Sunday, December 22, 2024

రష్యా అధ్యక్షుడు పుతిన్ హత్యకు కుట్ర!

- Advertisement -
- Advertisement -

మాస్కో: అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లద్వారా దాడి చేసి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేయడానికి ఉక్రెయిన్ బుధవారం యత్నించిందని రష్యా అధికారులు ఆరోపించారు. ఈ దాడి యత్నాన్ని ‘ఉగ్రవాద చర్య’గా పేర్కొన్న క్రెమ్లిన్ దాడి చేసే లోగా రష్యా మిలిటరీ, భద్రతా దళాలు ఆ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని రష్యా అధికారిక వార్తాసంస్థలు కూడా ప్రచురించిన ఆ ప్రకటన పేర్కొంది. దాడి జరిగిన సమయంలో పుతిన్ క్రెమ్లిన్‌లో లేరని, నోవో ఒగర్యోవో నివాసంనుంచి పని చేస్తున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ రష్యా అధికార వార్తా సంస్థ ఆర్‌ఐఎ నొవోస్తికి చెప్పారు.

పుతిన్ క్షేమంగా ఉన్నారని, ఆయన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పూ లేదని కూడా ఆ ప్రకటన తెలిపింది. దాడి ఘటనకు సంబంధించి క్రెమ్లిన్ ఎలాంటి ఆధారాలను వెల్లడించలేదు సరికదా, దాని ప్రకటనలో కూడా పెద్దగా వివరాలు లేవు. మే 9న రష్యా విక్టరీ డే వేడుకలను జరుపుకోనున్న తరుణంలో జరిగిన ఈ దాడి పుతిన్‌ను హత్య చేయడానికి జరిపిన ఉద్దేశపూర్వక దాడిగా ఆ ప్రకటన పేర్కొన్నట్లు టాస్ వార్తాసంస్థ తెలిపింది. ఆ రోజు ముందునిర్ణయించినట్లుగా ఒక మిలిటరీ పరేడ్ జరుగుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ చెప్పారు. ఈ ఘటనపై ఎప్పుడు తగిన విధంగా స్పందించే హక్కు రష్యాకు ఉందని ఆ ప్రకటన పేర్కొన్నట్లు టాస్ వార్తాసంస్థ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News