కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో మరోసారి విరుచుకుపడింది. కీవ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని భారీగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమానిక దళ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో షోస్టా నగరానికి సమీపంలో ఉన్న పలు నివాస భవనాలు, పాఠశాలలు , వైద్య సదుపాయాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు.
రష్యా దాడులతో తమ దేశం లోని దాదాపు సగం మౌలిక సదుపాయాలు నాశనమైనట్టు అధికారులు పేర్కొన్నారు. పలు పాశ్చాత్య మిత్రదేశాలు తమకు వాయు రక్షణ వ్యవస్థలను అందించాయని తెలిపారు. వాటి సహాయంతో రష్యా డ్రోన్లను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ ప్రయోగించిన 68 డ్రోన్లను మంగళవారం తెల్లవారు జామున కూల్చివేసినట్టు రష్యా అధికారులు పేర్కొన్నారు. డ్రోన్ శకలాలు చమురు డిపో భూభాగంలో పడడంతో మంటలు చెలరేగాయని చెప్పారు.