Wednesday, November 6, 2024

ఉక్రెయిన్ ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

Amar jawan jyoti at india gate merged with eternal flame

సోవియట్ మాజీ రిపబ్లిక్ ఉక్రెయిన్ ఉద్రిక్తత ప్రపంచాన్ని వేడెక్కిస్తున్నది. క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పటి నుంచి ఇటువంటి పరిస్థితి ముంచుకు రాగల ప్రమాదం కనిపిస్తున్నప్పటికీ ఇంతలోనే ఇంతగా విషమిస్తుందనుకోలేదు. 2014 ఫిబ్రవరి, మార్చిల్లో క్రిమియాపై రష్యా దాడి చేసి దానిని ఆక్రమించుకున్నది. అంతకు ముందు ఉక్రెయిన్‌ను పాలిస్తూ వచ్చిన ప్రెసిడెంట్ విక్టర్ యనుకోవిచ్ పై తిరుగుబాటు తలెత్తింది. ఆయన రాజధాని కీవ్ నుంచి పారిపోయి రష్యాలో తేలాడు. ఆయన స్థానంలో ఉక్రెయిన్ పార్లమెంటు రాడా తాత్కాలిక అధ్యక్ష, ప్రధానులను నియమించింది. వారు యూరోపియన్ యూనియన్‌తో కలిసి నడవాలని కోరుకుని దానితో ఒక ఒప్పందంపై సంతకం చేశారు. అప్పటి నుంచి అమెరికా, పాశ్చాత్య దేశాలకు రష్యాకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆ వెంటనే ఉక్రెయిన్‌లో భాగమైన క్రిమియాను సాయుధ తిరుగుబాటుదార్లు ఆక్రమించుకోడం ప్రారంభించారు. వారు సుశిక్షత సైనికుల మాదిరిగా తమ పనిని పూర్తి చేసుకోడంతో రష్యా ఆర్మీయే తిరుగుబాటుదార్ల రూపంలో అడుగుపెట్టిందనే అభిప్రాయం నెలకొన్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదట్లో దానిని నిరాకరించినప్పటికీ ఆ తర్వాత అంగీకరించాడు. ఆ తిరుగుబాటు నాయకులను అభినందించాడు. 2014 మార్చి 18 కల్లా రష్యాలో క్రిమియా విలీన ప్రక్రియ పరిపూర్తి అయింది. ఆ రోజున క్రిమియా, రష్యా అధికారులు విలీన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఉక్రెయిన్ సైన్యంలో ఎక్కువ మంది క్రిమియా నుంచి వచ్చిన వారే వుండడం వల్లనూ, రష్యా బలాధిక్యత వల్లనూ క్రిమియాపై దండెత్తే సాహసాన్ని ఉక్రెయిన్ చేయలేకపోయింది. ఉన్నట్టుండి గత మాసంలో రష్యా లక్ష మందికి పైగా సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోదలచడాన్ని ఎంత మాత్రం సహించరాదని అమెరికా, యూరప్ దేశాలు తీర్మానించుకున్నాయి. తనను ఆనుకొని వున్న ఉక్రెయిన్‌లో ప్రాభవం పెంచుకోవాలని అమెరికా వ్యూహ సారథ్యంలో యూరప్ దేశాలు పావులు కదపడం ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ వాటికి, రష్యాకు మధ్య ఘర్షణ క్షేత్రంగా మండడం ప్రారంభించింది. ఇప్పుడది పరాకాష్ఠకు చేరింది. సైన్యాన్ని ఉక్రెయిన్ చుట్టూ కీలక ప్రాంతాల్లో భారీగా మోహరించిన రష్యా దానిని ఆక్రమించుకొనే ఆలోచన లేదని చెబుతున్నప్పటికీ అమెరికా గాని, యూరప్ దేశాలు గాని నమ్మడం లేదు. రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలను విధించక తప్పదని అమెరికా సారథ్యంలోని నాటో సైనిక కూటమి హెచ్చరించింది. జర్మనీ నౌకాదళ అధిపతి స్కోన్ బ్యాక్స్ ఇటీవల న్యూఢిల్లీకి వచ్చి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమై ఆయన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. క్రిమియాను రష్యా నుంచి వెనక్కి తీసుకోడం సాధ్యమయ్యే పని కాదని, దానిని స్వాధీనం చేసుకున్నందుకు పుతిన్‌ను గౌరవించాల్సిందేనని ఆయన చేసిన వ్యాఖ్య పాశ్చాత్య దేశాల్లో సంచలనం సృష్టించింది. తన వ్యాఖ్యకు జర్మనీ అధికారిక విధానంతో సంబంధం లేదని ఆయన చెప్పినప్పటికీ ఆయనను పదవి నుంచి తొలగించక తప్పలేదు. ఎందుకంటే జర్మనీ మొదటి నుంచి ఉక్రెయిన్ విషయంలో మిగతా యూరప్ దేశాల వైఖరికి కొంచెం దూరంగా వుంటూ వచ్చింది. అవి ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నప్పటికీ జర్మనీ ఆ పని చేయలేదు. అందుచేత స్కోన్ బ్యాక్స్ వ్యాఖ్యను జర్మనీ అధికారిక అభిప్రాయంగా పరిగణించే పరిస్థితి తలెత్తడంతో ఆయనను అది వదిలించుకుంది. అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ విమానాలు ఉక్రెయిన్ వైపు బయల్దేరాయి. అలాగే యుద్ధ వాతావరణం దృష్టా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి తన రాయబార కార్యాలయ సిబ్బందిని అమెరికా వెనుకకు రప్పించుకుంటున్నది. బ్రిటన్ కూడా తన దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపించుకుంటున్నది. తనకు సమీపంలో వుండి, తన ప్రయోజనాలకు కీలకమైన ఉక్రెయిన్‌పై యూరప్ కన్ను వేయడం సహించని రష్యా ఈ ఘర్షణలో నేర్పుతో పావులు కదుపుతున్నది. అది గట్టిగా తలచుకుంటే సైన్యాన్ని ప్రయోగించనవసరం లేకుండానే బెదిరింపులతో ఉక్రెయిన్‌ను పాదాక్రాంతం చేసుకోవచ్చని ఆ పరిణామాన్ని కాకుండా చేయడం అమెరికాకు దుస్సాధ్యమని పాశ్చాత్య పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాకు కాని, యూరప్ దేశాలకు గాని తక్షణం ప్రమాదకారి చైనా అయినప్పుడు రష్యాపై పగ పెంచుకొని తమ శక్తియుక్తులను అక్కడ ఖర్చు పెట్టడం విజ్ఞతకాదని నిపుణులు భావిస్తున్నారు. చారిత్రకంగా రష్యాకే సన్నిహితమైన క్రిమియాను గాని, ఉక్రెయిన్‌ను గాని స్వాధీనం చేసుకోవాలనే దుర్బుద్ధిని అమెరికా, యూరప్‌లు విడిచిపెట్టడమే మంచిదని సలహా అధికంగా వెలువడుతున్నది.

Russia send 1 lakh soldiers to Ukraine border

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News