Saturday, February 22, 2025

ఔను, శాంతికి మొదటి అడుగే

- Advertisement -
- Advertisement -

రష్యా ఉక్రెయిన్ యుద్ధ విరమణకు, ఆ తర్వాతి దశలో పూర్తి శాంతి స్థాపనకు ఈ నెల 18న అమెరికా రష్యా ప్రతినిధుల మధ్య సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన చర్చల ద్వారా మొదటి అడుగు పడినట్లు నిశ్చయంగా చెప్పవచ్చు. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు మార్క్ రూబియో, లావ్రోస్కీ ఒకే విధంగా ధ్రువీకరించినట్లు, ఇవి ప్రధానంగా ఒకరి ఆలోచనలను ఒకరు తెలుసుకునేందుకు ఉద్దేశించినటువంటివి. అదే విధంగా ఉభయ పక్షాల మధ్య స్థూలంగా ఏకాభిప్రాయం వ్యక్తమైనందున, దానిని ముందుకు తీసుకుపోయేందుకు రెండు విధాలైన నిర్ణయాలు జరిగాయి. ఒకటి, వాస్తవ రూపంలో శాంతి చర్చల కోసం ఉన్నత స్థాయి కమిటీల ఏర్పాటు. రెండు, పరస్పర ఆర్థిక సంబంధాలు, ఇతర సంబంధాల మెరుగుదలకు గల అవకాశాల అన్వేషణ, అందుకు అనుగుణమైన చర్యలు. ఇందుకోసం రెండు దేశాలలోని తమ తమ రాయబార కార్యాలయాలలో అవసరమైన సిబ్బంది నియామకం.

ఇదంతా సజావుగా సాగినట్లయితే, మొదట కాల్పుల విరమణ, ఆ వెనుక సుదీర్ఘ చర్చల ద్వారా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో రాజీలు, చివరకు శాశ్వత లేదా కనీసం దీర్ఘకాలిక శాంతికి ఆస్కారం ఏర్పడుతుంది. పోతే, రియాద్ చర్చలకు సంబంధించి గమనించవలసిన విశేషాలు కొన్నున్నాయి. యుద్ధం జరుగుతున్నది రష్యా ఉక్రెయిన్‌ల మధ్య. శాంతి సాధన సంప్రదింపుల కోసం కూర్చున్నది అమెరికా, రష్యాలు. అందుకు తమను కూడా ఆహ్వానించాలని ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ గట్టిగా కోరాయి. కాని అమెరికా అంగీకరించలేదు. రష్యన్లు ఉక్రెయిన్‌ను కాదనలేదు గాని, యూరోపియన్లను తిరస్కరించారు. ఇందుకు నిరసనగా యూరోపియన్ యూనియన్ నాయకులు రియాద్ చర్చలకు ముందు రోజున పారిస్‌లో సమావేశమై తర్జనభర్జనలు పడ్డారు.

అందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా ఉన్నారు. దీనిలో కొన్ని విచిత్రాలు కనిపిస్తాయి. యుద్ధంలో ఉక్రెయిన్ ఒక పక్షం అయినపుడు దాని భాగస్వామ్యం లేకుండా చర్చలేమిటి? వారు యూరప్ దేశం అయినస్థితిలో ఆ దేశాలు యుద్ధంలో ఉక్రెయిన్‌కు పూర్తి మద్దతుగా నిలిచినప్పుడు వారిని ఆహ్వానించకపోవడం ఎందుకు? చర్చల ప్రక్రియకు చొరవ తీసుకున్నది అమెరికా అయినందున, ఈ ప్రశ్నలపై స్వయంగా అధ్యక్షుడు ట్రంప్, తన ఉన్నతాధికార ప్రతినిధులు అంటూ వస్తున్నదేమిటో చూడాలి. రియాద్ సమావేశం ప్రాథమికమైనదే తప్ప వాస్తవ ప్రతిపాదనలపై చర్చల కోసం కాదు. మునుముందు అటువంటి చర్చలు మొదలైనాక “ఏదో ఒక దశలో” ఉక్రెయిన్ భాగస్వామి అవుతుంది. నేరుగా చర్చలలో పాల్గొన్నా, పాల్గొనకపోయినా యూరోపియన్ల ప్రమేయం కూడా ఏదో రూపంలో ఉంటుంది. అంతిమంగా ఏ ఒప్పందమైనా అందరికీ ఆమోదయోగ్యమైతేనే జరుగుతుంది.

ఈ మేరకు అంతా సమంజసంగానే తోస్తుంది. కాని ఇందులో కొన్ని మెలికలున్నాయి. చర్చలలోకి ఉక్రెయిన్ మొదటి నుంచీ కాకుండా “ఏదో ఒక దశలో” రావటం ఏమిటి? యూరోపియన్లు భాగస్వాములు అయితే కావచ్చు లేదా కాకపోవచ్చుననే స్థితి ఎందువల్ల? చివరకు మాత్రం ఒప్పందం అందరికీ ఆమోదయోగ్యం కావటమంటే, అప్పటికి ఉక్రెయిన్, యూరప్‌లు అందుకు అంగీకరించక విధిలేని పరిస్థితిని అమెరికా తన శక్తియుక్తులతో సృష్టించటం కావచ్చునా? ట్రంప్ మాటలను, చేతలను గమనించినప్పుడు ఈ విధమైన సందేహాలు అనివార్యంగా కలుగుతున్నాయి. ఈ వైఖరిలోని న్యాయాన్యాయాల జోలికి వెళ్లకుండా చూసినట్లయితే, తన వ్యూహం మాత్రం ఇదనిపిస్తున్నది.

ఏ విధంగానో తిరిగి అమెరికా అధ్యక్షుని మాటలలోనే గమనిద్దాము. తమ భాగస్వామ్యం లేకుండా సౌదీలో చర్చలు జరుగుతుండటం పట్ల జెలెన్ స్కీ అదే 18వ తేదీన అమెరికాకు వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే ట్రంప్ స్పందిస్తూ, జెలెన్ స్కీ విమర్శ తనను “నిరాశ” పరచిందన్నారు. అంతటితో ఆగలేదు. రష్యా దాడి జరిగిందే ఉక్రెయిన్ కారణంగానని, వారు కోరుకుంటే రష్యాతో ఎప్పుడో సంధి చేసుకునేవారని, ఇప్పుడు ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోవటమే గాక అసలు ఒక దేశంగానే అంతరించిపోతున్నదని అన్నారు. అంతటితో ఆగక, జెలెన్ స్కీ రేటింగ్ పడిపోతున్నాయంటూ, చర్చలకు రావాలంటే ముందు తిరిగి ఎన్నికలలో గెలవటం (ఆయన పదవీ కాలం గడిచి ఏడాది దాటింది) మంచిదని పరోక్ష సూచన చేశారు.

