మాస్కో: ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ రష్యా తాను ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికలో భాగంగా శనివారం భారీ ఎత్తున సైనిక విన్యాసాలను నిర్వహించింది. ఇందులో భాగంగా అణ్వస్త్రాలను మోసుకెళ్లగల అత్యాధునిక హైపర్‌సోనిక్, క్రూయిజ్, ఖండాంతర క్షిపణుల సామర్థాన్ని పరీక్షించింది. అన్ని క్షిపణులు తమ పనితీరు లక్షాలను ధ్రువీకరిస్తూ తమ టార్గెట్లను తాకాయని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విన్యాసాల్లో టియు95 బాంబర్ యుద్ధ విమానాలు, జలాంతర్గాములు కూడా పాల్గొన్నాయని ఆ ప్రకటన తెలిపింది. శత్రువుపై కచ్చితమైన దాడి లక్షంగా బలగాల సన్నద్ధతను, అణు, సంప్రదాయ ఆయుధాల సామర్థాన్ని ధ్రువీకరించుకోవడం, ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని రష్యా సాయుధ దళాల ప్రధానాధికారి వలెరీ గెరాజిమోవ్ అధ్యక్షుడు పుతిన్‌తో చెప్పారు. వీరి సంభాషణను టెలివిజన్‌లు ప్రసారం చేశాయి. రష్యాలో పర్యటిస్తున్న బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోతో కలిసి పుతిన్ ఈ విన్యాసాలను క్రెమ్లిన్‌లోని సిచుయేషన్ రూమ్‌నుంచి వీక్షించారు.