగితే అక్కడ అడుగుపెట్టిన తొలి దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. అయితే చంద్రయాన్ 3 , లునా 25 రెండూ ద క్షిణ ధ్రువంపై ల్యాండ్ అయితే అవి ఢీకొనే ప్రమాదం ఉందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై రష్యా స్పష్టతనిచ్చింది.

ఈ రెండు అంతరిక్షసంస్థలు ల్యాండింగ్ చేయాలనుకున్న ప్రాంతాలు వేర్వేరని పేర్కొంది. అందువల్ల అవి ఢీకొనే ప్రమాదం లేదని వెల్లడించింది. ఇక చంద్రయాన్ 3 లో ల్యాండర్, రోవర్ ప్రొపల్సన్ మాడ్యూల్స్ ఉన్నాయి. గతంలో చంద్రయాన్ 2 ప్రయోగం సందర్భంగా ఇస్రో పంపించిన ఆర్బిటర్ ఇంకా కక్షలో తిరుగుతోంది. చంద్రయాన్ 3 కి కూడా ఇదే ఆర్బిటర్‌ను వినియోగించుకోనున్నారు. ఇక చంద్రయాన్ ౩ పంపే ల్యాండర్ జాబిల్లిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. రష్యా పంపే లునా 25 ఏడాదిపాటు జాబిల్లి ఉపరితలంపై పనిచేయనుంది.

ఇస్రో అభినందనలు
లునా 25 ని విజయవంతంగా ప్రయోగించడంపై రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్‌కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అభినందనలు తెలియజేసింది. “ ఈ అంతరిక్ష ప్రయాణంలో మనకు మరో మీటింగ్ పాయింట్ ఉండటం అద్భుతం” అని ట్విటర్‌లో రాసుకొచ్చింది. చంద్రయాన్ 3 ,లునా 25 మి
షన్లు తమ లక్షాలను చేరుకోవాలని ఆకాంక్షించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News