Saturday, January 25, 2025

ఇంకెన్నాళ్ళీ యుద్ధం?

- Advertisement -
- Advertisement -

కొత్త సంవత్సరానికి కేవలం నాలుగు రోజుల చేరువలో వున్నాము. ద్రవ్యోల్బణాన్ని, ఆకలిని ప్రపంచమంతటా రగిలించిన ఉక్రెయిన్ యుద్ధం కూడా 2023లోకి అడుగుపెట్టి కొనసాగే సూచనలు భయపెడుతున్నాయి. యుద్ధం మొదలై పది మాసాలు గడిచిపోయాయి. కొద్ది కాలంలోనే ఉక్రెయిన్‌ను జయించి యుద్ధానికి తెరదించవచ్చుననుకొన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంచనాలు దెబ్బ తిన్నా యి. ఇంత వరకు ఆక్రమించుకొన్న ప్రాంతాన్ని తమ భూభాగంగా చేసుకొని యుద్ధానికి స్వస్తి చెప్పాలని ఆయన ఆశిస్తూ వుండవచ్చు.

కాని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ద్వారా పుతిన్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని అమెరికా, యూరపు దేశాలు కోరుకొంటున్నందునే యుద్ధం ఇంత సుదీర్ఘ కాలం కొనసాగుతున్నదనే అభిప్రాయం నెలకొన్నది. పుతిన్ ఆశించినట్టు రష్యా సేనలు ఎదురులేని తనాన్ని నిరూపించుకోలేక పోతున్నా రు. యుద్ధ రంగంలో చప్పబడిపోతున్నాయి. అదే సమయంలో ఉక్రెయిన్ సేనలు ఎదురు దాడిలో ఉత్సాహాన్ని కనబరుస్తున్నాయి. ఖేర్సన్ నగరం నుంచి మాస్కో దళాలు ఉపసంహరించుకోడం ఇందుకు ఒక నిదర్శనం. ఈ నగరాన్ని ఉక్రెయిన్ సేనలు తిరిగి స్వాధీనం చేసుకొన్నాయి.

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఆక్రమించుకోడంలో కూడా రష్యా విఫలమైంది. అయితే ఉక్రెయిన్‌లోని 20 శాతానికి పైగా భూభాగం ప్రస్తుతం రష్యా ఆధీనంలో వున్నట్టు తెలుస్తున్నది. ఈ యుద్ధానికి ముందు ఉక్రెయిన్‌లోని 17000 చ.కి.మీ విస్తీర్ణం గల భూభాగం రష్యా ఆధీనంలో వున్నది. అందులో 2014 లోనే ఆక్రమించుకొన్న క్రిమియాతో పాటు వేర్పాటువాదుల ప్రాబల్యంలో గల డొనెట్స్, లుహాన్స్‌లు కూడా వున్నాయి. ఈ పది మాసాల యుద్ధంలో దొరకబుచ్చుకొన్న భూభాగంతో కలిపి ఇప్పుడు రష్యా ఆధీనంలో 51000 చ.కి.మీ ఉక్రెయిన్ వున్నట్టు స్పష్టపడుతున్నది. అయితే సైనికపరంగా, యుద్ధ సామగ్రి పరంగా రష్యా చాలా నష్టపోయింది. అయినా ఏకపక్షంగా యుద్ధ విరమణను ప్రకటించడం పుతిన్‌కు ప్రతిష్ఠపరమైన సమస్యగా మారినట్టు బోధపడుతున్నది.

జెలెన్‌స్కీ ఈ మధ్య అమెరికా వెళ్ళి మరింత సైనిక సాయాన్ని అర్థించారు. ఈ సమయంలో తెలివైన ప్రపంచ సారథులు చేయవలసింది శాంతి చర్చలకు తగిన వాతావరణాన్ని కల్పించడమే. ఎందుకంటే ఇప్పటికే ఉక్రెయిన్‌లో చెప్పనలవికానంత మానవ విషాదం సంభవించింది. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను యుద్ధం కుంగదీసింది. అప్పటికే కరోనా కారణంగా దెబ్బతిన్న దేశదేశాల ఆర్థిక వ్యవస్థలు యుద్ధం సృష్టించిన ద్రవ్యోల్బణం, ఆహార కొరత వంటి నష్టాలతో మరింత కుంగిపోయాయి. ఉక్రెయిన్‌లో దాదాపు 70 లక్షల మంది స్వస్థలాలు విడిచిపెట్టి నిర్వాసితులై ఇతర ప్రాంతాల్లో తలదాచుకొంటున్నారు. 6500 మంది మరణించారు. 10 వేల మంది క్షతగాత్రులయ్యారు.

రష్యన్ వైమానిక దాడులకు ఆసుపత్రులు, బడులు వంటి పౌర సౌకర్యాలు ధ్వంసమై ప్రజలు నానాయాతనలు పడుతున్నారు. భరించరాని చలిలో లక్షలాది మంది శిథిల భవనాల్లోనే ప్రాణాలు అరచేతపట్టుకొని గడుపుతున్నారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడి పౌరులను అగ్నిపరీక్షకు గురి చేస్తున్నది. యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి జరగవలసి వుండిన ఆహార ఎగుమతులకు అంతరాయం ఏర్పడి తూర్పు ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో ఆకలి విలయ నాట్యం చేయడం ప్రారంభించింది. ఉక్రెయిన్ నుంచి అనేక దేశాలకు భారీగా ఆహార ధాన్యాల ఎగుమతులు జరుగుతూ వుండేవి. 2021లో ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల మందికి ఉక్రెయిన్ ఆహారం అందింది. యుద్ధం మొదలైన తర్వాత ఐదు మాసాల పాటు ఈ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది.

నల్ల సముద్ర మార్గాలు మూతపడడంతో ఈ దుస్థితి తలెత్తింది. మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఇది శరాఘాతమైంది. అప్పటికే వాతావరణ మార్పుల వల్ల ఆహార కొరత ఏర్పడిన ఈ ప్రాంతాల్లోని ప్రజలను యుద్ధం మరింతగా క్షుధార్తులను చేసింది. గోధుమల ధరలు మిన్నంటాయి. ఇంధన ధరలు కూడా పెరిగాయి. ఇప్పటికైనా శాంతి చర్చలకు ద్వారాలు తెరవడం విజ్ఞతాయుతం అవుతుందని విజ్ఞులు, అనుభవజ్ఞులు హితవు చెబుతున్నారు. సకాలంలో శాంతి మార్గాలు వెతక్కుండా మొండితనం ప్రదర్శించడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది మరణించారని ఇప్పుడు అది మళ్ళీ సంభవించకూడదని సూచిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ పుతిన్‌తో మాట్లాడినప్పుడు ఇది యుద్ధాల కాలం కాదని ఆయనకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా మోడీ మాట్లాడుతున్నారు. రెండు వైపుల వారు వృథా ప్రతిష్ఠకు పోవడం ప్రపంచ హానికి దారి తీస్తుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో వుంచడం కోసం అమెరికా ఫెడరల్ బ్యాంకు వంటివి వడ్డీ రేట్లను పెంచుతూ పోవడం వల్ల 2023లో ప్రపంచ మంతటా మాంద్యం నెలకొంటుందని జోస్యాలు వెలువడుతున్నాయి. దానికి తోడు యుద్ధం ఇలాగే కొనసాగితే పేద ప్రజానీకం చెప్పనలవికాని బాధలు పడుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News