Tuesday, December 24, 2024

ఇక ఆగేది లేదు అవసరమైతే అణుబాంబులు

- Advertisement -
- Advertisement -

Russia will not hesitate to drop nuclear bombs on Ukraine

రష్యా అధ్యక్షులు పుతిన్ హెచ్చరిక
యుద్ధం మరింత తీవ్రతరం
3 లక్షల మంది సైనికుల సమీకరణ
అమెరికా నాటో దేశాల కపటనాటకాలు
ఉక్రెయిన్ ప్రాంతాల కైవసానికి సన్నద్ధం
టీవీలో అధినేత ప్రసంగం

మాస్కో : ఉక్రెయిన్‌పై యుద్ధం మరింత తీవ్రతరం చేస్తామని, ఇది నిజానికి రష్యాకు మరో వైపు ఓ జట్టుగా నిలిచిన పాశ్యాత్య సైనిక సమీకరణకు మధ్య యుద్ధం అని దేశాధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. నేటి నుంచే (బుధవారం) తమ దేశంలో అత్యవసర ప్రాతిపదికన యుద్ధంలో దిగేందుకు శిక్షణ పొందిన సైనిక సిబ్బందిని (రిజర్విస్టులు) సిద్ధం చేసే ప్రక్రియను ఆరంభిస్తున్నట్లు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత తమ దేశంలో సాగే అతి భారీసైనిక సమీకరణ ఇదేనని తేల్చిచెప్పారు. రష్యా ప్రజలను ఉద్ధేశించి బుధవారం ఆయన టీవీలో ప్రసంగించారు. దాదాపుగా 3,00,000 మంది రిజర్విస్టులను సిద్ధం చేస్తామని, ఈ విధంగా దేశం ఉక్రెయిన్‌కు పరోక్షంగా పాశ్చాత కూటమికి సవాలు విసిరేందుకు లేదా వారి సవాళ్లను తిప్పికొట్టేందుకు పాక్షిక సైనిక సమీకరణకు దిగుతుందని స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్ భూభాగాలు అనేకం రష్యా స్వాధీనం నుంచి చేజారడంతో, ఉక్రెయిన్‌లో తమ యుద్ధ వ్యూహం వికటించిందనే విమర్శల నేపథ్యంలో పుతిన్ జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు.

రష్యా అవసరం అయితే ఉక్రెయిన్‌పై అణుబాంబులను కూడా వేయడానికి వెనుకాడబోదని, దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో రష్యాపై కక్ష కట్టి ఉన్న పాశ్చాత్య దేశాలు గ్రహించాలని పరోక్షంగా అమెరికా ఇతర దేశాలకు హెచ్చరిక వెలువరించారు. పశ్చిమ దేశాలు కొంతకాలంగా రష్యాకు వ్యతిరేకంగా అణుబాంబుల దాడుల కుట్రకు దిగుతూ , అణ్వాయుధాల బ్లాక్‌మొయిల్‌కు దిగుతున్నాయని, ప్రపంచాన్ని పలురకాలుగా మభ్యపెడుతున్నాయని ఈ దశలో తాము తమ వద్ద ఉన్న అణుబాంబును ప్రయోగించేందుకు వెనుకాడేది లేదని , దీనిని తమ ప్రగల్బాల మాటగా భావించరాదని తెలిపారు. కొన్ని దేశాల కుట్రలకు వ్యతిరేకంగా ఇప్పుడు తాము దేశంలో పెద్ద ఎత్తునే సైనిక సమీకరణకు దిగాల్సి వస్తోందని స్పష్టం చేశారు. తమ దేశ ప్రాంతీయత సమగ్రతను కాపాడుకునేందుకు తాము ఏదైనా చేసి తీరుతామని, ఈ సందర్భంగా పశ్చిమదేశాలు తమ మాటలను ఉత్తుత్తి మాటలుగా భావించరాదని, సైనిక పరిభాషలో తాము సైన్యం సమీకరణ ప్రక్రియల పదం బ్లఫ్‌ను వాడుతున్నామని, దీనిని తమ శత్రుదేశాలు ఉత్తుత్తి బ్లఫ్‌గా భావించరాదని పేర్కొన్న పుతిన్ ప్రస్తుత రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో వేడిని మరింతగా పెంచారు.

రష్యా సార్వభౌమాధికారానికి విఘాతం కలిగేలా ఏ శక్తి చూసినా ఊరుకునేది లేదన్నారు. అత్యవసరంగా దేశంలో అత్యధిక సంఖ్యలో పటిష్ట సైనిక దళాలను సమీకరించి ఉంచేందుకు రంగం సిద్ధం చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులపై తాను సంతకం చేశానని వివరించారు. ఈ మేరకు ప్రక్రియ ఆరంభం అయిందన్నారు. యుద్ధక్షేత్రంలోని సైనికులు స్థిరమైన రీతిలో ఉక్రెయిన్‌పై బాంబు దాడులకు దిగాలి. రష్యా సరిహద్దు ప్రాంతాల్లోని ఉక్రెయిన్ భూభాగాలపై ఆధిపత్యం పెంచుకుని తీరాలి. ఇదే విధంగా విముక్తి పొందిన ఉక్రెయిన్ భూభాగాలను ఎంచుకుని దాడులు ముమ్మరం చేయాలని తాను సైన్యాన్ని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌లు ఉక్రెయిన్‌ను కేంద్రంగా చేసుకుని రష్యాపై దాడులకు సిద్ధం అవుతున్నాయని లేదా రష్యాను యుద్ధంలోకి నెట్టేలా చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. అణ్వాయుధాలను ఎక్కుపెట్టడానికి సిద్ధం అవుతున్న దేశాలు మరో వైపు రష్యాపై అసత్య ప్రచారానికి దిగుతున్నాయని పుతిన్ దాడికి దిగారు.

రష్యాను ధ్వంసం చేసేందుకు భారీ స్థాయి కుట్ర జరుగుతోందని పేర్కొన్న పుతిన్ దీనికి సంబంధించి ఎక్కువగా వివరణ కానీ సాక్షాధారాలు కానీ తెలియచేయలేదు. అయితే తమ దేశాన్ని రక్షించుకునేందుకు తాము దాడుల ఉధృతికి దిగడమే మార్గంగా ఎంచుకున్నామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 24న యుద్ధం ఆరంభం తరువాత ఇప్పుడు పుతిన్ తీవ్రస్థాయి స్పందన ఇదే తొలిసారి అయింది. ఉక్రెయిన్‌లోనిప్రాంతాలను రష్యా ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్య ఉంటుందని హెచ్చరించారు. పుతిన్ టీవీ ప్రసంగంతో అమెరికా నాయకత్వపు నాటో సైనిక కూటమికి, రష్యాకు మధ్య ప్రత్యక్ష ఘర్షణ దిశలో అడుగులు పడుతున్నాయని, ఇది ఏకంగా మూడవ ప్రపంచ యుద్ధమే అవుతుందని ఆందోళన వ్యక్తం అయింది.

వెంటనే 3 లక్షల సైనికులు సిద్ధం
రష్యా రక్షణ మంత్రి సెర్గీ వెల్లడి

పుతిన్ జాతిని ఉద్ధేశించి ప్రసంగించిన వెంటనే రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ స్పందించారు. వెనువెంటనే దేశవ్యాప్తంగా ఉన్న సుశిక్షితులైన మూడులక్షల మంది సైనికులను ఇప్పటి యుద్థానికి సమీకరించడం జరుగుతుందని రోసియా 24 టీవీ ప్రసారంలో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News