ముందుకు వచ్చిన రష్యా
మాస్కో: కీవ్ ఉక్రెయిన్‌లోని మరో నాలుగు ప్రధాన నగరాల నుంచి ప్రజలను సురక్షితంగా తరలించే ప్రక్రియకు రష్యా అనుమతిని ఇచ్చింది. యుద్ధ పీడిత రష్యా ఉక్రెయిన్ మధ్య ఇప్పుడు ఈ పరిణామం కీలక ఘట్టం అయింది. యుద్ధంతో చిక్కుపడ్డ పౌరులు వారి వారి దేశాలకు తరలివెళ్లేందుకు వీలుగా హ్యుమానిటేరియన్ కారిడార్స్‌ను ఏర్పాటు చేయాలని రష్యా ప్రతిపాదించింది. సంబంధిత ప్రతిపాదనను మంగళవారం ఉక్రెయిన్‌కు పంపించింది. దీని మేరకు పౌరులు సురక్షితంగా వెళ్లేందుకు అనువైన మార్గాలు ఏర్పడుతాయి. ఈ ప్రతిపాదనలో భాగంగా కొద్దిరోజుల కాల్పుల విరమణ ఉంటుందని రష్యా తెలిపింది. . అయితే సంబంధిత ప్రతిపాదనకు ఉక్రెయిన్ నుంచి వెంటనే ఎటువంటి స్పందనా వెలువడలేదు. కేవలం కొన్ని ప్రాంతాలలో ఉన్న రష్యన్లను సురక్షితంగా తరలించుకునేందుకు కావాలనే కొన్ని మార్గాలను రష్యా ఎంచుకుని ప్రతిపాదన చేసిందని, ఇదంతా కూడా వారి కపడ యుద్ధ తంత్రంలో ఓ భాగం అని ఉక్రెయిన్ తెలిపింది.
తరలుతున్న జనం
ఉక్రెయిన్ల వీడియోలు
సురక్షిత తరలింపు ప్రక్రియ ఆరంభంతో మంగళవారం ఉదయం పలు బస్సులలో జనం వెళ్లుతున్న ఫోటోలు వెలువడ్డాయి. తూర్పు ప్రాంతపు నగరం సుమీ నుంచి కూడా తరలింపు మార్గం ఉంది. దీనితో ఇక్కడ జనం కిక్కిరిసి ఉన్నారు. ఇప్పటికైతే సుమీ గ్రీన్‌కారిడార్ ప్రాంతం అయిందని, తరలింపు ప్రక్రియ తొలిదశ ఆరంభం అయిందని వార్తాసంస్థలు తెలిపాయి. సుమీ నగరం రష్యా సరిహద్దులకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. రష్యా దాడి ప్రక్రియ ఇప్పటికి రెండో వారానికి చేరింది. కారిడార్ ఏర్పాటుకు సంబంధించి తాము సమాచారం నిర్థారించుకుంటున్నామని రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధి ఒక్కరు తెలిపారు.