దక్షిణ ఉక్రెయిన్ నగరం జాపోరిజాజియాపై బుధవారం పట్టపగలే రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 13 మంది పౌరులు చనిపోగా, 30 మందికి గాయాలయ్యాయి. నగర వీధుల్లో పడియున్న పౌరుల మృత దేహాల ఫుటేజ్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్సీ టెలిగ్రాం ఛానెల్‌లో పోస్ట్ చేశారు. మూడేళ్ల యుద్ధంలో రష్యా తరచూ సివిలియన్ ప్రాంతాల్లో దాడులకు దిగుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరొప్‌లో పెద్ద సంఖ్యలో జనులు చనిపోయింది రష్యాఉక్రెయిన్ యుద్ధంలోనే. రష్యా క్షిపణి దాడిలో 13 మంది చనిపోయిన విషయాన్ని జెలెన్సీ, ప్రాంతీయ గవర్నర్ ఇవాన్ ఫెడోరోవ్ తెలిపారు. రష్యా ట్రూప్‌లు బుధవారం మధ్యాహ్నం జాపోరిజాజియా నగరంపై గ్లైడ్ బాంబులు ప్రయోగించాయి.
‘ఓ నగరంపై వైమానిక దాడులు జరుపడమన్న దానికన్నా క్రూరమైనది మరొకటి ఉండదు’ అని జెలెన్సీ ‘టెలిగ్రాం’లో రాశారు. యుద్ధం ఆగాలనుకునే దేశాలు ఉక్రెయిన్‌కు భవిష్యత్తు రక్షణ హామీ ఇవ్వాలి అన్నారు. రష్యాను సైనికపరంగా నిరోధించకపోతే కాల్పుల విరమణ లేక శాంతి ఒప్పందం క్రెమ్లిన్‌కు ఆయుధ సంపత్తిని సమకూర్చుకోడానికి కావలసిన సమయం ఇచ్చినట్లే కాగలదని జెలెన్సీ అభిప్రాయపడ్డారు. దీనికి ముందు ఉక్రెయిన్ సైన్యం, రష్యాలోని సరతోవ్ ప్రాంతంలోని ఎంగిల్స్‌లో ఉన్న చమురు నిల్వల డిపోపై దాడిచేసింది. రష్యా అధికారులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు.