న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై గత నెల యుద్ధం మొదలుపెట్టిన తర్వాత మొదటిసారి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రావ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం గురువారం భారత్ సందర్శించనున్నారు. లావ్రావ్ పర్యటనను భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురును కొనుగోలు చేయడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూపాయి-రూబుల్ చెల్లింపు విధానం అమలు చేయడం వంటి అంశాలను భారత ప్రభుత్వం రష్యా విదేశాంగ మంత్రితో చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అంతేగాక..రష్యాకు చెందిన ఎస్ 400 క్షిపణి వ్యవస్థలకు చెందిన విడిభాగాలతోపాటు వివిధ సైనిక పరికరాల పంపిణీని సకాలంలో చేపట్టాలని కూడా భారత్ రష్యాపై ఒత్తిడి చేసే అవకాశం ఉన్నట్లు వారు చెప్పారు.రెండు రోజుల పర్యటన నిమిత్తం లావ్రావ్ బుధవారం చైనా చేరుకున్నారు. అఫ్ఘాన్ సంక్షోభంపై ఆ దేశానికి పొరుగున ఉన్న దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటున్నారు. చైనా ఈ సమావేశం నిర్వహిస్తోంది. అది పూర్తి చేసుకుని లావ్రావ్ గురువారం సాయంత్రం న్యూఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది.