రష్యాలో ఎమర్జెన్సీస్ మంత్రి విషాదాంతం
మాస్కో : రష్యాలో ఓ కెమెరామెన్‌ను రక్షించబోయి అక్కడి మంత్రి యెవెగ్నీ జినిచెవ్ విషాదాంతం చెందాడు. రష్యాలో అత్యవసర పరిస్థితుల నిర్వహణ మంత్రిగా జినిచెవ్ ఓ కొండ శిఖరపు అంచుల నుంచి కిందపడ్డారు. నేరుగా అక్కడి నీటిలో ఉన్న బండరాయికి తలతగలడంతో దుర్మరణం చెందినట్లు వార్తాసంస్థలు తెలిపాయి. 55 సంవత్సరాల ఈ మంత్రి అర్కిటిక్ ప్రాంతంలోని నొర్కిల్స్ వద్ద ఓ అగ్నిమాపక కేంద్రం నిర్మాణ పనుల పర్యవేక్షణకు వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున జరుగుతోన్న మాక్ డ్రిల్లును సందర్శిస్తుండగా, దీనిని చిత్రీకరిస్తున్న ఓ వార్తాసంస్థ ఛానల్ కెమెరామెన్ శిఖరం నుంచి కిందికి జారి పడ్డారు. ఇది గమనించిన మంత్రి వెంటనే కెమెరామెన్‌ను రక్షించేందుకు కిందికి దూకాడు. ఈ క్రమంలో ఆయన ప్రమాదానికి గురై మృతి చెందినట్లు బుధవారం అధికారులు ధృవీకరించారు. ఘటన ఎప్పుడు జరిగింది తెలియచేయలేదు.
ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌టికి చెందిన కెమెరామెన్‌ను రక్షించే క్రమంలో ఆయన చనిపోయినట్లు వెల్లడైంది. సోవియట్ యూనియన్ తుది దశలో జినిచెవ్ కెజిబి సెక్యూరిటీ విభాగంలోకీలక వ్యక్తిగా వ్యవహరించారు.తరువాత కీలక బాధ్యతలు నిర్వర్తించిన తరువాత ఆయన ఎమర్జెన్సిస్ మంత్రిగా 2018 మేలో నియమితులు అయ్యారు. ప్రమాద పరిస్థితులలో ఏ విధంగా అత్యయిక సిబ్బంది వ్యవహరించాలనేది తెలిపే మాక్‌డ్రిల్స్ మంగళవారం నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలోని పలు నగరాలలో ప్రజలు వీటిని తిలకిస్తూ వస్తున్నారు. ప్రమాదాలు ఉత్పన్నమైనప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనేది ఆకళింపు చేసుకుంటున్నారు. తమ కేబినెట్ మంత్రి మరణం పట్ల పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపి, హీరోగా అభివర్ణించారు.