దీని అర్థాలు, పర్యవసానాలు ఏ విధంగా ఉండవచ్చునో ఎవరి అంచనాలకు వారు రావచ్చు. జెలెన్ స్కీ పదవికి ఇప్పుడు చట్టబద్ధత లేదని రష్యా ఎప్పటి నుంచో అంటున్నది. కనుక, శాంతి చర్చలు మొదలయ్యేందుకు, తేలేందుకు చాలా సమయం పడుతుంది గనుక, జెలెన్ స్కీ తిరిగి ఎన్నికై రావలసి ఉంటుందనేది అమెరికా, రష్యాల అప్రకటిత షరతు కావచ్చునా? జెలెన్ స్కీ పట్ల ట్రంప్‌కు ఎన్నడూ సదభిప్రాయం లేదు. తన ఎన్నికల ప్రచార సమయంలో, ఎన్నిక తర్వాత ఆయన తనను కలిసి నచ్చుజెప్పేందుకు ప్రయత్నించినప్పుడల్లా ఈసడింపుగానే మాట్లాడారు. అంతకన్న గమనార్హమైన వ్యాఖ్యలు కూడా కొన్ని ఈ మధ్యకాలంలో చేశారు. రష్యా దాడికి ముఖ్య కారణం ఉక్రెయిన్ నాటోలో చేరాలనుకోవటమేనని అభిప్రాయపడ్డారు. అందుకు మద్దతునిచ్చిన బైడెన్ పెద్ద తప్పు చేశారన్నారు. (ఇది రష్యా అంటున్నదే). రష్యా గురించి మాట్లాడుతూ, వారికి చాలా బలమైన సైనిక యంత్రాంగం ఉందని, లోగడ హిట్లర్‌ను, నెపోలియన్‌ను ఓడించారని గుర్తు చేశారు. వారితో ఉక్రెయిన్ గెలవటం (యూరప్ సహాయపడినా) అసాధ్యమని సూచించారు. గత మూడేళ్ల పాటు అమెరికా సైతం మద్దతునిచ్చినా ఉక్రెయిన్ గెలవకపోవటమే గాక చాలా నష్టపోతున్నది. ఇదే ధోరణికి పొడిగింపుగా, రష్యా ఆక్రమణలో గల భూభాగాలను తిరిగి గెలవటం జరిగేది కాదు గనుక వదలుకోవలసి ఉంటుందని, నాటోలో చేరిక ఆలోచనను శాశ్వతంగా (ట్రంప్ ఒక దశలో 20) ఏళ్ల పాటు వాయిదా అనగా రష్యా అంగీకరించలేదు) మానుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు.

ఉక్రెయిన్ తన వైపు నుంచి చర్చలలో ఏ షరతులు పెట్టినా, చివరకు తాము చెప్పే దానికి అంగీకరించకతప్పదన్నది అమెరికా అధ్యక్షుని ధీమా. అట్లా ఒప్పించే శక్తి తమకుందని ఆయన 18వ తేదీన మరొక మారు అన్నారు కూడా. వాస్తవానికి ఈ విధమైన ధీమా, జెలెన్ స్కీతో పాటు యూరోపియన్ దేశాల బలహీనతలు, నిస్సహాయ స్థితి ట్రంప్ ఇక ఎన్నికలలో గెలిచే అవకాశం ఉన్నప్పటి నుంచే కనిపిస్తూ వచ్చాయి. ఆయన జెలెన్ స్కీని లెక్క చేయకపోవటం, భూభాగాలు వదలుకోవాలనటం, నాటో ను తక్కువ చేసి ఇరకాటంలో పెడుతుండటంతో, తను అధ్యక్షుడైనాక జరగబోయేదేమిటో అందరికీ అర్థమైంది. ఆ స్థితిని ఆపేందుకు ఎవరి ప్రయత్నాలూ ఫలించలేదు. దానితో ఒక్కొక్క మెట్టు దిగిరావటం మొదలైంది. రష్యా ఆక్రమించిన ప్రాంతాలను ఉక్రెయిన్ వదలుకోవలసిరావచ్చునని కొన్ని యూరోపియన్ దేశాలు అంటుండగా, అందుకు జెలెన్ స్కీ సైతం బహిరంగంగా అంగీకరించారు కూడా. వాస్తవానికి, రష్యన్ జాతీయులు ఆధిక్యతలో గల దోన్‌బాస్ ప్రాంతం మొదట రష్యాదే. అక్కడ సోషలిస్టు విప్లవం దరిమిలా సోవియెట్ యూనియన్ ఏర్పడినప్పుడు, ఉక్రెయిన్ రిపబ్లిక్‌కు దానిని బదిలీ చేశారు. 1991లో ఆ యూనియన్ పతనమైన తర్వాత రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి 2014లో అమెరికా మద్దతుతో అధికారానికి వచ్చిన జెలెన్ స్కీ ప్రభుత్వం అక్కడి ప్రజలపై తీవ్రమైన అణచివేతలు ప్రారంభించింది. సమస్యపై రాజీకి రష్యాతో జరిగిన రెండు ఒప్పందాలను అమెరికా, యూరప్ కలిసి భంగపరచాయి.

