మాస్కోలో రష్యన్ సీనియర్ జనరల్ ఒకరి అపార్ట్‌మెంట్ వెలుపల ఒక స్కూటర్‌లో దాచిన ఒక బాంబుతో మంగళవారం ఆయనను హత్య చేశారు. ఆయనపై ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ (ఎస్‌బియు) క్రిమినల్ ఆరోపణలు చేసిన మరునాడు ఆ హత్య జరిగింది. ఎస్‌బియుఇ ఆ దాడిని నిర్వహించిందని ఉక్రెయిన్ అధికారి ఒకరు వెల్లడించారు. రష్యా మిలిటరీ అణ్వస్త్ర, జీవ సంబంధిత, రసాయన పరిరక్షణ బలగాల చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగొర్ కిరిల్లోవ్ (54) తన కార్యాలయానికి బయలుదేరిన సమయంలో ఆ దాడిలో హతుడయ్యారు. కిరిల్లోవ్ సహాయకుడు కూడా ఆ దాడిలో మరణించాడు. ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధంలో కిరిల్లోవ్ చర్యలకు యుకె, కెనడా సహా పలు దేశాల నుంచి ఆయనపై ఆంక్షలు ఉన్నాయి. ఎస్‌బియు సోమవారం కిరిల్లోవ్‌పై క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించింది. కిరిల్లోవ్ నిషిద్ధ రసాయన ఆయుధాల వినియోగానికి ఆదేశించినట్లు ఎస్‌బియు ఆరోపించింది.
ఆ దాడి వెనుక తమ సంస్థ ఉందని ఎస్‌బియు అధికారి ఒకరు వెల్లడించారను. సమాచారం విడుదలకు తమకు అధికారం లేనందున పేరు వెల్లడించరాదన్న షరతుపై మాట్లాడిన సదరు అధికారి కిరిల్లోవ్‌ను ‘యుద్ధ నేరస్థుడు, పూర్తిగా చట్టబద్ధమైన లక్షం’గా అభివర్ణించారు. 2022 ఫిబ్రవరిలో పూర్తి స్థాయి దురాక్రమణను ప్రారంభించినప్పటి నుంచి రష్యా యుద్ధ క్షేత్రంలో రసాయన ఆయుధాలు ప్రయోగించిన 4800 పైచిలుకు సందర్భాలను తాము నమోదు చేసినట్లు ఎస్‌బియు తెలిపింది. అయితే, ఉక్రెయిన్‌లో తాము ఎటువంటి రసాయన ఆయుధాలనూ ఉపయోగించలేదని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయినే యుద్ధంలో విషపూరిత ఏజెంట్లను ఉపయోగించిందని రష్యా ప్రత్యారోపణ చేసింది. కాగా, మంగళవారం దాడిలో వినియోగించిన బాంబును రిమోట్‌తో పేల్చినట్లు రష్యన్ పత్రికా వార్తలు తెలిపాయి. కిరిల్లోవ్ మరణాన్ని ఉగ్రవాద కేసుగా తాము దర్యాప్తు చేస్తున్నట్లు రష్యా అగ్రశ్రేణి ప్రభుత్వ దర్యాప్తు సంస్థ తెలియజేసింది. ఉక్రెయిన్‌ను తాము శిక్షిస్తామని మాస్కోలో అధికారులు ప్రకటించారు.