అంకారా : శాంతి చర్చల దిశగా అమెరికారష్యా దౌత్యవేత్తలు టర్కీలో గురువారం భేటీ అయ్యారు. అమెరికా రాయబార కార్యాలయం దీనికి వేదికగా మారింది.ఇరు దేశాల సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చేస్తున్న యత్నాల్లో భాగంగా వాషింగ్టన్, మాస్కో లోని దౌత్య కార్యాలయాల్లో నెలకొన్న వివాదాలను చర్చించుకున్నారు. దీనిలో ఉక్రెయిన్, ఇతర రాజకీయ , భద్రతా పరమైన అంశాలను చేర్చలేదు. అమెరికా విదేశాంగ శాఖ దీనిపై మాట్లాడుతూ ఈ చర్చలు నిర్మాణాత్మకంగా కనిపిస్తున్నాయన్నారు. సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అన్నది తేలిపోతోందన్నారు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ మాట్లాడుతూ తమ దేశ దౌత్యవేత్తలకు మెరుగైన పరిస్థితులు కల్పించేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయన్నారు. ఉక్రెయిన్‌లో శాంతికోసం ట్రంప్ వేగంగా తీసుకుంటున్న చర్యలపై పుతిన్ స్పందించారు. అమెరికా, రష్యాల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరించకపోతే ఏమీ సాధించలేరని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరుదేశాలు దౌత్యస్థాయిలో సమస్యల పరిష్కారానికి టర్కీలో భేటీ అయ్యాయి. రష్యాతో కూడా ట్రంప్ ఖనిజాల ఒప్పందం చేసుకుంటారన్న వార్తలు వెలువడుతుండటంతో ఈ చర్చలకు ప్రాధాన్యం పెరిగింది.