Saturday, December 21, 2024

ఖర్కీవ్‌లో టివి టవర్ కూల్చివేసిన రష్యా

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌లోని రెండవ అతి పెద్ద నగరమైన ఖర్వీవ్‌ను పూర్తిగా నేలమట్టం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రష్యా నగరంలోని టివి టవర్‌పై క్షిపణి దాడి చేసి ధ్వంసం చేసింది. తమ భీకర దాడి నగరమంతటా తెలిసేలా చేయడంతోపాటు ఖర్గీవ్‌కు బాహ్య ప్రపంచంతో సమాచార సంబంధాలు తెగిపోయేలా చేయడం రష్యా ఉద్దేశమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ సోమవారం సాయంత్రం వెల్లడించారు. దాదాపు 1,000 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దును కలిగి ఉన్న ఉక్రెయిన్ గత రెండేళ్లకు పైగా రష్యా సేనలతో భీకర పోరును సాగిస్తోంది. ప్రధానంగా ఆయుధాలు, డ్రోన్లు, ట్రెంచ్‌లపై జరుగుతున్న ఈ యుద్ధంలో సరిహద్దు రేఖలో కూడా మార్పులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్‌కు వైమానిక రక్షణ వ్యవస్థలలో కొరత ఉండడంతో ఖర్కీవ్ పట్టు కోసం రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక పవర్ గ్రిడ్‌పై దాడి చేసిన రష్యా అపార్ట్‌మెంట్‌లను క్షిపణులతో కూల్చివేసింది.

ఖర్కీవ్ నగరంలోని 250 మీటర్ల ఎత్తయిన టివి టవర్‌పై రష్యాకు చెందిన కెహెచ్ 59 క్షిపణి దాడి చేసి టవర్‌ను కూల్చివేసింది. దీంతో సమాచార ప్రసార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఖర్గీవ్‌పై నేలమీద నుంచి దాడి చేయాలని రష్యా యోచిస్తున్నట్లు వాషింగ్టన్‌కు చెందిన యుద్ధ అధ్యయన సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. అయితే రానున్న రోజుల్లో ఖర్కీవ్‌పై రష్యా జరపనున్న పూర్తి స్థాయి యుద్ధానికి టివి అవర్ కూల్చివేత ఒక సూచనగా ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ అంచనా వేసింది. పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు రానున్న రోజుల్లో అందనున్న సాయాన్ని దృష్టి లో ఉంచుకుని ఖర్కీవ్‌పై పెద్ద ఎత్తున దాడులు చేయాలని రష్యా ఆలోచిస్తోందని, ఖర్వీవ్‌ను స్వాధీనం చేసుకోవడం పెద్ద సవాలుగా రష్యా భావిస్తోందని ఆ సంస్థ పేర్కొంది. ఉక్రెయిన్‌కు 61 బిలియన్ డాలర్ల యుద్ధ సహాయం కోసం అమెరికా సెనేట్ మంగళవారం సమావేశమైంది.

అమెరికా సాయంలో ఆయుధ సంపత్తి కూడా ఉంటుందని జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. కాగా..ఉక్రెయిన్‌కు కొత్త సైనిక సరఫరాల కోసం 500 మిలియన్ పౌండ్లను (620 మిలియన్ డాలర్లు) సాయంగా అందచేయాలని బ్రిటన్ నిర్ణయించింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మంగళవారం జెలెన్‌స్కీతో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News