Thursday, December 19, 2024

అమెరికా వ్యూహానికి ఉక్రెయిన్ బలి

- Advertisement -
- Advertisement -

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అగ్ర రాజ్యంగా అవతరించినప్పటి నుంచి ఈ 80 సంవత్సరాల కాలంలో వారి ప్రయోజనాలకు అనేక దేశాలు బలయ్యాయి. ఆ వరుసలో ఇప్పటి వంతు ఉక్రెయిన్‌ది అవుతున్నది. అమెరికా నాయకత్వాన గల సైనిక కూటమి నాటో లో చేరనట్లయితే ఉక్రెయిన్‌కు రాగల నష్టమేమీ లేదు. అదే విధంగా ఒకవేళ చేరినా కలిగే ప్రయోజనమూ లేదు. కాని అట్లా చేరితే అమెరికాకు ఉండే లాభం చాలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రష్యాను తమ వ్యూహంలో మరింత బిగించవచ్చు. ఇది నెరవేరేందుకే వారు ఏ విధంగానైనా భారత దేశాన్ని ఒత్తిడి చేసి, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థంగా ఉండటం గాక తమ పక్షం వహించేట్లు చేయాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోడీ గత నెల 23న ఉక్రెయిన్ వెళ్ళి అధ్యక్షుడు జెలెన్ స్కీని కలిసినప్పుడు ఇదే ప్రయత్నం మరొకసారి కన్పించింది.

కాని అందుకు ససేమిరా అన్నందుకు మోడీని అభినందించాలి.సమస్యకు పరిష్కారం ఆ రెండు దేశాలు కూర్చుని చర్చించుకోవటంలో మాత్రమే ఉందని సూటిగా చెప్పారాయన. యుద్ధం 2022 ఫిబ్రవరిలో మొదలై సరిగా రెండున్నర సంవత్సరాలు అవుతున్నది. రెండు వైపుల కలిసి మృతులు, గాయపడిన వారు కొన్ని లక్షల మంది. నిర్వాసితులైన వారు అంతకు అనేక రెట్లు. గ్రామాలు, పట్టణాలు, ఆస్తులు వివిధ నిర్మాణాల విధ్వంసానికి అంచనాలు అయినా లేవు. రష్యా తో పోల్చితే ఉక్రెయిన్ భూభాగం, జనాభా, ఆర్థిక వ్యవస్థ అన్నీ ఎంతో చిన్నవి. అయినప్పటికీ మంచి వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం ఉన్నందున తన పరిమితిలో తాను బాగానే జీవిస్తున్నది. తగినంత తోడ్పాటు ఉంటే రాగల కాలంలో మరింత బాగుపడగలదు. ఈ యుద్ధానికి ముందు రష్యాకు, దానికి పొరుగునే గల ఉక్రెయిన్‌కు మధ్య కొన్ని సమస్యలు ఉండినప్పటికీ, ఆర్థిక వాణిజ్య సంబంధాలు సజావుగానే ఉండటం గమనించదగ్గ విశేషం. అటువంటి స్థితిలో ఉక్రెయిన్‌ను తమ సైనిక కూటమిలో చేర్చుకుని రష్యాను ఉక్కిబిక్కిరి చేసేందుకు అమెరికా ప్రయత్నాలు సాగించటంతో సమస్య మొదలైంది. ఆ వ్యూహం నుంచి ఆత్మరక్షణకు రష్యా తన ప్రయత్నం తానే చేయటంతో యుద్ధం మొదలైంది. మధ్యలో ఉక్రెయిన్ బలవుతున్నది.

ఈ నేపథ్యం గురించిన సమాచారం, అవగాహన తగినంత లేనందున, యుద్ధం ఆరంభ దశలో చాలా మందికి రష్యా దాడి ఆశ్చర్యకరంగా తోచింది. ఉక్రెయిన్‌పై సానుభూతి కలిగింది. ఆ సానుభూతిలో తప్పక న్యాయం ఉంది. కాని, అటువంటి ఒక చిన్న దేశాన్ని తన వ్యూహం కోసం పావుగా ఉపయోగించుకుంటున్న అమెరికా గురించి క్రమంగా అర్థమయ్యే కొద్దీ, వాస్తవాలేమిటో అందరికీ తెలిసి రావటం మొదలైంది. కనుక, ఈ యుద్ధం ప్రస్తావన రాగానే ముందు అమెరికాను, యూరోపియన్ యూనియన్‌ను, నాటో కూటమిని వేలెత్తి చూపి దోషులుగా నిలబెట్టటం పెరుగుతున్నది. స్వయంగా అమెరికాకు, యూరప్‌కు చెందిన పలువురు మేధావులు, నిపుణులు, మాజీ సైన్యాధికారులు ఒక వైపు, అనేకానేక దేశాధినేతలు మరొక వైపు ఈ విషయంలో అమెరికాను, నాటోను నిందిస్తున్నారు. అందువల్ల, మోడీ ఉక్రెయిన్ పర్యటనను, యుద్ధంలో తమ పక్షం వహించాలంటూ జెలెన్ స్కీ చేసిన అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించటాన్ని ఈ నేపథ్యం నుంచి అర్థం చేసుకోవలసి ఉంటుంది. సమస్యను ఉక్రెయిన్, రష్యా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప బయటివారు కాదని మోడీ అన్నమాటకు కూడా తగినంత అర్థం ఉంది. యుద్ధానికి మూలకారణం అమెరికన్లు నాటోను విస్తరించజూడటమని,

