యుద్ధాన్ని ఖండిస్తూ మీడియా వెబ్‌సైట్లు హ్యాక్
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ రష్యాలోని పలు వార్తాసంస్థలకు చెందిన వెబ్‌సైట్లు సోమవారం హ్యాక్ అయ్యాయి. ఆయా వెబ్‌సైట్ల ప్రధాన పేజీలలో రష్యా దురాక్రమణకు ఖండనలు దర్శనమిచ్చాయి. మరోపక్క ఉక్రెయిన్‌కు సంబంధించిన యుద్ధ వార్తలను ప్రచురించడంతోపాటు ప్రసారం చేస్తున్నందుకు ఇతర మీడియా సంస్థలపై రష్యా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంపై రష్యాలోని సాధారణ పౌరులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నాలలో భాగంగా రష్యా ప్రభుత్వం మీడియా సంస్థలపై అణచివేత చర్యలను చేపట్టినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితిని వివరిస్తూ వార్తా కథనాలు ప్రసారం చేస్తున్న అనేక రష్యా, ఉక్రెయిన్ వార్తా సంస్థలను రష్యా ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఉక్రెయిన్‌లో మరణించిన రష్యా సైనికుల వివరాలను వెల్లడించడమే కాక పుతిన్ ప్రభుత్వ చర్యలను బహిరంగంగా విమర్శిస్తున్న రష్యా మీడియా సంస్థ ది న్యూ టైమ్స్‌పై రష్యా ప్రభుత్వం నిషేధం విధించింది.
రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ గత నాలుగు రోజులుగా రష్యా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి ముగింపు పలకాలని కోరుతూ దాదాపు 10 లక్షల మంది పౌరులు ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారు. హ్యాకింగ్‌కు గురైన వెబ్‌సైట్ల పేజీలలో దర్శనమిచ్చిన సందేశాల స్క్రీన్‌షాట్లను స్వతంత్ర వార్తా వెబ్‌సైట్ మెడుజా పోస్ట్ చేసింది. గుర్తు తెలియని హ్యాకర్లు ఆ సందేశంలో.. డియర్ సిటిజన్స్. ఈ ఉన్మాదాన్ని ఆపాలని మిమల్ని అర్థిస్తున్నాము. చావడానికి మీ కుమారులను, భర్తలను పంపకండి. ఉత్తర కొరియాలో లాగే అనేక ఏళ్లపాటు మనం జీవించాల్సి వస్తుంది. దీని వల్ల మనకు ఒరిగేదేమిటి..పుతిన్ పాఠ్యపుస్తకాల్లో చరిత్ర కెక్కడం తప్ప. ఇది మన యుద్ధం కాదు&ఆయనను అడ్డుకుందాం అంటూ పిలుపునిచ్చారు.