Friday, November 22, 2024

చైనా కరెన్సీలో చమురు చెల్లింపులు?

- Advertisement -
- Advertisement -

గత పదేండ్లలో ఎన్నడూ లేని కొత్త ఇరకాటంలో నరేంద్ర మోడీ సర్కార్ చిక్కుకుందా? చైనా కరెన్సీలో రష్యాకు డబ్బు చెల్లించి ముడి చమురు కొనుగోలు అవమానకరంగా భావిస్తోందా? చైనా మీద కోపంతో అధిక ధరలకు ఇతర దేశాల నుంచి కొని జనం మీద భారం మోపేందుకు సిద్ధపడుతుందా? తాజాగా తలెత్తిన పరిస్థితి నుంచి పుట్టుకు వస్తున్న అనుమానాలివి. తమ ముడి చమురుకు చైనా యువాన్లు చెల్లించాలన్న రష్యా డిమాండ్‌ను భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెప్పినట్లుగా బ్లూవ్‌ుబెర్గ్ మీడియా పేర్కొన్నది. ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన తరువాత పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యన్లు తమ వద్ద కొనుగోలు చేసే దేశాలకు రాయితీ ధరలకు చమురును విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గతం కంటే ఎంతో ఎక్కువగా చైనాపై ఆధారపడ్డారు. ఐరోపా యూరోలు, అమెరికా డాలర్లను మార్చుకొనేందుకు ఆంక్షలు అడ్డువస్తున్నందున తమకు చైనా యువాన్లలో చెల్లించాలని రష్యా మన దేశాన్ని కోరింది. దీనికి మన దేశం అంగీకరించే అవకాశాలు లేవని బ్లూవ్‌ుబెర్గ్ వ్యాఖ్యానించింది.

అదే జరిగితే రష్యా నుంచి కొనుగోలు నిలిపివేసి డాలర్లు చెల్లించి అధిక ధరకు ఇతర మార్కెట్లో చమురు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యువాన్లలో చెల్లించినప్పటికీ ఇప్పుడు హిందూస్తాన్ పెట్రోలియం, భారత పెట్రోలియం కార్పొరేషన్ చెల్లింపుల అంశానికి వస్తే ప్రభుత్వం విముఖంగా ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ కొద్ది రోజుల క్రితం పేర్కొన్నది. కొత్తగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటో తెలియదు. గతేడాది నవంబరు నాలుగున ఒపెక్ దేశాల నుంచి మనం కొనుగోలు చేస్తున్న ముడి చమురు పీపా ధర 93.86 డాలర్లు ఉండగా, తరువాత మే మూడవ తేదీకి 70.52 డాలర్లకు తగ్గింది. సెప్టెంబరు 29న 97.03 డాలర్లకు పెరిగి తరువాత కాస్త తగ్గి అక్టోబరు 19న 91.71 డాలర్ల వద్ద ఉంది.

చైనాతో సరిహద్దు వివాదంలో ఎలాంటి పురోగతి లేకపోవడం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్లో చైనాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలకు మరింత సన్నిహితం కావటం వంటి కారణాలు ఉండవచ్చు. లేదా రూపాయిని అంతర్జాతీయ మారక కరెన్సీగా మారుస్తామన్న మాటల ప్రచార బండారం సంగతేమిటని జనం అడుగుతారన్న భయం కావచ్చు. 2022 23లో రోజుకు 7.8 లక్షల పీపాల రష్యా చమురు దిగుమతి చేసుకోగా, 2023 24లో ఇప్పటి వరకు 17.6 లక్షలకు పెరిగింది. ఈ మేరకు ఒపెక్ (చమురు ఎగుమతి దేశాలు) నుంచి దిగుమతులు తగ్గాయి. 2022 ఏప్రిల్ సెప్టెంబరు కాలానికి మన మొత్తం అవసరాల్లో 63 శాతం ఒపెక్ నుంచి దిగుమతి చేసుకోగా, ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 40 శాతానికి తగ్గింది. ఒపెక్ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురుతో పోలిస్తే తక్కువ ధర, రూపాయల్లో చెల్లింపుల వెసులుబాటు వంటి సానుకూల కారణాలు ఉన్న కారణంగానే మన దేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. మన రూపాయలతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు దొరకదు. అందుకోసం డాలర్లు ఖర్చు చేయాల్సిందే. వాటి బదులు యువాన్లలో చెల్లిస్తే మనకు పడే అదనపు భారం ఉండదు.

