Monday, January 27, 2025

కీవ్ ముట్టడి

- Advertisement -
- Advertisement -

Russian forces into Ukrainian capital Kiev

రష్యా సేనల చక్రబంధంలో ఉక్రెయిన్ రాజధాని

నగర శివార్లలోని కీలక విమానాశ్రయం స్వాధీనం
తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సేనలు
బంకర్లలో తలదాచుకుంటున్న కీవ్ పౌరులు
అంతటా విధ్వంసం, విషాదం

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు శుక్రవారం రెండో రోజు కూడా కొనసాగాయి. రష్యా చేస్తున్న భీకర దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం వణికి పోతోంది. ఓ వైపు హెచ్చరికల సైరన్లు, మరో వైపు భారీ బాంబు దాడుల శబ్దాలతో నగరం మొత్తం రణరంగంగా మారినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఉక్రెయిన్ రాజధానిని స్వాధీనం చేసుకోవాలనే లక్షంతో రష్యా సేనలు కీవ్ వైపు దూసుకువస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా జవాన్లు మారు వేషాలతో నగరంలోకి చొరబడుతున్నారు. ముఖ్యంగా తమ బలగాల యూనిఫామ్‌లను ధరించి రాజధానిలోకి ప్రవేశిస్తున్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ‘ ఉక్రెయిన్‌కు చెందిన రెండు సైనిక వాహనాలను రష్యా స్వాధీనం చేసుకుంది. అనంతరం వారి యూనిఫామ్‌ల స్థానంలో ఉక్రెయిన్ సైనికుల దుస్తులు దరించి రాజధాని వైపు వస్తున్నారు. వారి వెనుక రష్యా మిలిటరీ వాహనాలు వరసగా వెళ్తున్నాయి’ అని ఉక్రెయిన్ ఉప రక్షణ మంత్రి అక్కడి మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి రష్యా బలగాలు ప్రవేశించినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడి ప్రభుత్వ క్వార్టర్స్‌పై రష్యా సైన్యం కాల్పులకు పాల్పడిందనే వార్తలు వస్తున్నాయి.

రష్యా సేనల్ని అడ్డుకునే ప్రయత్నంలో ఉక్రెయిన్ సైన్యం ప్రతి దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా కీవ్ గగనతలంలో రష్యాకు చెందిన రెండు క్రూయిజ్ క్షిపణులతో పాటు ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు వెల్లడించారు. అయితే ఒకటి, రెండు రోజుల్లో రష్యా సైన్యాలు కీవ్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంటాయని భావిస్తున్నారు. అయితే రష్యా సైన్యాలు నగరంలోకి ప్రవేశించకుండా దీటుగా ప్రతిఘటిస్తున్నామని ఉక్రెయిన్ సైన్యం చెప్తోంది. ఇందులో భాగంగా నగరం సమీపంలోని నదిపై ఉన్న వంతెనలను ధ్వంసం చేసి శత్రువులను అడ్డుకున్నామని తెలిపింది.తమ దాడుల్లో ఇప్పటివరకు 450 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ అంచనా వేసింది. కాగా రెండు రోజుల్లో తమ దురుదాడుల్లో వెయ్యి మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు. బ్రిటన్ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. అంతేకాదు రష్యా తొలి రోజు దాడుల్లో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయిందని కూడాబ్రిటన్ వ్యాఖ్యానించింది. కాగా, శుక్రవారం ఉదయం కీవ్‌లో రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పౌర నివాస ప్రాంతాలపై రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ చేస్తున్న ఆరోపణలను రష్యా ఖండించింది. అయితే దాడుల సందర్భంగా కీవ్ నగరంలో విమాన శకలాలు పడి భారీ అపార్ట్‌మెంట్‌లు ధ్వంసమయినట్లు సమాచారం.

సిటీ సెంటర్ సమీపంలోను భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.మరో వైపు ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బంకర్లు, బాంబు షెల్టర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శుక్రవారం ఉదయం కీవ్ నగర రోడ్లపై వాహనాలు అతి తక్కువగా తిరుగుతూ కనిపించాయి. అయితే తొలి రోజు మాదిరి పెట్రోల్ బంకులు, ఎటిఎం సెంటర్ల వద్ద రద్దీ కనిపించలేదు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై సైనిక దాడులు ప్రారంభించిన తొలి రోజే రష్యా సైన్యాలు అత్యంత కీలకమైన చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నాయి. రష్యా సైనిక బలగాలు ఆ ప్లాంట్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేశాయి. ఉక్రెయిన్ రక్షణ శాఖ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. నిజానికి చెర్నోబిల్ సైనిక స్థావరం కాదు. మిలిటరీలోఈ ప్రాంతానికి పెద్ద ప్రాధాన్యత కూడా లేదు. అయితే బెలారస్‌నుంచి కీవ్ మధ్య అత్యంత కనిష్ట దూరం రూట్‌లోనే ఉంది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని వీలయినంత త్వరగా నిర్వీర్యం చేయాలంటే రష్యాకు ఇదే సులువైన మార్గం. అందుకే రష్యా దీన్ని ఆక్రమించడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మరో వైపుగురువారం రష్యా పారాట్రూపర్లు కీవ్ నగర శివార్లలో ఉన్న హోస్టోమెల్ ఎయిర్‌ఫీల్డ్‌పైనా కంట్రోల్ సాధించారు. బెలారస్ వైపునుంచి హెలికాప్టర్లు, యుద్ధ విమానాల ద్వారా వచ్చిన పారాట్రూపర్లు ఎయిర్‌ఫీల్డ్‌పై ఒక్క సారిగా దాడి చేసి దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఎయిర్‌పోర్టు కీవ్‌కు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో రష్యా సైన్యాలు నేరుగా కీవ్ నగర శివార్లకు చేరుకునేందుకు వీలు ఏర్పడింది. అక్కడ పోరాటంలో తమ వైపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్ చెప్పగా, ఉక్రెయిన్ మాత్రం రష్యాకు భారీ ప్రాణనష్టం సంభవించిందని చెప్తోంది.

పుతిన్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్

రష్యాఉక్రెయిన్‌ల మధ్య తీవ్ర స్థాయిలో సైనిక దాడులు కొనసాగుతున్న తరుణంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేయాలని పుతిన్‌ను జిన్‌పింగ్ కోరినట్లు సమాచారం.అంతేకాదు ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని కూడా జిన్‌పింగ్ పుతిన్‌ను కోరారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కూడాఆయన పుతిన్‌కు తెలిపారు. కాగా ఉక్రెయిన్‌తో చర్చలు జరపడానికి తాము సిద్ధంగానే ఉన్నామని ఈ సందర్భంగా పుతిన్ చైనా అధ్యక్షుడికి చెప్పినట్లు తెలుస్తోంది. చైనా అధికారిక టీవీ సిసి టీవీలో ఈ మేరకు ఒక ప్రకటన వెలువడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News