Sunday, December 22, 2024

ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం ఆడిస్తున్న ఆటలేనా?

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో అనేక దేశాలు ఏదో ఒక రకంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. నిలకడగా ఉండలేకపోతున్నాయి. ఏ దేశం బలహీనంగా ఉంది, ఏ దేశం మనకు మద్దతు పలుకుతది, ఎవరితో ఘర్షణకు దిగుదాం అని ఆలోచిస్తున్నాయి. ఎందుకు దీనికి కారణం ఆయుధ పోటీయేనా? లేక అగ్రరాజ్యాలు తెర వెనుక నుండి నడిపిస్తున్నాయా? ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరుధ్యం, గత కొన్ని సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం, సిరియా అంతర్యుద్ధం, ఇజ్రాయెల్ -పాలస్తీనా యుద్ధం, ఇజ్రాయెల్-గాజా యుద్ధం, సరిహద్దు వెంట ఇండియాతో చైనా, పాక్ వైరుధ్యాలను చూస్తూనే ఉన్నాం.

ప్రపంచ దేశాల మధ్య సఖ్యత కుదుర్చడం లేదా ఎవరి మధ్య వైరుధ్యం వస్తాదా అని ఎదురు చూసి, అమెరికాకు అనుకూలంగా లేని దేశం పక్షాన నిల్చొని, ఉన్న వైరుధ్యాన్ని ఇంకాస్త పెద్దది చెయ్యడమేనా పని? ప్రపంచంలో నాటి నుండి నేటి వరకు దునియాకే పెద్దన్నలుగా చెలామణి అవుతున్న అమెరికా, రష్యాలు ఏమని సందేశం ఇస్తున్నాయి. ఆర్థికంగా కొట్టుమిట్టాడుతూ బలహీనపడుతున్న అనేక దేశాలకు చేయ్యి అందించి వారి సరసన చేర్చుకోవడం చేయొచ్చుగా.
అలా లేదు ఏ దేశానికి ఆయుధాలు పంపిద్దాం, ఎవరికి సైనిక బలంతో మద్దతు ఇద్దాం, ఎవరిని ఇరకాటంలో పెడుదాం అనే ధోరణితో ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే సందేశమేనా వారి ఎజెండా. భవిష్యత్తు తరాలకు యుద్ధమే ఎరుగకూడదు అనే ఉద్దేశంతో ప్రపంచ శాంతి కోసం స్థాపించబడిన ఐక్యరాజ్య సమితిలో కీలక పాత్ర పోషించి, వారి గుప్పెట్లో పెట్టుకొని, కనుసన్నలలో నడిపిస్తున్నారు.

ఇదేనా శాంతికి సంకేతం. అగ్రరాజ్యాల మధ్య అనేక మంది అమాయకులు బలి అవుతున్నారు నేడు. ఇటు పక్క చైనా ఏ రకంగా భారత్‌ను దెబ్బతీయ్యాలి అనే ధోరణినే తప్ప మరో ధ్యాస లేదు. ఎక్కడ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రియాశీలక పాత్ర పోషిస్తాదో, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యదేశంగా అవతరిస్తాదో అని కంటి మీద కునుకు లేకుండా ఉంది. భారత్ మీద వైర్యానికి తెరలేపుటకు సిద్ధంగా ఉంటది. భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించడం కోసం సంసిద్ధంగా ఉంటుంది.

ప్రపంచంలోని అనే క దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది. రష్యా, చైనాలతో అమెరికా సంబంధాలు సరిగా లేవు. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తామని రష్యా ప్రతిజ్ఞ చేసింది. మరో వైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం గాజాలో విధ్వంసం సృష్టించింది. ప్రపంచంలో మరో యుద్ధమంటూ మూడవ ప్రపంచ యుద్ధమే సంభవిస్తే ఇక ఈ భూమి మీద జీవరాశి మనుగడ ఉండదు. పూర్తి వినాశనానికి దారి తీస్తుంది. ఇలా అని తెలిసి కూడా అగ్రరాజ్యాలు వాటి బలాబలాల నిరూపణకు ఎంతటి దాష్టీకానికి అయినా పాటుపడుతారా? రెండు లేదా అంతకంటే ఎక్కువ సమూహాలు సైనిక ఆధిపత్యంలో పోటీ పడినప్పుడు ఆయుధ పోటీ జరుగుతుంది. ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య ఉన్నతమైన సాయుధ బలగాలను కలిగి ఉండటానికి పోటీని కలిగి ఉంటుంది.

రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అణ్వాయుధాలను ఉపయోగించడం వలన సోవియట్ యూనియన్ అటువంటి ఆయుధాలను సంపాదించడానికి నిశ్చయాత్మకమైన, త్వరలో విజయవంతమైన ప్రయత్నానికి దారి తీసింది. ఆ తర్వాత రెండు అగ్ర రాజ్యాల మధ్య సుదీర్ఘ కాలంగా అణు ఆయుధ పోటీ జరిగింది. సోవియట్ యూనియన్ తన మొదటి అణు పరీక్షను 1949లో నిర్వహించింది. 1956 చివరి నాటికి అమెరికా వద్ద 2,123 వ్యూహాత్మక వార్‌హెడ్‌లు, సోవియట్ యూనియన్ వద్ద 84 ఉన్నాయి. ఆ సంఖ్య తరువాతి 30 సంవత్సరాలలో వేగంగా పెరిగాయి. అమెరికా ఆయుధాగారం 1967లో 31,000 కంటే ఎక్కువ వార్‌హెడ్‌ల వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. సోవియట్ ఆయుధగారం సుమారు 20 సంవత్సరాల తర్వాత 40,000 కంటే ఎక్కువ స్థాయికి చేరుకుంది. 1990 ప్రారంభంలో ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో ఆ ఆయుధ పోటీ ముగిసింది. అయితే, 2019లో, రష్యా ఒప్పందాన్ని అనేక సార్లు ఉల్లంఘించిందని పేర్కొంటూ అమెరికా తను అదే ధోరణిలో ప్రయాణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News