Friday, December 20, 2024

తోక ముడిచిన ప్రిగోజిన్

- Advertisement -
- Advertisement -

మాస్కో: ఒక్క రోజులోనే రష్యా అధినాయకత్వానికి ముచ్చెమటలు పట్టించిన వాగ్నర్ గ్రూపు అధిపతి ప్రిగోజిన్ ఎట్టకేలకు తన తిరుగుబాటును విరమించుకున్నారు. బెలారస్ మధ్యవర్తిత్వంతో వెనక్కి తగ్గిన ఆయన రోస్తోవ్‌ఆన్ డాన్ నగరాన్ని వీడి వెళ్లారు. ఆయన రోడ్డుమార్గంలో బెలారస్ వెళ్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు.ఈ ఒప్పందంలో భాగంగా వాగ్నర్ గ్రూపుతో పాటుగా ప్రిగోజిన్‌పై నమోదైన కేసులన్నిటినీ రష్యా అధికారులు తొలగిస్తున్నట్లు తెలిపారు. మరో వైపు కిరాయి సైనిక దళాలు రోస్తోవ్‌ఆన్‌డాన్‌ను వీడి సరిహద్దుల్లోని వాటి స్థావరాలకు తిరిగి వెళ్లిపోయినట్లు ఆ ప్రాంత గవర్నర్ పేర్కొన్నారు. రోస్తోవ్ నగరాన్ని వీడి వెళ్లేటప్పుడు వాగ్నర్ దళాలు గాలిలోకి కాల్పులు జరిపి సంబరాలు జరుపుకొన్నారు. జాతినుద్దేశించి ప్రసంగించినప్పుడు ప్రిగోజిన్‌ను పుతిన్ వెన్నుపోటుదారుగా అభివర్ణించిన విషయం తెలిసిందే. వారు రష్యా దేశానికే ప్రమాదకరమని పేర్కొన్నారు.

అయితే రోస్తోవ్ నగర వాసులు మాత్రం ప్రిగోజిన్‌ను ఓ సెలబ్రిటీగా చూశారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. తిరుగుబాటు ఒక్క రోజులోనే సద్దుమణిగినప్పటికీ దాదాపు 20 ఏళ్లు రష్యాకు తిరుగులేని నాయకుడిగా ఉండిన పుతిన్ ప్రభుత్వ బలగాల్లో బలహీనతలను అది ఎత్తి చూపించింది. వాగ్నర్ దళాలు రోస్తోవ్ నగరంలోకి ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ప్రవేశించడమే కాకుండా దేశ రాజధాని మాస్కోవైపుగా వందలాది కిలోమీటర్లు ముందుకు సాగడమే దీనికి నిదర్శనం. మాస్కోను రక్షించుకోవడానికి రష్యా సైన్యం తలమునకలయింది. తిరుగుబాటు నేపథ్యంలో దక్షిణ రష్యానుంచి మాస్కో వైపు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. అయితే తాజా ఒప్పందంతో ఈ ఆంక్షలన్నిటినీ తొలగిస్తున్నట్లు రష్యా అధికారులు ప్రకటించారు. కాగా మాస్కోకు అత్యంత సమీపంలోని తుల ప్రాంతంలోని రోడ్లపై ఆంక్షలు మాత్రం కొనసాగుతున్నాయి.

ప్రిగోజిన్ గర్వం ప్రమాదకరం: చెచెన్యా నేత

వాగ్నర్ గ్రూపు వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించిన తర్వాత చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్ టెలిగ్రాంలో స్పందించారు.ప్రిగోజిన్ గర్వం ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందన్నారు. అతడు వరసగా వ్యాపారాల్లో నష్టాలు చవి చూడడంతో ఆగ్రహం అదుపు తప్పిప్రవర్తిస్తున్నాడని విమర్శించారు.‘ నేను ప్రిగోజిన్‌తో మాట్లాడాను. వ్యాపార లక్షాలను వదిలిపెట్టాలని కోరాను. జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాల్లో వాటిని కలపొద్దని సూచించాను.అతడు నా మాట విన్నాడనుకున్నాను. కానీ కోపం అతడిని అదుపు తప్పేలా చేసింది.కిరాయి సైనికుల నిర్ణయాలు హుందాగా ఉండాలి. లేకపోతే వినాశానికి దారితీస్తాయి’ అని కదిరోవ్ హెచ్చరించారు.

అమెరికాకు ముందే తెలుసా?

రష్యాలో తిరుగుబాటు జరగడానికి కొన్ని రోజుల ముందే అమెరికా నిఘా సంస్థలు ప్రిగోజిన్ ప్లాన్‌ను పసిగట్టాయని చెబుతున్నారు. అతను రష్యా రక్షణ శాఖకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ముందే గుర్తించాయి. అణు క్తి దేశమైన రష్యాలో ఉద్రిక్తతలు చోటు చేసుకోనున్నాయని 24 గంటలు ముందుగానే పెంటగాన్, శ్వేత సౌధానికి తెలియజేశాయి. ఈ విషయాన్ని అమెరికా వార్తాసంస్థలు శనివారం వెల్లడించాయి. వాస్తవానికి సైనిక నాయకత్వంపై తిరుగుబాటుకు ప్రిగోజిన్ ఈ నెల మధ్యనుంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు అమెరికా వర్గాలు తొలిసారి గుర్తించాయి. కానీ గత వారంలోనే ఇది పక్కా సమాచారమని నిర్ధారించుకున్నాయి. అంతేకాదు ఒకప్పటి తన నమ్మిన బంటయిన ప్రిగోజిన్ తిరుగుబాటు చేయబోతున్న విషయం పుతిన్‌కు ఒక రోజు ముందుతెలుసునని కూడా అమెరికా మీడియా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News