మాస్కో: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అంతరిక్షంలో మొదటి సినిమాను చిత్రీకరించడానికి రష్యానటులు, దర్శకులతో కూడిన బృందం రాకెట్‌లో మంగళవారం బయలు దేరింది. రష్యా సూయెజ్ వ్యోమనౌక ఎంఎస్ 19లో బైకొనొర్ అంతరిక్ష కేంద్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం 1.55కు నటి యుల్ల పెరిసిడ్, డైరెక్టర్ కిమ్ షిపెంకో, మరో వ్యోమగామి యాంటన్ ష్కప్లరొవ్ బయలుదేరి నిర్ణయించిన కక్షకు విజయవంతంగా చేరుకోగలిగారు. ఈ బృందం అంతా క్షేమంగా అక్కడకు చేరుకోగలిగిందని, వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేశాయని అంతరిక్ష కేంద్రం అధికారులు తెలిపారు. ఛాలెంజ్ అనే పేరుగల కొత్త మూవీలో పెరిసిడ్, క్లిమింకో ప్రధాన పాత్రధారులు. ఇందులో సర్జన్ పాత్రధారి పెరిసిడ్ వ్యోమగాముల బృందం లో గుండె పోటుతో బాధపడుతున్న ఒకరిని రక్షించడానికి అంతరిక్ష కేంద్రానికి వెళ్తాడు. అంతరిక్ష స్థావరంలో 12 రోజులున్న తరువాత వీరు మరో వ్యోమగామితో భూమికి తిరిగి వస్తారు. అంతరిక్షానికి బయలు దేరి వెళ్లే ముందు సోమవారం పాత్రికేయులతో 37 ఏళ్ల పెరిసిడ్ మాట్లాడారు.
ఈ అంతరిక్ష యాత్ర కోసం పొందిన శిక్షణలో కఠినమైన నిబంధనలు పాటించడం తనకు సవాలు వంటిదని ఆమె పేర్కొన్నారు. మానసికంగా, భౌతికంగా, నైతికంగా చాలా కష్టమైన శిక్షణగా పేర్కొన్నారు. అనుకున్న లక్షాన్ని సాధించిన తరువాత ఈ కష్టాలన్నీ మటుమాయమై ఆనందం కలుగుతుందని ఆమె ఆశాభావం వెలిబుచ్చారు. అనేక విజయవంతమైన వాణిజ్య చిత్రాలను రూపొందించిన 38 ఏళ్ల షిపెంకో మాట్లాడుతూ దీని కోసం నాలుగు నెలల పాటు అత్యంత కఠినమైన శిక్షణ పొందామని చెప్పారు. తొలి ప్రయత్నంలో అన్నీ చేయలేకపోయినా, కొంత కాలానికి మూడో సారైనా ఏదోఒకటి సాధారణంగా చేయగలుగుతామని తెలిపారు. ఈ ప్రాజెక్టు వెనుక కీలకమైన వ్యక్తి డిమిట్రీ రోగోజిన్. రష్యా ప్రభుత్వ అంతరిక్ష సంస్థ రాస్ కాస్మోసిస్ అధినేతగా ఉంటున్నారు. దేశ అంతరిక్ష వైభవాన్ని మరింత ప్రకాశవంతం చేయడానికి, విమర్శలకు దీటైన జవాబు చెప్పడానికి ఈ ప్రాజెక్టు నిలుస్తుందని అభివర్ణించారు.
Russian film crew shoot movie in Space