Saturday, April 5, 2025

సమిష్టి డిమాండ్ తగ్గిపోతోంది

- Advertisement -
- Advertisement -

సాధారణంగా సమష్టి డిమాండ్ (మొత్తం డిమాండ్) అంటే ఒక నిర్దిష్ట ధర వద్ద, ఒక నిర్దిష్ట కాలంలో వస్తువులు, సేవలకు మార్పిడి చేయబడిన మొత్తం ద్రవ్యంగా వ్యక్తీకరించబడుతుంది. మొత్తం డిమాండ్‌ను సాధారణంగా వినియోగం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం, నికర ఎగుమతులు వంటి నాలుగు వనరుల మొత్తంగా వర్ణిస్తారు. ప్రపంచ సమష్టి డిమాండ్ తగ్గడానికి దోహదపడే ప్రధాన అంశాలుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం వంటి వి ఉన్నాయి. ప్రపంచ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, జీవన వ్యయ సంక్షోభం, ఇంధన ధరలు, వడ్డీ రేటు పెంపుదల, ప్రపంచ పరపతి కఠినత్వం, కొవిడ్ మహమ్మారి పరిణామాలు, లాజిస్టిక్స్ సవాళ్లు, ముడి పదార్థాల కొరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, వాణిజ్య అనిశ్చితి మొదలైనవి మొత్తం డిమాండ్ తగ్గడానికి కారణమవుతున్నాయి.

సమష్టి డిమాండ్ తగ్గడం వల్ల వాస్తవ స్థూల దేశీయోత్పత్తి, ఆర్థిక ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రకారం 2025, 2026 సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి 3.3 శాతంగా అంచనా వేయబడింది, ఇది చారిత్రక (2000-19) సగటు 3.7 శాతం కంటే తక్కువ. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో మందగమనం ప్రపంచ డిమాండ్ బలహీనపడటానికి దోహదం చేస్తుంది. అమెరికా, యూరోపియన్ దేశాల నుండి చైనా, భారతదేశం, బ్రెజిల్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ద్రవ్యోల్బణం, వడ్డీరేటు పెంపుదల, ప్రపంచ సరఫరా గొలుసు అంతరాయాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మిశ్రమం కారణంగా తగ్గుతున్న సమష్టి డిమాండ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి.

అనేక ఇతర ఆర్థిక వ్యవస్థల మాదిరిగానే భారతదేశం కూడా తగ్గుతున్న మొత్తం డిమాండ్ (Aggregate Demand) ద్వారా గణనీయంగా ప్రభావితమవుతుంది. భారతదేశంలోమొత్తం డిమాండ్‌లో తగ్గుదల ప్రధానంగా తగ్గిన వినియోగం, తగ్గిన పెట్టుబడి, తగ్గుతున్న ప్రభుత్వ వ్యయం, బలహీనమైన నికర ఎగుమతుల నుండి వస్తుంది. ఏదేశమైనా దేశీయ వినియోగంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇది దాని స్థూల దేశీయోత్పత్తిలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల, డిమాండ్‌లో ఏదైనా మందగమనం ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో భిన్న పరిణామాలను కలిగిస్తుంది. ఆర్థిక మాంద్యం, పేదరికం, అసమానత, రాజకీయ అస్థిరత, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంపై ప్రభావం, నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎలు) వంటి విస్తృత ఆర్థిక పరిణామాల కారణంగా భారతదేశం తగ్గుతున్న మొత్తం డిమాండ్ ద్వారా తీవ్రంగా ప్రభావితమవుతుంది.

ఈ ప్రభావాలు ఉపాధి నుండి వ్యాపార పెట్టుబడి, ఎగుమతులు, ఆర్థిక ఆరోగ్యం వరకు వివిధ రంగాలలో అలలు రేపుతాయి. భారతదేశంలో మొత్తం డిమాండ్‌ను ప్రభావితం చేసే కీలక అంశాలు చూసినపుడు ద్రవ్యోల్బణ ఒత్తిడి ఫిబ్రవరి 2025లో 3.6%. ఇది కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది, వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా వడ్డీ రేట్లను పెంచింది, ఇది ప్రైవేట్ పెట్టుబడి, వినియోగాన్ని తగ్గించవచ్చు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అమెరికా, చైనా మందగమనం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కోవిడ్ మహమ్మారి వంటి ప్రపంచ అంశాలు భారతదేశ ఎగుమతులు, పెట్టుబడి రాకపోకలు ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.