ఈ నేపథ్యంతో రష్యా ఎంతమాత్రం కొత్త రాజీలకు సిద్ధపడబోదని ట్రంప్‌కు తెలుసు గనుకనే పై విధమైన వైఖరి తీసుకున్నారని భావించాలి. అందుకు మరొక బలమైన కారణం తోడైంది. వ్యక్తిగతంగా వ్యాపారి అయిన ఆయనకు యుద్ధాల కన్నా ఆర్థిక వ్యవహారాలపై శ్రద్ధ ఎక్కువనే పేరున్నది. ఆ ధోరణిని తన మొదటి హయాం (201721)లోనే కొంత చూపగా, ఇప్పుడది మరింత కనిపిస్తున్నది. నాటోకు నిధుల తగ్గింపు నుంచి, ఉక్రెయిన్ సమస్య పరిష్కారంలో భాగంగా అక్కడి అరుదైన లోహాలు ఖనిజాలలో తమకు సగం మేర ఇవ్వాలనటం వరకు ప్రస్తుత సందర్భంలోనూ అది చూడవచ్చు. ఆసక్తికరం ఏమంటే, ఈ 18న రియాద్‌లో జరిగిన చర్చలలోనూ రష్యాతో ఆర్థిక సంబంధాల అభివృద్ధి విషయం ఒక ముఖ్యమైన అంశం అయింది. వీటన్నింటికి ఒక భూమిక గత వారం ట్రంప్, పుతిన్‌ల మధ్య గంటన్నర పాటు సాగిన టెలిఫోన్ సంభాషణలోనే ఏర్పడింది. రాగల కాలంలో జరుగుతుందంటున్న ముఖాముఖి శిఖరాగ్ర చర్చలలో మరింత స్పష్టత వస్తుంది. రియాద్ చర్చల వల్ల కనిపించే మరొక ఆసక్తికరమైన అంశం రష్యా వల్ల తమకు ముప్పు ఉందనే యూరప్ వాదనను ట్రంప్ తిరస్కరించటం.

ఇదే సమయంలో మరొక వైపు యూరోపియన్ యూనియన్ దేశాలు విపరీతమైన ఆందోళనలో పడ్డాయి. ట్రంప్ నాటోకు సుముఖుడు కారన్న సమస్య ఒకటుండగా, ఉక్రెయిన్‌కు తమతోపాటు పూర్తి మద్దతు ఇవ్వాలనే ప్రతిపాదనను కొట్టి వేస్తుండటం మరొకటి అయింది. అమెరికా లేకుండా ఉక్రెయిన్‌ను కాపాడే శక్తి యూరప్‌కు లేదని ఉక్రెయిన్‌తో పాటు యూరప్ కూడా బహిరంగంగా అంగీకరిస్తున్నాయి అందుకే పారిస్ అత్యవసర సమావేశంలో యూరోపియన్ దేశాల మధ్య ఉక్రెయిన్‌కు తమ ఉమ్మడి సేనలను పంపటంపై గాని, ఇతర అంశాలపై గాని ఏకాభిప్రాయం కుదరక అది విఫలమైంది.

ఈ ఒత్తిడితో జెలెన్ స్కీ తొందర పాటుకు గురై ట్రంప్‌ను విమర్శించగా ఆయన మరింత ఘాటైన విమర్శలు చేశారు. దీనంతటి మధ్య పుతిన్ ఒక్కడే సంయమనం చూపుతూ, ఉక్రెయిన్, యూరప్‌లతో చర్చలు అక్కర లేదన్నది తమ వైఖరి కాదని, కాని వారు ఈలోగా ఉద్వేగపడనక్కర లేదని సలహా ఇచ్చారు. యుద్ధంతో సహా అనేక సమస్యల పరిష్కారానికి ముందు అమెరికా, రష్యాల మధ్య పరస్పర విశ్వాసాల స్థాయి పెరగటం అవసరమని, రియాద్‌లో తామిద్దరి చర్చలను ఆ కోణం నుంచి చూడాలని సూచించారు. వాతావరణం రానున్న రోజులలో శాంతించి, సమస్య పరిష్కార ప్రక్రియ ముందుకు సాగగలదని ఆశించాలి.

టంకశాల అశోక్

దర్పణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News