మా దేశంలోకి శరణార్థులు పోటెత్తగలరు!
హంగేరియన్ ప్రధాని ఓర్బన్ హెచ్చరిక
బుడాపెస్ట్: ఒకవేళ రష్యా ఉక్రెయిన్‌పై దాడిచేస్తే వేలాది మంది ఉక్రెయిన్ శరణార్థులు తన దేశంలోకి పారిపోయి వస్తారని హంగేరి ప్రధాని విక్టర్ ఓర్బన్ శనివారం హెచ్చరించారు. ఆయన వార్షిక ప్రసంగంలో ఈ విషయం చెప్పారు. అంతేకాక ఏప్రిల్ 3న జరుగనున్న హంగేరి పార్లమెంటరీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన ఆరంభించారు. రష్యా, ఉక్రెయిన్‌పై దాడి చేస్తుందన్న భావర యూరొప్‌లో ఉద్రిక్తతలను పెంచుతోంది. అన్ని రకాల వలసలను విక్టర్ ఓర్బన్ వ్యతిరేకిస్తుంటారు. రష్యాపై ఆంక్షలు విధించాలన్న యూరొపియన్ యూనియన్ ప్రణాళికలను ఆయన వ్యతిరేకించారు. అగ్రరాజ్యంపై ఆంక్షలు, శిక్షాత్మక విధానాలు, బోధించడం(లెక్చరింగ్) లేక ఇతరత్రా ఏదేని చేయడం పనిచేయదు” అని ఆయన అభిప్రాయపడ్డారు. విక్టర్ ఓర్బన్ 2010 నుంచి హంగేరికి నాయకత్వం వహిస్తున్నారు.
ఆయన గత వారం క్రెమ్లిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌తో సమావేశం అయ్యారు. తన దేశానికి రష్యా నుంచి మరింతగా గ్యాస్ షిప్‌మెంట్ కోసం లాబీయింగ్ చేశారు. ఉక్రెయిన్, నాటో మంత్రివర్గ సమావేశాలను కూడా హంగేరి బ్లాక్ చేసింది. కాగా ఉక్రెయిన్ హంగేరి, రష్యా మధ్య ఓ కీలక బఫర్ జోన్‌గా పనిచేస్తుందని అన్నారు. అందువల్ల ఉక్రెయిన్ స్వతంత్రత, విజయవంతంగా పనిచేయడం(వయాబిలిటీ) అన్నవి హంగేరి ప్రయోజనంపై ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇదిలా ఉండగా నాటో, అమెరికా నుంచి మిలిటరీ రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ను హంగేరి తిరస్కరించింది. తన దేశాన్ని రక్షించుకునేందుకు హంగేరి స్వదేశీ మిలిటరీయే సరిపోగలదని కూడా వారికి చెప్పడం జరిగింది.