ప్రభుత్వ సంస్కరణలు వస్తువులు, సేవల పన్ను (జిఎస్‌టి), మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి నిర్మాణాత్మక సంస్కరణలు దేశీయ తయారీ, పెట్టుబడి ఎగుమతులను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, వాటి పూర్తి ప్రభావాలు కార్యరూపం దాల్చడానికి సమయం పట్టవచ్చు. డిసెంబర్ 2024లో, భారత దేశంలో ప్రైవేట్ వినియోగం స్థూల దేశీయోత్పత్తిలో 64.8% వాటాను కలిగి ఉంది. కొవిడ్ మహమ్మారి తర్వాత గ్రామీణ భారతదేశం గణనీయమైన కోలుకుంది. అయినప్పటికీ పట్టణ ప్రాంతాలు ఇప్పటికీ మొత్తం వినియోగంలో ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. అయితే, వ్యవసాయ ఇబ్బందులు, ఆదాయ అసమానత ఇతర నిర్మాణాత్మక సవాళ్ల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ వృద్ధి కొద్దిగా నెమ్మదిగా ఉంది. భారతదేశ రిటైల్ రంగం దేశ స్థూల దేశీయోత్పత్తికి దాదాపు 10% దోహదపడుతుంది.

వచ్చే దశాబ్దంలో దాదాపు 9- 10% కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్) వద్ద వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది, 2032 నాటికి దాదాపు $2 ట్రిలియన్ల విలువను చేరుకుంటుంది. భారతదేశ వినియోగదారుల విశ్వాసం హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అధిక ఇంధన ధరలు ఉపాధి ఆందోళనల కారణంగా 2024లో వినియోగదారుల ఆశావాదం తగ్గినట్లు నీల్సన్ ఐక్యూ వినియోగదారుల విశ్వాస సూచిక చూపించింది.సాంకేతికత, ఇ- కామర్స్, తయారీ వంటి రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవాహాలు బలంగా ఉన్నాయి. 2024లో, ఏప్రిల్- డిసెంబర్ కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 27% పెరిగాయి. అయితే, అధిక నిష్క్రమణల కారణంగా నికర ఎఫ్‌డిఐ తగ్గింది. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశ ప్రభుత్వ వ్యయం 48.21 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది, ఇది స్థూల దేశీయోత్పత్తి లో 19.4%.ఈ భాగాలలో ఏదైనా తగ్గుదల సమిష్టి డిమాండ్ తగ్గడానికి దారితీస్తుంది.

మెరుగుపరచడానికి చర్యలు ఒక దేశం కేంద్రబ్యాంకు నియంత్రణలో ఉన్న ద్రవ్యవిధానం, రుణ వ్యయాలు, పెట్టుబడి, వినియోగదారుల ఖర్చులను ప్రభావితం చేయడం ద్వారా మొత్తం డిమాండ్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇసిబి) ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు వారి బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్ గతంలో ప్రతికూల వడ్డీ రేట్లతో ప్రయోగాలు చేశాయి. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను ప్రత్యక్షంగా ప్రభావితం చేయడానికి ప్రభుత్వాలు ఆర్థిక విధానాన్ని ఉపయోగించవచ్చు.

చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, 2021 అమెరికా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్లు వంటి పెద్ద-స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మొత్తం డిమాండ్‌ను పెంచే లక్ష్యంతో ఆర్థిక ఉద్దీపన ప్రకటించాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో అమెరికా నిరుద్యోగ బీమా ప్రయోజనాలు, అలాగే స్పెయిన్, ఫిన్లాండ్ వంటి దేశాలలో యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ (యుబిఐ) చర్చలు ఇందుకు ఉదాహరణలు. ఇటీవల, చైనా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మొత్తం డిమాండ్‌ను పెంచడానికి మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడానికి ఒక ఉదాహరణ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News