Monday, January 20, 2025

భారత్‌కు రూ.22,490 కోట్లు ఆదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం ఏర్పడినప్పటికీ భారతదేశానికి మాత్రం ముడి చమురు కొనుగోలులో భారీ ప్రయోజనం లభించింది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుండి, రష్యా నుండి భారతదేశం పెద్ద మొత్తంలో ముడి చమురును రాయితీ ధరలకు కొనుగోలు చేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో, రష్యా నుండి చౌకగా చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా భారతీయ చమురు శుద్ధి కంపెనీలు 2.74 బిలియన్ల డాలర్లకు (రూ.22,490 కోట్లు) పైగా ఆదా చేశాయి. ఈ సంవత్సరం మొదటి 9 నెలల్లో రష్యా నుండి తక్కువ ధరలకు చమురును కొనుగోలు చేయడం ద్వారా భారతీయ కంపెనీలు రూ.22,490 కోట్లు ఆదా చేశాయి. ఈ కాలంలో రష్యా నుంచి భారత్ 69.1 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకుంది. జనవరి, సెప్టెంబర్ మధ్య భారతదేశం రష్యా నుండి చమురును టన్నుకు రూ.43,782 చొప్పున కొనుగోలు చేసింది. దీనిలో షిప్పింగ్, ఇతర ఛార్జీలు ఉన్నాయి.

ఈ కాలంలో ఇరాక్, ఇతర దేశాలలో ముడి చమురు టన్ను రూ.47,019 చొప్పున విక్రయించారు. దీని ప్రకారం, కంపెనీలు దాదాపు టన్నుకు చమురును రూ.3200 మేర చౌకగా కొనుగోలు చేశాయి. ప్రభుత్వ గణాంకాలను చూపుతూ రాయిటర్స్ ఈ సమాచారం ఇచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా ఉన్న భారతదేశం దీనిని సద్వినియోగం చేసుకొని యూరప్‌కు బదులుగా రష్యా నుండి చమురు దిగుమతిని పెంచింది. 2020లో రష్యా నుండి భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 2 శాతం మాత్రమే కొనుగోలు చేసింది. రష్యా, -ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యే ముందు 2021లో మొత్తం సరఫరా 16 శాతానికి, 2022లో 35 శాతానికి పెరిగింది. ప్రస్తుతం భారత్ తన ముడి చమురు అవసరాల్లో 40 శాతం రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది.

భారతదేశ మొత్తం వాణిజ్య విలువలో ముడి చమురు వాటా మూడో వంతు ఉంది. అంటే భారతదేశం బయట నుంచి దిగుమతి చేసుకున్నది దాదాపు మూడింట ఒక వంతు ముడి చమురు, అందువల్ల ఈ లాభం వాణిజ్య లోటును తగ్గిస్తుంది. భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దిగుమతి దేశం, దేశం మొత్తం ముడి చమురు అవసరాలలో 85 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటోంది. ధరను పరిగణనలోకి తీసుకుంటే వాణిజ్యంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News