కీవ్ : రష్యాలో సైన్యంపై కీలక తిరుగుబాటు దశలో ఉక్రెయిన్ తన దూకుడు పెంచింది. ఇప్పుడు ఉక్రెయిన్ సేనలు ఇనుమడించిన ఆత్మస్థయిర్యంతో ముందుకు కదులుతున్నాయి. శత్రు శిబిరంలో నెలకొన్న అసంతృప్తి, అక్కడి సైన్యానికి వ్యతిరేకంగా నెలకొన్న సాయుధ తిరుగుబాటు పరిణామం జరిగి 24 గంటలు కాకముందే పరిస్థితిని తమకు మరింత అనుకూలం చేసుకునేందుకు ఉక్రెయిన్ వ్యూహరచనకు దిగింది. రష్యాలో పుతిన్ కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గెని ప్రిగోజిన్ తిరుగుబాటుతో రష్యాలోని రోస్టోవ్ ఆన్ డాన్ నగరం ఇప్పుడు అక్కడి సైన్యం నుంచి చేజారింది.
మరో వైపు మాస్కోను వాగ్నర్ సేనల నుంచి కాపాడుకునేందుకు రష్యా సేనలు శ్రమిస్తున్నాయి. ఇప్పుడు రష్యా సైన్యం ఇంతవరకూ తమకు తెచ్చిపెట్టిన దిగ్బంధ పరిస్థితిలో అంతర్గతంగా పడి కూరుకుపోతోందని ఉక్రెయిన్ భావిస్తోంది. రష్యా సైనిక నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు కదిలిన వాగ్నర్ బృందం పట్ల ఉక్రెయిన్ ఈస్టర్న్ సైనిక బలగాల అధిపతులు ఇప్పుడు కరతాళధ్వనుల నడుమ అభినందిస్తున్న వీడియోలు వెలువడ్డాయి. ఇప్పుడు యుద్ధ క్షేత్రంలో ముందుండే తమ బలగాలకు ప్రత్యర్థిపక్షంలో నెలకొన్న ఎటువంటి అశాంతి అయినా కలిసివస్తుందని తెలుసునని ఉక్రెయిన్ సైన్యం అధికారి ప్రతినిధి సెర్హి చెరెవటి తెలిపారు.
పాప్‌కార్న్ తింటూ ఉక్రెయిన్ ఆర్మీ ఆనందం
ఇప్పుడు రష్యాసైన్యానికి వ్యతిరేకంగా సాగుతోన్న అంతర్గత తిరుగుబాటు పరిణామాలను ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ డ్రోన్ కమాండర్ రాబర్ట్ మగ్యర్ స్వాగతించారు. ఓ వైపు వీడకుండా పాప్‌కార్న్ తింటూ రష్యాలో తిరుగుబాటు దృశ్యాలను ఆయన తిలకిస్తూ కేరింతలు కొట్టడం ఇప్పుడు నెట్‌లో వైరల్ అయింది. మరో వైపు రష్యా నేత వ్లాదిమిర్ పుతిన్‌ను ఉక్రెయిన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో గేలి చేస్తున్నారు. రష్యాలో ఇక పుతిన్ ముఖం ఎత్తుకుని తిరగలేరని, ఇప్పటి పరిణామం రాబోయే పూర్తి స్థాయి అస్థిరతకు సంకేతం అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి రష్యాలో నెలకొన్న ప్రతిష్టంభన బెలారస్ జోక్యంతో కొంత మేర సద్దుమణిగింది. రష్యా సైనిక నేతలతో ప్రిగోజిన్‌కు రాజీ కుదిరిందనే వార్తలు వెలువడ్డాయి.ఇది ఇంతటితో ఆగదని, తరువాతి పరిణామాలు అనేకం ఉంటాయని ఉక్రెయిన్ పరిశీలకులు భావిస్తున్నారు.
పుతిన్ బలహీనపడిపోతూ , చివరికి ఎటుకాని స్థితిలో పడ్డారని, ప్రిగోజిన్ వెన్నుపోటుతో ఇప్పుడు పుతిన్ ఆదేశాలకు విలువ లేనిస్థితి ఏర్పడిందని వెల్లడైంది. అయితే ఈస్టర్న్ ఉక్రెయిన్‌లో 1000 కిలోమీటర్ల దూరం వరకూ ఉన్న రష్యా సైనికాధిపత్యానికి ఇప్పుడు రష్యాలో తలెత్తి, సద్దుమణిగిన తిరుగుబాటు వల్ల ఎటువంటి ప్రమాదం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే రష్యాలో తలెత్తిన తిరుగుబాటును శరవేగంతో ఉక్రెయిన్ వాడుకోలేకపోయిందని, అక్కడి తిరుగుబాటు నేతతో వెనువెంటనే సంప్రదించే యత్నాలు చేపట్టలేదని, ఈ పనిచేసే లోగానే రష్యా పరిస్థితి సద్దుమణిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరో వైపు వాగ్నర్ తిరుగుబాటు సమసినా , ఇప్పుడు పుతిన్ బలహీనత వెలుగులోకి వచ్చినందున ఆయనకు పలు రకాలుగా ముప్పు పొంచి ఉందని విశ్లేషిస్తున్నారు.
ఇప్పుడిక ప్రిగోజిన్ జాగ్రత్త ః అమెరికా
కిటికీల వద్ద నిలబవద్దని సిఐఎ హితవు
రష్యా అధ్యక్షులు పుతిన్‌తో వాగ్నర్ ప్రిగోజిన్ ముందు ధైర్యంతోనే తిరుగుబాటుకు దిగాడు. కానీ తిరిగి రాజీపడటం ద్వారా ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్లే అయిందని అమెరికా గూఢచార, నిఘా సంస్థ సిఐఎ విశ్లేషించింది. ఇకపై ప్రిగోజిన్ ఎక్కడైనా కిటికీల వద్ద నిలబడ రాదని హెచ్చరించింది. ఇది ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని సిఐఎ చీఫ్ డేవిడ్ పేట్రాయస్ తెలిపారు. పుతిన్ విరోధులు చాలా మంది తెరిచి ఉన్న కిటికీల వద్ద నిలబడి అనుమానాస్పద రితిలో కింద పడి ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. ప్రిగోజిన్ చాలా ఆవేశంతో పుతిన్ సైన్యానికి వ్యతిరేకంగా ముందుకు కదిలాడని,
అయితే తిరుగుబాటును ఉపసంహరించుకోవడంతో చివరికి తన వాగ్నర్ గ్రూప్‌ను పోగొట్టుకున్నారని అన్నారు. రాజీకి వచ్చి ఆయన బెలారస్ వెళ్లారని అంటున్నారని , అక్కడి తెలిసీతెలియని వాతావరణంలో ఆయన అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి తెరిచి ఉంచిన కిటికీల వద్ద నిలబడరాదని సూచించారు. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఎవరినైనా పుతిన్ అంతతేలిగ్గా వదిలిపెట్టే వాడు కాదని, బెలారస్‌లోనే ప్రిగోజిన్‌కు ఏదైనా జరగవచ్చునని ఓ పాత్రికేయురాలు కూడా తెలిపారు. రష్యాలో ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ నేతలు, వ్యాపార ప్రముఖులు అదృశ్యం కావడం, ప్రాణాలు పోవడం వంటి పరిణామాలు జరిగాయని గుర్తు చేశారు.