అధికారంలోకి తాను వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించన డొనాల్డ్ ట్రంప్, ఆ విధంగానే అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రయత్నాలు ప్రారంభించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారిస్తానని ఒకవైపు చెబుతూనే మరోవైపు కొన్నేళ్లుగా రష్యాతో ప్రతిష్టంభించిన సంబంధాలు మళ్లీ బలోపేతం చేసుకోడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని దిర్హియా ప్యాలెస్‌లో మంగళవారం (ఫిబ్రవరి 18) అమెరికా, రష్యా ప్రతినిధుల మధ్య మొదటి విడత చర్చలు జరిగాయి. ఈ శాంతి చర్చల్లో ఉక్రెయిన్ ప్రతినిధులను భాగం చేయకపోవడంపై వస్తున్న విమర్శలను బుధవారం ట్రంప్ తోసిపుచ్చారు.
మూడేళ్లుగా ఈ యుద్ధం నివారణ గురించి నువ్వేం చేస్తున్నావని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీను ఉద్దేశించి ట్రంప్ ఎదురుదాడి చేశారు. అసలు ఈ యుద్ధాన్ని మొదలు పెట్టాల్సిందికాదని, ఇదో బుద్ధితక్కువ యుద్ధమని వ్యాఖ్యానించారు. జెలెన్ స్కీ నేతృత్వంలో ఉక్రెయిన్ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని ట్రంప్ మండిపడ్డారు. ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించాల్సిందని, జెలెన్ స్కీకి కేవలం 4% మాత్రమే ప్రజామద్దతు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిని బట్టి యుద్ధం అంటే ఎన్ని అనర్థాలకు కారణమవుతోందో అన్న అభిప్రాయంతో ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. సౌదీలో జరిగిన చర్చల్లో మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. మొదటిది వాషింగ్టన్, మాస్కోల్లో దౌత్యసిబ్బందిని తిరిగి నియమించుకోడానికి, రెండవది ఉక్రెయిన్ శాంతి చర్చలకు మద్దతుగా ఉన్నతస్థాయి అధికారిక బృందాన్ని ఏర్పాటు చేయడానికి, మూడోది ఉభయదేశాల సంబంధాలను మరింత మెరుగుపర్చుకోడానికి, ఆర్థిక సహకారం పెంపొందించుకోడానికి చర్చలు జరిగాయి.
ఈ చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధ నివారణ ప్రయత్నాల్లో కొంత పురోగతి కన్పిస్తుందని ఉక్రెయిన్‌తో పాటు ఐరోపా యూనియన్ దేశాలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కానీ ఉక్రెయిన్ ప్రతినిధులకు ఈ చర్చల్లో చోటు కల్పించకపోవడం వివాదాస్పదమైంది. చర్చలకు ముందు పుతిన్ విదేశీ వ్యవహారాల సలహాదారు యూరీ ఉష్కోవ్ మాట్లాడుతూ ఈ చర్చలు పూర్తిగా అమెరికా, రష్యా దేశాల ద్వైపాక్షికమని, ఇందులో ఉక్రెయిన్ అధికార ప్రతినిధులను చేర్చుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేయడం ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఏమాత్రం గుర్తింపు ఇవ్వడం లేదన్న వాస్తవం బయటపడుతోంది. రష్యా బలగాలకు వ్యతిరేకంగా కీవ్ క్రమంగా తన క్షేత్రస్థాయి ఉనికిని కోల్పోతున్నట్టు కనిపించింది. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో తాము ప్రాతినిధ్యం వహించకపోతే ఏ నిర్ణయం తీసుకున్నా తాము గుర్తించబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇదివరకే ప్రకటించారు. దీని ప్రభావం వల్లనే కావచ్చు. జెలెన్ స్కీతో చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారని, అవసరం అనుకుంటే వీరి మధ్య చర్చలు ఉంటాయని రష్యా ప్రకటించింది.
దీనివెనుక ట్రంప్ ఒత్తిడి ఉన్నట్టు భావించవలసి వస్తోంది. జెలెన్ స్కీ ఎన్నిచేసినా నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం రాదని, ఏదో ఒకనాటికి రష్యాలో ఉక్రెయిన్ కలిసిపోతుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల అంతరార్ధం తెలియక పశ్చిమ యూరప్ నేతలు ఏం చేయాలో తెలియక తికమకపడుతున్నారు. ఉక్రెయిన్‌కు రక్షణ కల్పించే సాకుతో రష్యా సరిహద్దులకు నాటోను విస్తరింపచేయలన్న యూరప్ వ్యూహం ఇప్పుడు బెడిసికొట్టినట్టవుతోంది. దీనికి తోడు రష్యాతో ఉక్రెయిన్ సాగిస్తున్న యుద్ధంలో తాము అందించిన సహాయానికి లేదా ఆ ఖర్చును తిరిగి చెల్లించే స్థితిలో ఉక్రెయిన్ లేనందున దానికి బదులుగా టిటానియం, యురేనియం, లిథియం వంటి 500 బిలియన్ల విలువగల ఖనిజ సంపద ఉన్న ప్రాంతాల్లో సగం తమకు అప్పగించాలని ట్రంప్ బేరసారాలు జరుపుతున్నారు.
‘పోరు నష్టం.. పొందులాభం’ అన్న లక్షంతో ట్రంప్ పావులు కదుపుతున్నారు. అయితే రియాద్‌లో మంగళవారం రష్యా, అమెరికా చర్చల్లో ఉక్రెయిన్ ప్రతినిధులను విస్మరించడం యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ దేశాల అత్యవసర సమావేశానికి ఫ్రాన్స్ పిలుపుఇచ్చింది. రష్యా ఉక్రెయిన్ సంధి విషయంలో యూరప్ వైఖరిని స్పష్టం చేసేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పారిస్‌లో యూరప్ నేతల సమావేశం ఏర్పాటు చేశారు. అంతకు ముందే బ్రిటన్ సోమవారం ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించింది. ఉక్రెయిన్ ఉనికికి నష్టం కలిగిస్తే ఒప్పుకోమని అవసరమైతే తాము ఉక్రెయిన్‌కు అండదండలు అందిస్తామని హెచ్చరించింది.
రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాలను రష్యాకు కట్టబెట్టే విధంగా ఒప్పందాన్ని సహించబోమని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. అంతేకాదు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం రష్యా యూరప్ మధ్య అని ఆయన వెల్లడించడం గమనార్హం. కానీ ట్రంప్ పుతిన్ ఫోన్ చర్చల తరువాత ఐరోపాలో తర్జనభర్జన మొదలైంది. ఐరోపా దేశాలన్నిటికీ ఉన్నబలం కన్నా రష్యాకు రెట్టింపు బలం ఉంది. అందువల్ల ఐరోపా దేశాలు తొందరపడడం లేదు. ఐరోపా భద్రతకు తామింకేమాత్రం ప్రాథమిక హామీదారుగా ఉండేది లేదని అమెరికా రక్షణ మంత్రి పేట్‌హెగ్‌సేత్ ప్రకటించడమే కాదు, యూరప్ తమ రక్షణ వ్యయం పెంచుకోవాలని, వారి రక్షణకు తాము బాధ్యత వహించబోమని ట్రంప్ పదేపదే హెచ్చరిస్తుండడంతో ఐరోపా యూనియన్ ముఖ్యంగా పశ్చిమ యూరప్ దేశాలు భయపడుతున్నాయి. బైడెన్ హయంలో రష్యాపై ఆంక్షలతో ఇరకాటంలో పెట్టాలనుకున్న ఐరోపా యూనియన్ దేశాలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డాయి.