Sunday, December 22, 2024

సద్దుమణిగిన తిరుగుబాటు!

- Advertisement -
- Advertisement -

గత ఏడాది ఫిబ్రవరి నుంచి విడుపు లేకుండా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు దిగ్భ్రాంతి కలిగిస్తూ ఆయన సైన్యంలో ఒక చిన్న తిరుగుబాటు సంభవించి వెంటనే సద్దుమణిగింది. గత శనివారం నాడు చోటు చేసుకొన్న ఈ పరిణామం ప్రపంచాన్ని తనను తాను నమ్మలేని పరిస్థితిలోకి నెట్టివేసింది. అమెరికా సహాయంతో తీవ్రమైన ప్రతిఘటన ఇస్తున్న ఉక్రెయిన్‌ను పాదాక్రాంతం చేసుకొనేందుకు అదే పనిగా దాని మీద దాడులు చేస్తున్న రష్యా సేనలపై ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆశిస్తున్నట్టు తొందరలోనే పుతిన్ యుద్ధానికి స్వస్తి చెబుతాడా అనే ప్రశ్నలు కీలకమైనవి. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన, ఆహార ధరలు విపరీతంగా పెరిగిపోడానికి కారణమైన యుద్ధం తొందరలోనే ముగియాలని అన్ని దేశాల ప్రజలు కోరుకొంటున్నారు.

త్వరగా ముగించేద్దామనుకొన్న తాజా యుద్ధం ఎప్పటికీ అంతానికి రాకపోడం పుతిన్‌కు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుండవవచ్చు. ఇది నిస్సందేహంగా ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కాదు. అమెరికా పరోక్ష పాత్ర సుస్పష్టం. చైనా కూడా తన వద్ద గల మందు గుండును రష్యాకు అండగా పంపించిందని ఇటీవల కొన్ని వార్తలు వెల్లడించాయి. ఇలా కీలక దశలో వున్న యుద్ధంలో ప్రిగోజిన్ తెగువ అసాధారణ ఘట్టమే. వాగ్నర్ గ్రూపు అనే మిలిటరీ సంస్థకు చెందిన కిరాయి సైన్యానికి ప్రిగోజిన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సేనలు 50 వేల వరకు వుంటాయని అంచనా. వీరంతా రష్యా జైళ్లలో ఖైదీలుగా గడిపిన వారేనని సమాచారం. ప్రిగోజిన్ కూడా అనేక బందిపోటు దొంగతనాలకు పాల్పడి పట్టుబడిన వాడేనని తెలుస్తున్నది. రష్యా తరపున 30కి పైగా దేశాల్లో ఈ కిరాయి సేనలు పని చేశాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి ఒక వైపు అభ్యర్థి ఓటమి కోసం కుట్ర పన్నిన నేపథ్యం కూడా ఈ మూకలకు వున్నదని సమాచారం. యుద్ధ రంగం లో వీరిపై ప్రభుత్వ సేనలు దాడులు జరిపాయని, సరైన సరఫరాలు లేనందున వీరు అక్కడ కొనసాగలేని పరిస్థితి తలెత్తిందని దానితో ప్రిగోజిన్ పుతిన్ ప్రభుత్వాన్ని దించివేస్తానంటూ తన సేనలతో మాస్కో మార్గం పట్టాడని రూఢి అవుతున్నది. అయితే మాస్కోకు 200 కి.మీ దూరంలో వుండగా రష్యాకు సన్నిహిత దేశమైన బెలారస్ మధ్యవర్తిత్వం నెరపి ఈ తిరుగుబాటు మూకను దారికి తెచ్చింది. ప్రిగోజిన్‌ను బెలారస్ తీసుకు వెళ్ళారు. ఈ పరిణామం భవిష్యత్తులో పుతిన్ నిర్ణయ దారుఢ్యాన్ని దెబ్బ తీయవచ్చని అమెరికా అనుకూల వర్గాలు ఆశిస్తున్నాయి.