మన వినియోగదారులకు మేలు కలుగుతున్నపుడు, ఖజానా మీద భారం పడనపుడు ఏ విదేశీ కరెన్సీలో చెల్లిస్తే ఏమిటి? వివాదాలకు, వ్యాపారానికి సంబంధం లేదంటూ గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి చైనా నుంచి దిగుమతులు సజావుగానే మనం చేసుకుంటున్నాం. వాటి దగ్గర లేనిది యువాన్ల దగ్గర పట్టుదల అవసరమా? అంతర్జాతీయ మార్కెట్లో యువాన్లను కొనుగోలు చేయటం అవమానంగా భావిస్తున్నామా?
ప్రయివేటు సంస్థలు యువాన్లలో చెల్లింపులు జరపడంపై ఎలాంటి నిషేధం లేదని మన ప్రభుత్వం ప్రకటించింది. అయితే అలాంటి లావాదేవీలను ప్రోత్సహించటం గానీ, వీలు కల్పించటం గాని చేసేది లేదని కూడా పేర్కొన్నది. తాము డాలర్లను స్వీకరించేది లేదని, యువాన్లు లేదా రూబుళ్లను చమురు లావాదేవీల్లో అంగీకరిస్తామని రష్యా కంపెనీ గాజ్ ప్రోవ్‌ు స్పష్టం చేసింది. ప్రపంచ లావాదేవీలు యువాన్లతో జరపాలన్న ప్రతిపాదనల పట్ల మనదేశం సంతోషంగా లేదని ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఏ కరెన్సీతో లావాదేవీలు జరపాలన్న అంశం తేలకపోవడంతో రష్యాకు సెప్టెంబరు నుంచి ఏడు టాంకర్ల చెల్లింపులు నిలిచిపోయాయి.

ఇప్పటికే తన దగ్గర భారీ మొత్తంలో రూపాయి నిల్వలు ఉన్నందున చమురు చెల్లింపులకు గాను తనకు యువాన్లలో చెల్లించాల్సిందేనని రష్యా పట్టుబట్టింది. తాను చైనా దిగుమతుల మీద ఆధారపడినందున యువాన్ల అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ప్రయివేటు చమురు శుద్ధి సంస్థలు కొంత మేరకు చెల్లింపులు జరిపాయి. యుఎఇ దిరహావ్‌‌సులో కూడా రష్యాకు చెల్లించాము. కొన్ని రష్యన్ కంపెనీలు దిరహావ్‌‌సును కూడా అంగీకరించడం లేదు. పీపా ముడి చమురును 60 డాలర్లకు మించి రష్యా దగ్గర కొనుగోలు చేస్తే అమెరికా ఆంక్షలను అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. మన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మారుస్తామని చెబుతున్న తరుణం, సరిహద్దు వివాదం కారణంగా చైనా కరెన్సీలో చెల్లింపులు చేసేందుకు మోడీ సర్కార్ ఇబ్బందిపడుతోంది. బ్రిక్స్ దేశాల కూటమిలో ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదన రాగా మన దేశం మాత్రమే వ్యతిరేకించింది. ఒకవేళ అంగీకరిస్తే యువాను అవుతుందన్నభయం ఉందని వార్తలు. ప్రస్తుతం రూపాయి అంతర్జాతీయ లావాదేవీల్లో పూర్తిగా మారకం కావటం లేదు. అందువలన తన దగ్గర ఉన్న వందల కోట్ల రూపాయలను ఏం చేసుకోవాలని రష్యా అడుగుతోంది.

ఇప్పటి వరకు స్థానిక కరెన్సీలో లావాదేవీలు జరిపిన కారణంగా రష్యాకు యువాన్లు వస్తున్నాయి. రష్యా రాయితీల వలన చైనా 10, భారత్ 7 బిలియన్ల డాలర్లను పొదుపు చేసుకున్నాయి. ప్రపంచంలో పరిస్థితులు మారుతున్నాయి, వాటికి ప్రతికూలంగా నడిచే పరిస్థితి మనకు ఉందా అన్నది సమస్య.
అమెరికా డాలరు పెత్తనానికి రోజులు దగ్గర పడుతున్నాయా? అనేక వైపుల నుంచి వస్తున్న వార్తలు ఏదో జరగబోతోందనే సూచిస్తున్నాయి. తన బిఆర్‌ఐ పథకం కింద గతంలో ఎక్కువగా డాలర్లు ఇచ్చిన చైనా ఇప్పుడు తన కరెన్సీ యువాన్ ఇవ్వటం ప్రారంభించింది. అక్టోబరు మూడవ వారంలో ఈ మేరకు అనేక ఒప్పందాలను కుదుర్చుకుంది. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం చైనా అభివృద్ధి బాంకు మలేషియా, ఈజిప్టు, పెరూ కేంద్ర బాంకులతో ఒప్పందాలు చేసుకుంది. చైనా ఎగుమతి దిగుమతి బ్యాంకు సౌదీ నేషనల్ బ్యాంకుతో, బ్యాంక్ ఆఫ్ చైనా ఈజిప్టుకు 47.9 కోట్ల డాలర్ల విలువగల యువాన్ పాండా బాండ్లను జారీ చేసింది.

