ఫ్రాన్స్ అధ్యక్షుడితో ఫోన్ సంభాషణలో పుతిన్ స్పష్టీకరణ
మొత్తం ఉక్రెయిన్‌ను నిస్సైనికం చేయడమే ఆయన లక్షంగా కనిపిస్తోంది
మేక్రాన్ సలహాదారు వ్యాఖ్య
పారిస్: ఉక్రెయిన్‌పై జరుపుతున్న సైనిక చర్య విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గేలా కనిపిండం లేదని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్ గురువారం పుతిన్‌తో గంటన్నర సేపు జరిపిన సంభాషణలో ఈ విషయం స్పష్టమయిందని అధ్యక్షుడి సలహాదారు ఒకరు చెప్పారు. ‘పుతిన్ అధ్యక్షుడితో చెప్పిన మాటలను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి చెప్పారు. మేక్రాన్‌తో పుతిన్ సంభాషణపై రష్యా కూడా స్పందించింది. లక్షం నెరవేరేదాకా వెనక్కి తగ్గేది లేదని పుతిన్ ఫ్రాన్స్ అధ్యక్షుడికి స్పష్టం చేసినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఉక్రెయిన్ చర్చలను ఆలస్యం చేసే కొద్ది మరిన్ని డిమాండ్లు తెరమీదికి తీసుకు వస్తామని కూడా పుతిన్ చెప్పినట్లు తెలిపింది. కాగా పుతిన్ మాటలను బట్టి చూస్తే మొత్తం ఉక్రెయిన్‌ను నిస్సైనికం(డి మిలిటరైజేషన్) చేయడమే ఆయన లక్షంగా కనిపిస్తోందని ఆ అధికారి చెప్పారు. పౌరుల మరణాలను ఆపాలని, మానవతా సాయాన్ని అనుమతించాలని మేక్రాన్ పుతిన్‌ను కోరగా, తాను దానికి అనుకూలమే కానీ ఎలాంటి స్పష్టమైన హామీ లేకుండా అది సాధ్యం కాదని పుతిన్ స్పష్టం చేసినట్లు ఆ అధికారి చెప్పారు.