Friday, December 27, 2024

ఇంధన కేంద్రాలు లక్ష్యంగా ఉక్రెయిన్‌పై మళ్లీ రష్యా క్షిపణి దాడులు

- Advertisement -
- Advertisement -

Russian missile attacks again on Ukraine targeting energy facilities

ల్వీవ్ నగరంలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
ఎడతెరిపి లేకుండా మోగిన సైరన్లు
సోమవారం క్షిపణి దాడుల్లో మరింత పెరిగిన మరణాలు

కీవ్: కెర్చ్ వంతెన పేల్చివేత తర్వాత రష్యా ,ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ వ్యాప్తంగా రష్యా దళాలు సోమవారం క్షిపణుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా ఆ దాడులు కొనసాగాయి. ఉక్రెయిన్‌లోని ఇంధన వసతి కేంద్రాలు లక్షంగా మంగళవారం మరోసారి క్రెమ్లిన్ సేనలు విరుచుకు పడ్డాయి. ఉక్రెయిన్ మిలిటరీ స్థావరాలు, ఇంధన వ్యవస్థలపై తమ సైన్యం క్షిపణి దాడులను పునరుద్ధరించిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. దీర్ఘశ్రేణి ఆయుధ వ్యవస్థలతో ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపింది. తాజాఘటనలో పశ్చిమ ఉక్రెయిన్ లోని ల్వీవ్ నగరవ్యాప్తంగా దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతంలోని రెండు ఇంధన వసతి కేంద్రాలవద్ద మూడు పేలుళ్లు సంభవించినట్లు గవర్నర్ మాగ్జిమ్ కొలిస్కీ టెలిగ్రాంలో వెల్లడించారు. దీని కారణంగా ల్వీవ్ నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా మంగళవారం ఉదయం వైమానిక దాడుల హెచ్చరికల సైరన్లు దేశవ్యాప్తంగా కొనసాగాయి.

దీంతో కీవ్ సహా పలు నగరాల్లో నెలల తరబడి షెల్టర్లలో తలదాచుకున్న తర్వాత బయటి ప్రపంచంలోకి వచ్చిన పలువురు పౌరులు ప్రాణ భయంతో తిరిగి షెల్టర్లలోకి వెళ్లిపోయారు. ఇది రష్యా పట్ల కోపాన్ని తెప్పిస్తోంది తప్ప భయాన్ని కాదని కీవ్ పౌరుడు 67 ఏళ్ల వోలోడిమిర్ వాసిలెంకో అన్నాడు. అంతేకాదు తమకు ఇలాంటివి అలవాటయిపోయాయని కూడా ఆ వృద్ధుడు వ్యాఖ్యానించాడు. మరోవైపు జపోరిజియా నగరంపై రష్యా మరోసారి దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపించింది. మంగళవారం ఉదయం ఇక్కడి జనావాసాలపై దాదాపు 12 ఎస్300 క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది.ఈ దాడుల్లో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడినట్లు తెలిపింది. ఒక స్కూలు, నివాస భవనాలు, ఆస్పత్రులు క్షిపణి దాడులకు గురయినట్లు స్థానిక అధికారి ఒకరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News