సిల్క్ రోడ్ నిధులకు గాను 80 బిలియన్ల యువాన్లను అదనంగా చైనా పక్కన పెట్టింది. అంతర్జాతీయ లావాదేవీల్లో డాలర్ల వాటా ఎంతో ఎక్కువగా ఉంది. ఆగస్టు నెలలో 83.95 శాతంగా ఉన్నది సెప్టెంబరులో 84.15కు పెరిగింది. యూరో వాటా 6.43 నుంచి 5.43 శాతానికి తగ్గగా, చైనా యువాన్ లావాదేవీలు 4.82 నుంచి 5.8 శాతానికి చేరి రెండవ స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో యూరో, జపాన్ ఎన్, సౌదీ రియాల్ ఉన్నాయి. యువాన్ వాటా తక్కువే అయినప్పటికీ క్రమంగా పెరుగుతోంది. ఇరవై భాగస్వామ్య దేశాలతో చైనా ఇప్పటి వరకు పదిహేడింటితో యువాన్ మార్పిడి ఒప్పందాలు కుదుర్చుకుంది.అర్జెంటీనాలో ఆరున్నర బిలియన్ డాలర్ల విలువగల యువాన్ మార్పిడి ఒప్పందం చేసుకుంది.

అంతర్జాతీయ వాణిజ్యంలో 15% వాటా ఉన్న చైనా కరెన్సీయే అంత తక్కువగా ఉన్నపుడు కేవలం 1.8 శాతం వాణిజ్యం ఉన్న మన దేశ కరెన్సీ వాటా ఎంత ఉంటుందో చెప్పనవసరం లేదు.
బ్లాక్ మార్కెట్ కారణంగా కరెన్సీ మారకపు విలువలో సంభవిస్తున్న హెచ్చు తగ్గుల వలన తమ దేశానికి పది బిలియన్ డాలర్ల మేర నష్టం జరుగుతున్నదని ఇరాక్ కేంద్ర బ్యాంకు పెట్టుబడులు, స్వీకరణల డైరెక్టర్ జనరల్ మజెన్ అహమ్మద్ చెప్పాడు. డాలరు దిగుమతుల్లో సగం అక్రమంగా జరుగుతున్నవే అన్నాడు. 2023 లో స్వీకరించిన డాలరు డిపాజిట్లను వచ్చే ఏడాది ఉపసంహరిస్తామని, 2024 జనవరి ఒకటి తరువాత స్వీకరించబోమన్నాడు.

ఆంక్షల కారణంగా గత రెండు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న ఇరాక్ బ్రిక్స్ కూటమిలో చేరాలని, డాలరుతో నిమిత్తం లేకుండా ఆర్ధిక వ్యవస్థ నిర్వహణ జరపాలని చూస్తున్నది. ఆహ్వానం వస్తే బ్రిక్స్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుదానీ ప్రకటించాడు. తమ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు అవసరమైన పెట్టుబడుల ఆకర్షణకు వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపడుతున్నట్లు, తద్వారా స్థానిక కరెన్సీకి ఆసరా దొరుకుతుందని మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం చెప్పాడు. బ్రిక్స్ దేశాల స్ఫూర్తితో తమ కరెన్సీ రింగెట్‌ను స్థిరపరిచేందుకు చూస్తామన్నాడు. ఇండోనేషియా, చైనా, థాయిలాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలలో రింగెట్‌ను వినియోగిస్తామన్నాడు. డాలరు మీద పూర్తిగా ఆధారపడటం కష్టమన్నాడు.

డాలరు బదులు స్థానిక కరెన్సీ బ్రిక్స్ దేశాలు గనుక తమతో జరిపే లావాదేవీలలో ముఖ్యంగా ఇంధనానికి తమకు స్థానిక కరెన్సీలలోనే చెల్లింపులు జరపాలని అమెరికా, ఐరోపా దేశాలను డిమాండ్ చేస్తే పరిస్థితి ఏమిటి అన్నది ఒక చర్చ. తమకు డాలర్లలోనే చెల్లింపులు జరపాలనేదేమీ లేదని స్థానిక కరెన్సీలను కూడా అంగీకరిస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ కూటమి న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి) ఏర్పాటు చేసింది. రానున్న మూడు సంవత్సరాల్లో సభ్య దేశాలు డాలరు బదులు ఆయా దేశాల కరెన్సీలలో లావాదేవీలు జరుపుకోవాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఆయా దేశాల కరెన్సీలలో ఇతర దేశాలకు రుణాలు ఇవ్వాలని సూచించింది. 2026 నాటికి డాలర్ పెత్తనం తగ్గటం ప్రారంభమవుతుందని అంచనా.

ప్రస్తుతం బ్రిక్స్ కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 30 శాతం వాటా కలిగి ఉంది, దాన్ని మరింతగా విస్తరించాలనే యత్నాల్లో ఉన్నారు.ఈ కూటమిలో చేరాలని 40కి పైగా దేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. సెప్టెంబరులో జరిగిన కూటమి సమావేశంలో సౌదీ అరేబియా, ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను చేర్చుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది. వీటిలో అర్జెంటీనా మినహా ఐదు దేశాలూ చమురు ఎగుమతి దేశాలే అన్నది తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న పశ్చిమ దేశాల పెత్తనం క్రమంగా తూర్పు దేశాలకు వస్తుందని భావిస్తున్నారు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News