పుతిన్‌కు చెప్పనలవికాని దెబ్బ తగిలిందని సంబరపడుతున్నాయి. నాణేనికి రెండో వైపు చూస్తే ప్రిగోజిన్ బతుకు జీవుడా అంటూ లొంగిపోయాడని అనుకోడానికి కూడా ఆస్కారం కలుగుతున్నది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు, సైనిక దళాల ప్రధానాధికారి గెరాసిమోవ్‌లను తొలగించాలని ప్రిగోజిన్ డిమాండ్ చేస్తున్నాడు. రష్యా యుద్ధానికి వెళ్ళడమే తప్పు అని వాదిస్తున్నాడు. వాస్తవానికి ప్రిగోజిన్ తిరుగుబాటు రష్యా సైన్యంలోని పుతిన్ వ్యతిరేక శక్తులన్నింటికీ ఒక మంచి అవకాశం. అయితే వారెవరూ ఆయనతో కలిసి రాలేదు. అంటే పుతిన్ గట్టిగా వున్నట్టే కదా! అయినా ఈ తిరుగుబాటు పుతిన్ బలహీనతనే చాటుతున్నదని, ఉక్రెయిన్‌పై ఆయన విజయం సాధించడం సులభ సాధ్యం కాదని చెబుతున్నదని కొందరు విమర్శకులు భావిస్తున్నారు.

రష్యా పశ్చిమ సైనిక కమాండ్ కేంద్రం వున్న రోస్తోవ్ ఆన్‌డాన్ నగరాన్ని ప్రిగోజిన్ సేనలు ఆక్రమించుకొన్న దశలో పుతిన్ వాటిని ఏమీ చేయలేకపోడాన్ని ఆయన వైఫల్యంగా పరిగణిస్తున్నారు. ప్రిగోజిన్ రష్యా యుద్ధ కాంక్షను తీవ్రంగా విమర్శించాడని, అది పుతిన్ బలహీనతను బయటపెట్టిందని అంటున్నారు. పుతిన్ తానే రష్యా, రష్యాయే తాను అని చెబుతుంటారు. పుతిన్ లేకపోతే రష్యా లేదు అని పదే పదే వల్లెవేయిస్తుంటారు. కాని ప్రిగోజిన్ తిరుగుబాటుకు ముందే పుతిన్‌కు వ్యతిరేకంగా కొంత మంది జాతీయ వాదులనేవారు ఏకమయ్యారు. వీరు తమను తాము ఆగ్రహ దేశభక్తులుగా ప్రకటించుకొన్నారు. ఈ బృందం మొన్న శనివారం నాడు వాగ్నర్ సైనికులు మాస్కో వైపు బయల్దేరినప్పుడు వారికి మద్దతు ప్రకటించిందని చెబుతున్నారు.

ప్రిగోజిన్‌కు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సంస్థలున్నాయని సమాచారం. ఇంత వరకు ఆయనతో వున్న వాగ్నర్ సైనికులు ఇక ముందు రష్యా అధికారిక సైన్యాలకు లొంగిపోవలసి రావచ్చు. ఈ పరిణామంతో అమెరికా ఆశిస్తున్నట్టు పుతిన్ బలహీనపడతాడో లేక మరింత బలం పుంజుకొని యుద్ధాన్ని నిరవధికంగా కొనసాగిస్తాడో చూడాలి. యుద్ధం ప్రస్తుతానికి నాటో సేనల నుంచి రష్యాను శాశ్వతంగా కాపాడుకోవాలనే పుతిన్ ఆకాంక్ష నుంచో, ఆయనను ఓడించి తీరాలనే అమెరికా, పాశ్చాత్య దేశాల వ్యూహం నుంచో ఊడిపడి వుండవచ్చు. కాని అది కొనసాగడం మొత్తం మానవాళికే ప్రమాదకరం. అందుచేత ఏ కారణం వల్లగాని దానికి వీలైనంత త్వరలో తెరపడాలని కోరుకొందాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News