Wednesday, January 22, 2025

మరో మానవ విషాదం!

- Advertisement -
- Advertisement -

Russia Ukraine War live updates ఎవరిది ధర్మపక్షం, మరెవరిది కాదు అనే దానిని అటుంచితే యుద్ధం సృష్టించే మానవ విషాదం అంతా ఇంతా అని చెప్పనలవికానిది. యుద్ధమంటే శత్రు సేనల ముఖాముఖీ పోరాటమే కావాలి గాని, అవతలి దేశాన్ని ధ్వంస ధూళి చేయడం, అక్కడి ఆవాసాలపై, శరణాలయాలపై, విద్యా సంస్థలపై బాంబులు వర్షించి పసి పిల్లల ప్రాణాలను సైతం బలిగొనడం ఎంత మాత్రం కాదు. కాని ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న నిర్విరామ భీకర దాడుల్లో వేలాది మంది మరణిస్తున్నారు. 40 లక్షల మంది కట్టుబట్టలతో ఉక్రెయిన్‌ను వీడి వెళ్లి పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్నారు. గడ్డ కట్టించే చలిలో గజగజవణుకుతున్నారు. ప్రభుత్వేతర సంస్థలు సహా అనేక మంది దాతలు వారిని ఆదుకుంటున్నారు. శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడి వారు ఎక్కడికి పోయారో, ఎవరెక్కడున్నారో తెలియక మానవ సంబంధాలు తెగిపోయి అక్కడ ఎంతటి విషాదం అలముకుంటున్నదో చెప్పలేము. అన్ని లక్షల మంది ఆత్మగౌరవానికి ముప్పు కలగడం ఆధునిక సమాజం, ఆధునికత సిగ్గు పడవలసిన విషయం. ఒకవైపు చర్చలు సాగిస్తున్నట్టే కనిపించి మరోవైపు ఉక్రెయిన్ నగరాలపై రష్యా నిరాఘాటంగా అగ్నివర్షం కురిపిస్తుండడం అత్యంత ఆందోళనకరం.

మరియుపోల్‌లో ఉక్రెయిన్ సేనలు లొంగిపోనందుకు రష్యా ఆ నగరాలపై మరింత కక్ష వహించి దాడులు కొనసాగించ డం అత్యంత అమానుషం. ఉక్రెయిన్‌పై రష్యా సేనల ఏకపక్ష దాడులు మొదలై దాదాపు నెల కావస్తున్నది. ఇంకా దానికి తెరపడడం లేదు. ఈ యుద్ధం వల్ల అనేక సరకులకు, క్రూడాయిల్‌కు కొరత ఏర్పడి మిగతా ప్రపంచంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, దానికి బలైపోతున్న బడుగు జీవితాల గురించి ప్రత్యేకించి ప్రస్తావించుకోవలసిన పని లేదు. అది అందరికీ తెలిసిందే. ఉక్రెయిన్ తెల్లజెండా ఎగరేసి, చేతులెత్తేసి పూర్తి లొంగుబాటును ప్రదర్శించే వరకు రష్యా దాడులకు తెర దించేటట్టు కనిపించడం లేదు. కీవ్, మరియుపోల్ వంటి ఉక్రెయిన్ నగరాలకు, దాని ఆర్థిక మూలాలకు యుద్ధం వల్ల కలుగుతున్న నష్టాన్ని పూడ్చుకోడానికి ఏళ్లూపూళ్లూ పట్టిపోతుంది. పచ్చగా బతుకుతున్న దేశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆధిపత్య కాంక్ష శ్మశానంగా మార్చివేసింది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం లేదా బలహీనులపై బలవంతుడి దురాక్రమణ దాడి జరిగితే దాని ప్రభావం అమాయక ప్రజల మీద విపరీతంగా పడుతుంది.

యెమెన్‌పై సౌదీఅరేబియా దాడులు సృష్టిస్తున్న విషాదం కూడా గమనించదగినది. అక్కడ సౌదీ సేనలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో లక్షా 50 వేల పైచిలుకు మంది దుర్మరణం పాలు కాగా, యుద్ధం వల్ల కలిగిన కరువు కారణంగా మరి అంత మంది మరణించారని సమాచారం. ఉక్రెయిన్ యుద్ధానికి ప్రత్యక్షంగా బాధ్యత వహించవలసిన వాడు పుతిన్ అయితే పరోక్షంగా అమెరికా, దాని మిత్ర దేశాలు విశేషంగా బాధ్యులు. ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్షంగా సూపర్ సానిక్ బాంబులను కూడా ప్రయోగిస్తుంటే ప్రపంచం కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తున్నది. ఉక్రెయిన్‌ను అమెరికా, నాటో చెప్పుచేతల్లోంచి బయటపడేసే వరకు విశ్రమించేది లేదన్నట్టు రష్యా రోజురోజుకీ దాడుల ఉధృతిని పెంచుతూ వుంటే అమెరికా, దాని మిత్ర దేశాలు సహా ప్రపంచంలోని మిగతా దేశాలు మాత్రం తమకేమీ పట్టనట్టు వుంటున్నాయి. ఉక్రెయిన్ చుట్టూ వున్న యూరప్ దేశాలు, అమెరికా అనుకూల శక్తులు దానికి ఆర్థిక, ఆయుధ మద్దతును ఇస్తూ అంతటితో చేతులు దులుపుకుంటున్నాయి. శరణార్థులకు అవి చేస్తున్న సాయం మెచ్చుకోదగినదే. అయినప్పటికీ ఈ యుద్ధం మరింతగా విస్తరించి విస్తృత ప్రాంతీయ ప్రళయంగా మారకుండా అంతిమంగా రష్యా అణ్వస్త్ర దాడులకు, అణ్వస్త్ర యుద్ధానికి దారితీయకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా వుంది.

దీనిని అమెరికా గాని, ఉక్రెయిన్ పొరుగునున్న యూరప్ దేశాలు గాని ఎందుకు గుర్తించడం లేదో అర్థం కాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా దీనిని ఇంకా పెద్ద యుద్ధంగా మార్చి పుతిన్‌ను ఓడించేలా చేసే వరకు కొనసాగించాలని చూస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇన్ని రోజులుగా రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నందుకు జెలెన్‌స్కీకి ప్రపంచ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రశంసల్లో ఆయన మరింత పట్టుదలకు పోయి తన దేశాన్ని, దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం విజ్ఞతాయుతం అనిపించుకోదు. ముందుగా ఈ యుద్ధం వల్ల కలుగుతున్న మానవ ఖేదాన్ని ఆపాలి. ఉక్రెయిన్ వాసులు పొట్టచేతపట్టుకొని కట్టుబట్టలతో తరలివెళ్లడం వల్ల చుట్టు ప్రక్కల దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బ తింటాయి. ఇన్ని లక్షల మంది బతుకులు అల్లకల్లోలం, అస్తవ్యస్తం అవుతాయి. ఈ ప్రళయాన్ని ఎవరూ ఆపలేరా, ఈ యుద్ధానికి చరమగీతం పాడలేరా? అనే ప్రశ్నకు జవాబు చెప్పవలసిన బాధ్యత అమిత బలప్రాబల్యాలు కలిగిన అమెరికా, చైనా తదితర పెద్ద దేశాల మీద వుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News