Wednesday, January 22, 2025

కీవ్‌పై భీకర స్థాయిలో రష్యా క్షిపణి దాడులు

- Advertisement -
- Advertisement -

Russian missile strikes on Kiev

ప్రాణనష్టం లేదు.. ప్రాణరక్షణకు జనం పరుగులు

కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సైన్యం ఆదివారం క్షిపణులతో విరుచుకుపడింది. దీనితో కొద్ది రోజులుగా ఇక్కడ నెలకొన్న ప్రశాంతత ఉన్నట్లుండి చెదిరిపోయింది. పలు కారణాలతో కీవ్‌ను వదిలిపెట్టి ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాన్ని కైవసం చేసుకునేందుకు రష్యా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తోంది. ఆదివారం తెల్లవారుజామున నగరంలోని కొన్ని మౌలిక సదుపాయాల కేంద్రాలపై రష్యా మెరుపుదాడులు సాగించిందని నగర మేయర్ విటాలి క్లిట్స్‌చ్కో తెలిపారు. దాడులలో ప్రాణనష్టం జరగలేదని, అయితే పలు ప్రాంతాలలో భయాందోళనలు నెలకొన్నాయని వివరించారు. నగరశివార్లలోని డర్నిస్టికి, నిప్రోవిస్కి జిల్లా ప్రాంతాలను క్షిపణి దాడి చాలా సేపటివరకూ వణికించింది.

అనివార్యం అనుకుంటే కీవ్‌పై కూడా భారీస్థాయి దాడికి దిగగలమని తెలియచేసుకునేందుకే రష్యా విరామం తరువాత ఈ దాడికి దిగిందని మేయర్ తమ ఆందోళన వ్యక్తం చేశారు. దాడి దశలో సైరన్లు మోగడంతో జనం కందకాలలో తలదాచుకోవల్సి వచ్చింది. కీవ్ తూర్పు శివార్ల ప్రాంతం అంతా ఆకాశంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రాంతానికి వెళ్లే ప్రధాన దారులను భద్రతా బలగాలు దిగ్బంధించాయి. తెల్లవారుజామున పెద్ద ఎత్తున చప్పుళ్లతో తాము నిద్ర లేచి బయటకు పరుగులు తీయాల్సి వచ్చిందని అక్కడి అపార్ట్‌మెంట్ వాసి ఒకరు తెలిపారు. ఇప్పుడు కీవ్‌పై దాడులకు దిగిన రష్యా సేనలు మరో వైపు మరింత సంపూర్ణంగా తూర్పు ప్రాంతాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు భీకర దాడులకు దిగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News