Tuesday, December 24, 2024

సంపాదకీయం: తొలగని యుద్ధ మేఘాలు

- Advertisement -
- Advertisement -

PM Narendra modi security breach in punjab నల్లసముద్రానికి తనను దూరం చేసి ఏకాకిని చేయడానికి అమెరికా, యూరపు దేశాలు, నాటో దళాలు కుట్ర పన్నాయనే అభద్రతా భావంతో రష్యా 2014 నుంచి ఉక్రెయిన్‌పై పగబట్టింది. దానిలో అంతర్భాగమైన క్రిమియాను ఆక్రమించుకున్నది. అప్పటి నుంచి రగులుతున్న ఉక్రెయిన్ వివాదం నానాటికీ మరింత వేడెక్కుతూ ప్రస్తుతం యుద్ధం అంచులకు చేరుకున్నది. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత అంత వరకు ఒకే ఉమ్మడి వ్యవస్థలో అంతర్భాగాలుగా వున్న రష్యా, ఉక్రెయిన్లు ఇతర సోవియట్ రాష్ట్రాల మాదిరిగానే స్వతంత్ర దేశాలయ్యాయి. ఉక్రెయిన్, రష్యాకు చేరువుగా వున్నందున రష్యా బలపడుతున్న కొద్దీ దాని అభద్రతా భయాలు పెరుగుతూ వచ్చాయి. అందరికీ సమాన దూరంలో వుంటూ తన స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విధానాన్ని పాటించాలని ఉక్రెయిన్ మొదట్లో ఆశించింది. కాని అది ఫలించలేదు. ఉక్రెయిన్ పార్లమెంటులో యూరపు దేశాల మద్దతుదార్లు అధిక సంఖ్యాకులు కావడంతో పరిస్థితి దిగజారడం ప్రారంభించింది. ఉక్రెయిన్ మూడవ అధ్యక్షుడైన విక్టర్ ఫెడరోవిచ్ యెనుకోవిచ్ 2010లో ఎన్నికై 2014 తిరుగుబాటులో పదవీచ్యుతుడయ్యాడు. యూరపు దేశాల మద్దతుతో తలెత్తిన రెవల్యూషన్ ఆఫ్ డిగ్నిటీ తిరుగుబాటు కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్షన్నర మందికిపైగా రష్యా సేనలు మోహరించి వున్నాయి. దాని సరిహద్దు దేశమైన బెలారస్‌లో ఉమ్మడి సైనిక కవాతుల పేరుతో 30 వేల మంది రష్యా దళాలు తిష్ఠవేసుకొని వున్నాయి. ఉత్తర ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల తిరుగుబాటుదార్లకు, ఉక్రెయిన్ దళాలకు కాల్పులు సాగుతూనే వున్నాయి. వీటిని నిలిపివేసి దౌత్యమార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలనే అంగీకారం రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మేక్రాన్ మధ్య కుదిరిందని, మొత్తం యూరపు ప్రాంత భద్రతా పరిస్థితులపై కొత్త అంగీకారానికి రావాలన్న అవగాహన కూడా ఏర్పడిందని వచ్చిన వార్తల విశ్వసనీయత ఆ తర్వాత పలచబడిపోయింది. అటువంటి పురోగతికి ఆస్కారం లేనట్టు క్షేత్ర స్థాయి పరిస్థితి తెలియజేస్తున్నది. పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మధ్య శాంతి చర్చలు జరుగుతాయని ఫ్రాన్సు అధ్యక్ష భవనం వెల్లడించిన అనతికాలంలోనే అటువంటి ఆలోచనేదీ తమ వైపు నుంచి లేనట్టు రష్యా అధ్యక్ష భవనం ప్రకటించింది. రష్యా ఏ విధంగానైనా ఉక్రెయిన్‌ని కబళించాలని చూస్తున్నదని అది యుద్ధం చేసి తీరుతుందని అమెరికా చెబుతూనే వున్నది. ఒకవేళ దౌత్య మార్గాల్లో పరిష్కారానికి అది అంగీకరించి యుద్ధాన్ని నిజాయితీతో వాయిదా వేసుకుంటే అప్పుడు పుతిన్‌తో బైడెన్ సంభాషణలు జరుపుతారని అమెరికా ప్రకటించి వుంది.

రష్యాను డాలరు, పౌండ్లతో కూడిన లావాదేవీల నుంచి బహిష్కరిస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అయినా రష్యా శాంతియుత పంథాకు మళ్లబోదని అది ఉక్రెయిన్‌పై దాడి చేసి తీరుతుందని ఆయన జోస్యం చెప్పారు. రివల్యూషన్ ఆఫ్ డిగ్నిటీ యూరపు దేశాలు, అమెరికా, నాటో మంత్రించిందేనన్న అవగాహనతో అందుకు ప్రతిగా ఉత్తర ఉక్రెయిన్‌లో తిరుగుబాటును రష్యా పోషించడం ప్రారంభించింది. తన భూభాగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేయడంతో తన సైన్యం జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఉక్రేనియన్లు మరణించినట్టు రష్యా తాజాగా ప్రకటించింది.

యూరపులో భాగంగా వుండి దానికి అనుకూలంగా నడుచుకోవాలని కోరుకునే శక్తులు ఉక్రెయిన్‌లో అధికారంలో వున్నంత కాలం రష్యాకు కంటి మీద కునుకుండదు. రష్యాతో సత్సంబంధాలను కోరుకునే శక్తులు ఉక్రెయిన్‌లో ఆధిపత్యం చెలాయిస్తే అది అమెరికాకు, యూరపు దేశాలకు గిట్టదు. పుతిన్ సారథ్యంలో క్రమక్రమంగా బలపడుతున్న రష్యా తనకు అతి సమీపంలోని ఉక్రెయిన్‌ను పూర్తిగా తన చెప్పుచేతల్లోని శక్తుల ఆధీనంలో పెట్టుకోవాలని చూస్తున్నది. పరోక్ష పెత్తనానికి బదులు ప్రత్యక్షంగా దానిని ఆక్రమించుకోవాలని సంకల్పించింది. అందుకే అంత భారీ ఎత్తున అక్కడ సైన్యాన్ని మోహరించింది. అయితే యుద్ధ సంకల్పం లేదని పదేపదే చెబుతున్నది. అమెరికా, యూరపు దేశాలు ఎంతగా తాపత్రయ పడినా ఈ యుద్ధం అంతిమంగా రష్యాకు అనుకూలంగా ముగింపుకి చేరుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. నేరుగా యుద్ధం ద్వారా కాకపోయినా పరోక్షంగానైనా ఉక్రెయిన్‌లో తన తిరుగులేని తనాన్ని నెలకొల్పుకోవాలని రష్యా చూస్తున్నది. ఉక్రెయిన్‌పై మాస్కో యుద్ధం చేస్తే రష్యా జర్మనీల మధ్య నిర్మాణంలో వున్న ఆయిల్ పైప్‌లైన్‌ను మరచిపోవలసి వుంటుందని జో బైడెన్ ఇటీవల హెచ్చరించారు. అటువంటి పరిణామం అమెరికా, జర్మనీలనూ దూరం చేయొచ్చు. ఇన్ని సంక్లిష్టతలున్న ఈ యుద్ధానికి దూరంగా వుండాలని ఇండియా నిర్ణయించుకోడం హర్షించవలసిన పరిణామం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News