మాస్కో: రష్యాఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు చర్చల్లో భాగంగా ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెల పాటు దాడులు నిలిపివేసేలా అమెరికా, రష్యాల మధ్య అంగీకారం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒప్పందం ఉల్లంఘనకు గురైందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల చేసిన ఆరోపణల్లో నిజం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఓ రష్యన్ ఇంధన కేంద్రం రాత్రి సమయంలో దగ్ధమైందని, దీనిని చూపించి కీవ్ లోని ఇంధన వనరులపై దాడులు చేస్తున్నామని జెలెన్‌స్కీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
జెలెన్‌స్కీ మాటలను ఎంతవరకు నమ్మవచ్చో దీని ద్వారా తెలుసుకోవాలని ప్రపంచ దేశాలను ఆయన కోరారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , రష్యా అధినేత పుతిన్‌తో ఫోన్‌లో జరిపిన చర్చల్లో యుద్ధాన్ని విరమింప చేయడంలో భాగంగా ఇంధన, మౌలిక సదుపాయాలపై నెలరోజుల పాటు దాడులు నిలిపేలా చూడాలని అమెరికా, రష్యా ఒప్పందం చేసుకున్నాయి. దీనికి ముందుగా ఈ రెండు రంగాల వరకు దాడులు ఆపాలని ట్రంప్ సూచించారు. దీనికి పుతిన్ అంగీకరించారని, శాంతి దిశగా ఇది తొలి అడుగు అని అమెరికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. నల్లసముద్రంలో దాడుల విరమణకు, ఆ తర్వాత పూర్తిగా యుద్ధం అంతానికి ఇది దారి తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.