అందుకు ఉక్రెయిన్ బలవుతున్నదని ఆయనకు బాగా తెలుసు. ఇది కేవలం ఊహాగానం కాదు. లోగడ కొన్ని సార్లు పాశ్చాత్య మీడియా ప్రతినిధులు విదేశాంగ మంత్రి జై శంకర్‌ను యుద్ధం విషయంలో ఇండియా వైఖరి పొరపాటు అంటూ ఎత్తి చూపినప్పుడు, ‘అది మీ యుద్ధం. మాది కాదు. ఏదో ఒక వైఖరి తీసుకోవాలంటూ మమ్మల్ని ఎందుకు ఒత్తిడి చేస్తున్నా’ రంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. అది నిజమే. యుద్ధాన్ని పాశ్చాత్య రాజ్యాలు తమ ప్రయోజనాల కోసం సృష్టించాయి. అందుకోసమే కొనసాగిస్తున్నాయి. ఇండి యా సహా ప్రపంచమంతా తమ వాదనను అంగీకరించి తమ వ్యూహానికి సహకరించాలంటున్నాయి. గమనించదగినదేమంటే ఈ రోజున అనేక ఇతర దేశాధినేతల నోటి వెంట కూడా సరిగా జైశంకర్ తరహా వ్యాఖ్యలే వినవస్తున్నాయి. అమెరికా, యూరపులు తమ ప్రయోజనాల కోసం ఇతర దేశాలను బలి తీసుకోవడం గతం నుంచి జరుగుతూ వస్తున్నట్లే ఉక్రెయిన్ విషయంలోనూ జరుగుతున్నదని కూడా వారు సూటిగా అంటున్నారు. కాని అమెరికా లెక్క చేయటం లేదు.
వియత్నాం నుంచి అఫ్ఘానిస్థాన్ వరకు వారు చేసిన యుద్ధాలన్నీ మనకు గుర్తున్నాయి.

సరిగా ఇదే సమయంలో గాజాలో జరుగుతున్నదేమిటో చూస్తున్నాము. ఇజ్రాయెల్ వెనుక అమెరికా, యూరప్‌లు లేనట్లయితే అది సాధ్యమా? అదే పద్ధతిలో ఉక్రెయిన్ వెనుక అమెరికా కూటమి లేనట్లయితే ఆ సమస్య ఎన్నడో ముగిసేది. బహుశా అసలు తలెత్తేది కాదు. లేదా కనీసం చర్చలతో పరిష్కారం లభించేది. రష్యా ప్రధానంగా కోరుతున్నది ఉక్రెయిన్‌ను నాటో కూటమిలో చేర్చుకోరాదని. అట్లా చేరనందువల్ల పైన అనుకున్నట్లు, ఉక్రెయిన్‌కు కలిగే నష్టం ఆవగింజంతైనా ఉండదు. కనుక అందుకు అభ్యంతరం ఉండకూడదు. కాని చర్చలు వద్దని, యుద్ధం కొనసాగించాలని, ఎన్నటికైనా రష్యాను ఓడించవచ్చునని, అందుకు అన్ని సహాయాలు చేస్తామని రెచ్చగొడుతున్నది అమెరికా. తమ స్వంత ప్రయోజాలున్నది అందులోనే గనుక. ఇటు ఉక్రెయిన్ నుంచి, అటు గాజా నుంచి అమెరికా కొన్ని వేల మైళ్ల దూరంలో ఉంది. గతంలో వియత్నాం వలే. అయినప్పటికీ యావత్ ప్రపంచంపై తమ ఆధిపత్యం సాగాలని, ప్రపంచంలోని అన్ని వనరులు, అన్ని మార్కెట్లపై నియంత్రణ తమదే కావాలని భావిస్తున్న అమెరికా,

యూరప్‌ల చరిత్ర అందరికీ తెలిసిందే అయినందున ఇక్కడ మళ్లీ రాయనక్కర లేదు. అయితే, 1991లో సోవియట్ యూనియన్ పతనానంతరం తమ నాయకత్వాన ఏర్పడిన ఏకధ్రువ ప్రపంచం, ఇరవయ్యేళ్లు గడిచిన తర్వాత గత పది సంవత్సరాలుగా బలహీనపడుతుండటం వారికి ఆందోళనకరంగా మారింది. ఈ పదేళ్ళుగా బహుళ ధ్రువ ప్రపంచం అనే మాట విరివిగా వినవస్తున్నది. ఆ దిశలో రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా తదితర దేశాల నాయకత్వాన అనేక ఆర్థిక వాణిజ్య అంతర్జాతీయ సంస్థలు ఏర్పడి బలపడుతున్నాయి. పలు ఇతర దేశాలు వాటిలో చేరుతున్నాయి. వాటిని చీల్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇటీవల, డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ సృష్టికి సైతం ప్రయత్నాలు మొదలు కావటంతో అమెరికాకు ఆందోళన పెరుగుతున్నది. ఉక్రెయిన్ యుద్ధ విషయమై అమెరికా పట్టుదలను ఈ వ్యూహంలో భాగంగా చూడాలి. ఇది భారత ప్రభుత్వానికి బాగానే అర్థమైనట్లు మనకు ఇప్పటికే స్పష్టమవుతున్నది.

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News