ఉక్రెయిన్ గ్రామం స్కూల్‌పై రష్యా దాడి
బాంబుల ధాటికి 60 మంది బలి
నెత్తుటి శిథిలాల నడుమ కొందరు సజీవులు
కీవ్ : ఉక్రెయిన్‌లో తూర్పు ప్రాంతం అయిన లుహన్స్‌లో రష్యా సైనిక దళాలు దారుణానికి దిగాయి. ఇక్కడి గ్రామంలోని స్కూల్‌పై బాంబుల దాడికి దిగడంతో కనీసం 60 మంది దుర్మరణ చెందారు. ఈ విషయాన్ని స్థానిక గవర్నర్ సెర్హియ్ గైడాయ్ ఆదివారం తెలిపారు. బిలోహోరివికా గ్రామంలోని స్కూళ్లలో ఇప్పటి యుద్ధం దశలో ప్రాణాల రక్షణకు జనం స్కూళ్లలో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఓ స్కూల్‌లో 90 మంది వరకూ ఉంటున్న దశలో దీనిని గురి చూసుకుని బాంబుల వర్షం కురిపించారని, దీనితో ఈ స్కూల్‌లోని వారు మృతి చెందారని గవర్నర్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. భవనంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. పలువురు కాలి బూడిదయ్యారని స్థానిక మీడియా తెలిపింది. భవనం పూర్తిగా కాలి శిథిలాలమయం అయింది. శిథిలాల కింద నుంచి 30 మందిని సురక్షితంగా బయటకు తీశారు. శిథిలాల కింద 60 వరకూ మృతదేహాలు పడి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఘర్షణల నాటి నుంచి ఇప్పటివరకూ ఓ స్కూల్ భవనంపై దాడి జరిగి ఒకేసారి ఇంత మంది బలి కావడం ఇదే తొలిసారి.
శిథిలాలపై రక్తం ధారలు కన్పిస్తున్నాయి. యుద్ధంలో రష్యా బలగాలు తమ సత్వర ఆక్రమణపర్వంలో భాగంగా ఏకంగా పౌరులను లక్షంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని, ఇవి యుద్ధ నేరాలను మించిన నేరాలని అమెరికా ఇతర దేశాలు మండిపడుతున్నాయి. పలు ప్రాంతాలను క్రమేపీ పూర్తి స్థాయిలో తన ఆధిపత్యంలోకి తెచ్చుకునేందుకు రష్యా అన్ని స్థాయిలలో దాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఇక్కడ మారుమూల గ్రామంలో ఈ స్కూల్‌పై దాడికి దిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఉంటున్నారనే సమాచారం అందడంతోనే ఈ దారుణానికి దిగినట్లు వెల్లడైంది. తాము యుద్ధ నేరాలకు పాల్పడటం లేదని రష్యా అధికారికంగా ప్రకటిస్తూ వస్తోంది. దీనిని ఉక్రెయిన్ ఖండిస్తూ , ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా ఇప్పుడు రష్యా సైనిక దళాల అకృత్యాలు సాగుతున్నాయని, వారు పౌరుల ఊచకోతకు దిగుతున్నారని ఉక్రెయిన్ ఆవేదన వ్యక్తం చేసింది.