Monday, March 10, 2025

ఉక్రెయిన్ సైనికులపై దాడికి గ్యాస్ పైప్‌లైన్‌ను ఉపయోగిస్తున్న రష్యా

- Advertisement -
- Advertisement -

కీవ్ : కురుస్క్ ప్రాంతంలో వెనుక నుంచి ఉక్రెయిన్ దళాలపై దాడికి రష్యన్ ప్రత్యేక దళాలు ఒక గ్యాస్ పైప్‌లైన్ లోపల కిలోమీటర్లు నడిచారని ఉక్రెయిన్ మిలిటరీ, రష్యన్ వార్ బ్లాగర్లు వెల్లడించారు. ఒక అనూహ్య దాడిలో కీవ్ స్వాధీనం చేసుకున్న తన సరిహద్దు ప్రావిన్స్ భాగాలను తిరిగి తన అధీనంలోకి తెచ్చుకునేందుకు మాస్కో యత్నిస్తోంది. ఉక్రెయన్ ఆగస్టులో కురుస్క్ లోపలికి చొచ్చుకుపోయేందుకు సాహసోపేతంగా సీమాంతర దాడి ప్రారంభించింది. రెండవ ప్రపంచ యుద్ధం దరిమిలా రష్యన్ భూభాగంపైకి అది అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు. కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్ దళాలు వ్యూహాత్మక సరిహద్దు పట్టణం సుద్జాతో సహా వెయ్యి చదరపు కిమీ భూభాగాన్ని కైవసం చేసుకుని, వందలాది మందిని రష్యన్ యుద్ధ ఖైదీలుగా తీసుకున్నాయి.

భవిష్యత్తులో శాంతి చర్చల్లో బేరసారాల్లో లబ్ధి పొందడం, తూర్పు ఉక్రెయిన్‌లో దాడుల నుంచి రష్యన్ సైనికులను మళ్లించేలా ఒత్తిడి చేయడం లక్షంగా ఆ దాడి నిర్వహించినట్లు కీవ్ వెల్లడించింది. అయితే, ఉక్రెయిన్ అకస్మాత్ దాడి జరిగిన కొన్ని నెలల తరువాత కురుస్క్‌లో ఆ దేశం జవాన్లు 50 వేల మందికి పైగా సైనికుల అవిశ్రాంత దాడులతో భయవిహ్వలురై ఉన్నారు, ఆ 50 వేల మందిలో రష్యా మిత్ర దేశం ఉత్తర కొరియా సైనికులు కొందరు కూడా ఉన్నారు. వేలాది మంది ఉక్రెయన్ జవాన్లను ప్రత్యర్థి దళాలు చుట్టుముట్లే ప్రమాదంలో ఉన్నట్లు యుద్ధ రంగం ఓపెన్ సోర్స్ చిత్రపటాలు సూచిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో జన్మించిన, క్రెమ్లిన్ అనుకూల బ్లాగర్ ఒకరు ‘టెలిగ్రామ్’లో చేసిన పోస్ట్‌ల ప్రకారం, యూరప్‌నకు గ్యాస్ సరఫరా కోసం మాస్కో ఇటీవలి వరకు ఉపయోగించిన పైప్‌లైన్‌లో దాదాపు15 కిమీ మేర రష్యన్ సైనికులు నడిచారు.

సుద్జా పట్టణం సమీపాన వెనుక నుంచి ఉక్రెయిన్ దళాలపై దాడి చేయడానికి ముందు కొందరు రష్యన్ సైనికులు అనేక రోజుల పాటుపైప్‌లోనే ఉండిపోయినట్లు బ్లాగర్ యూరి పొదొల్యాకా తెలిపారు. ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరిలో రష్యా ఆక్రమణకు ముందు ఆ పట్టణంలో సుమారు ఐదు వేల మంది నివాసులు ఉన్నారు. సుద్జాలో తీవ్ర స్థాయిలో పోరు సాగుతోందని, రష్యన్ దళాలు గ్యాస్ పైప్‌లైన్ ద్వారా పట్టణంలోకి ప్రవేశించగలిగారని అలియాస్ ‘టూ మేజర్స్’ అనే మారు పేరు వాడుకునే మరొక వార్ బ్లాగర్ తెలిపారు, సుద్జా వెలుపల అడుగుపెట్టే యత్నంగా రష్యన్ ‘విధ్వంసక, దాడి బృందాలు’ ఆ పైప్‌లైన్‌ను ఉపయోగించుకున్నట్లు ఉక్రెయిన్ సిబ్బంది ధ్రువీకరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News