భువనేశ్వర్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ విమర్శకుడు పావెల్ అంతోవ్, అతడి మిత్రుడు వ్లాదిమీర్ బైదనోవ్ పక్షం రోజుల క్రితం ఒడిశాలోని రాయగడ హోటల్‌లో అనుమానస్పదంగా మృతి చెందిన ఉదంతం మరువక ముందే మరో రష్యన్ జగత్‌సింగ్‌పుర్ జిల్లాలోని పారాదీప్ పోర్ట్‌లో ఓ కార్గో నౌకలో చనిపోయి దొరికాడు. పోలీసులు అతడిని సెర్గీ మిల్యాకోవ్(51)గా గుర్తించారు. అతడు గుండెపోటుతో చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
‘కార్గో నౌకను నడిపే సిబ్బందిలో అతడొకడని మేము గుర్తించాము. పోస్ట్‌మార్టం అయ్యాక అతడెలా మరణించాడని ధ్రువీకరించనున్నాం. మా ప్రాథమిక దర్యాప్తులో అతడు ఉన్నపళంగా నౌకలో కుప్పకూలిపోయాడని తెలిసింది. అతడు బహుశా గుండెపోటుతో మరణించి ఉంటాడు’ అని జగత్‌సింగ్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ అఖిలేశ్వర్ సింగ్ తెలిపారు.
మిల్యాకోవ్ పోస్ట్‌మార్టంను పోలీసులు వీడియోగ్రాఫ్ తీస్తారు. అతడి విసెరల్ శాంపిల్స్‌ను, అతడి భౌతిక కాయాన్ని కూడా భద్రపరుస్తారని సింగ్ తెలిపారు. ఇదివరకు పావెల్ విసెరాను లేక అతడి అటాప్సీ వీడియోగ్రాఫ్‌ను భద్రపరచనందుకు ఒడిశా పోలీసులు విమర్శకు గురయ్యారన్నది ఇక్కడ గమనార్హం. రష్యా శాసనసభ్యుడు అంతోవ్ పావెల్, అతడి సహప్రయాణికుడు బైదనోవ్ వ్లాదిమీర్ డిసెంబర్ 22న, డిసెంబర్ 24న రాయగడలోని హోటల్‌లో చనిపోయి లభించారన్నది ఇక్కడ గమనార్హం.