ఉక్రెయిన్‌తో యుద్ధంలో పైచేయి సాధించిన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇపుడు కాల్పుల విరమణ చర్చల విషయంలోనూ తనదే పైచేయి అని నిరూపించుకుంటున్నారు. తో యుద్ధంలో పైచేయి సాధించిన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇపుడు కాల్పుల విరమణ చర్చల విషయంలోనూ తనదే పైచేయి అని నిరూపించుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఈ నెల 18న గంటన్నర పాటు ఫోన్ సంభాషణ జరిగినపుడు, ఆయన కాల్పుల విరమణకు సిద్ధమని మరొక మారు చెప్తూనే, అందుకు తన షరతులను తిరిగి ముందుకు తెచ్చారు. నెల రోజులపాటు తాత్కాలిక కాల్పుల విరమణకు తాము పూర్తిగా సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ నెల 11న అమెరికన్ ప్రతినిధులతో సౌదీ అరేబియా నగరం జెడ్డాలో చర్చల దరిమిలా ప్రకటించటం తెలిసిందే. ట్రంప్ పుతిన్ మధ్య ఫోన్ సంభాషణ కూడా జరగనున్నట్లు ఆ మరునాడే వార్తలు వెలువడగా, పుతిన్‌తో నేరుగా మాట్లాడేందుకు అమెరికా అధికారులు మాస్కో వెళ్లారు.
ఇదంతా చెప్పుకోవటం ఎందుకంటే, ఇటువంటి సన్నాహాలన్నీ జరగటంతో, ఇక ట్రంప్ పుతిన్‌ల మధ్య ఫోన్‌తో ఉక్రెయిన్ వలెనే రష్యా కూడా నెల రోజుల కాల్పుల విరమణకు అంగీకరించవచ్చుననే అంచనాలు అంతటా వెలువడ్డాయి.ఆ ప్రకారం ఈ నెల 18న అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య ఫోన్ సంభాషణ సుదీర్ఘంగా సాగింది కూడా. కాని, అందరూ భావించినట్లు నెల రోజుల తాత్కాలిక సంపూర్ణ కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించలేదు. విరమణ ఉక్రెయిన్ ఇంధన సదుపాయాలకు, నల్ల సముద్ర ప్రాంతానికి మాత్రమే పరిమితమన్నారు. అందుకూ కొన్ని షరతులు విధించారు.
ఒకటి, ఉక్రెయిన్‌కు అమెరికా జెడ్డా ప్రకటన తర్వాత పునరుద్ధరించిన ఆయుధ సరఫరాలను, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని నిలిపివేయాలి. విరమణ కాలాన్ని ఉపయోగించుకుని ఉక్రెయిన్ తన సైన్యంలోకి కొత్త రిక్రూట్‌మెంట్లు చేపట్టరాదు. ఎటువైపు నుంచి కూడా కొత్త ఆయుధాలు సమకూర్చుకోరాదు. ఇంధన సదుపాయాలపై దాడులను తామే గాక, ఉక్రెయిన్ కూడా తమపై చేయకూడదు. రష్యా పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించగలదన్న ఆశాభావంతో బయలుదేరిన ట్రంప్, జెలెన్‌స్కీ, యూరోపియన్ దేశాలలో ఎవరి అంచనాలు కూడా ఆ విధంగా నెరవేరకుండా పోయాయి.
అట్లాగని, కాల్పుల విరమణను పుతిన్ పూర్తిగా తిరస్కరించారని నిందించేందుకూ ఆస్కారం లేదు. తను ఆ పని చేయలేదు గనుక. సూత్ర రీత్యా సిద్ధమనే ఈసారి కూడా చెప్పారు. ఆయన చూపిన వైఖరితో ఇపుడు ఇరకాటాన పడిన పరిస్థితి ట్రంప్, జెలెన్‌స్కీలది అయింది. ఎత్తుగడలలో పుతిన్‌ది పైచేయి అయిందనటం అందువల్లనే. ట్రంప్ స్వయంగా గంటన్నర పాటు మాట్లాడి కూడా పుతిన్‌ను తాను అనుకున్న విధంగా ఒప్పించలేకపోయారన్నది ఇందులో గమనించవలసిన విషయం. కనుకనే ఆయన మరునాడు జెలెన్‌స్కీతో మాట్లాడి పుతిన్ షరతులకు అంగీకరింప జేసే ప్రయత్నం చేసారు.
దీనిలో మరొకటి ఉంది. వాస్తవానికి పుతిన్ వైఖరి గాని, విధిస్తున్న షరతులు గాని ఎంతమాత్రం కొత్తవి కావు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నపుడు ఇరువురూ తమ ప్రయోజనాలను కాపాడుకోజూడటం సహజం. రాజీ చర్చలలోనూ ఎదుటి వారికి వీలైనంత తక్కువ వదలుకుని, తమ కోసం వీలైనంత రాబట్టుకో జూస్తారు. యుద్ధంలో ఎవరిది పైచేయి, ఎవరిది బలహీన స్థితి అన్న దానిని బట్టి వదలుకోవటాలు, రాబట్టుకోవటాలు ఆధారపడి ఉంటుంది. ఇది సర్వసాధారణ యుద్ధ నీతి, దౌత్యనీతి. ఆ ప్రకారం చూసినందు వల్లనే ప్రస్తుత యుద్ధంలో పైచేయిగా ఉన్న రష్యా తను కోరుకున్న షరతులను విధిస్తున్నది. చివరకు వాటిలో ఒక మేరకు రాజీ పడవచ్చునన్నది వేరే విషయం.
ఇప్పటికైతే పలు షరతులను ప్రకటిస్తున్నది. అవి ట్రంప్ ఎన్నికై రాజీ చర్చల ప్రస్తావన వచ్చినప్పటి నుంచి అదే విధంగా ఉన్నాయి. అవి ఏమిటన్నది ట్రంప్, జెలెన్‌స్కీ, యూరోపియన్ నాయకులకు స్పష్టంగా తెలుసు. అవి పుతిన్ బహిరంగంగా ప్రకటిస్తున్నవే. అదిగాక, మొదటిసారి ట్రంప్‌తో ఫిబ్రవరి 12న ఫోన్‌లో మాట్లాడినపుడు, మార్చి 11న అమెరికా ప్రతినిధులు, జెలెన్‌స్కీ కలిసి జెడ్డా ప్రకటన చేసినపుడు, తిరిగి ఈ 18న ట్రంప్‌తో ఫోన్ సంభాషణ సమయంలో చెప్తూనే వస్తున్నారాయన. అందువల్ల తన వద్ద స్పష్టత లేదని గాని, మాటమార్చుతున్నారని గాని అనలేము. అవి ఏమిటో ఒకసారి గుర్తు చేసుకోవాలంటే రష్యా కోరేది సమస్యకు శాశ్వత పరిష్కారం తప్ప, తాత్కాలిక కాల్పుల విరమణ కాదు.
తాత్కాలికమన్నది శాశ్వతానికి దారితీసే విధంగా ఉండాలి. అటువంటి పరిష్కారానికి కావలసింది తాము ఏ మూల కారణాల వల్ల ఉక్రెయిన్‌పై దాడి చేయవలసివచ్చిందో ఆ కారణాలు తొలగిపోవటం. ఆ విధంగా తాము కోరేవి ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండటం. నాటో నాయకత్వం తమకిచ్చిన మాటకు విరుద్ధంగా నాటో సైనిక కూటమిని తమ సరిహద్దుల వైపు విస్తరిస్తూ తమ దేశాన్ని చుట్టుముట్టకపోవటం. ఉక్రెయిన్‌లో నాటో సేనలను, క్షిపణులను, అణ్వస్త్రాలను మోహరించకపోవటం. ఉక్రెయిన్‌లో రష్యన్ జాతీయులు మెజారిటీలో గల క్రిమియా, దోన్‌బాస్ ప్రాంతాల ప్రజలను అక్కడి ప్రభుత్వం తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నందున క్రిమియాను 2014లో పూర్తిగా, ప్రస్తుత యుద్ధంలో దోన్‌బాస్‌ను ఎక్కువ భాగం ఆక్రమించాము. ఆ ప్రాంతాలను ఎటువంటి రాజీలోనూ వదిలే ప్రసక్తి లేదు.
కనుక వాటిని తమకు వదలివేస్తూ అధికారికంగా ప్రకటించాలి. ఇవన్నీ రష్యా భద్రతకు తప్పనిసరి. ఇవి పుతిన్ షరతులు. జెలెన్‌స్కీ, యూరోపియన్ నాయకులు వీటన్నింటికి ససేమిరా అన్నారు. యుద్ధంలో రష్యాను ఓడించగలమని నమ్మారు. బైడెన్ అధ్యక్షునిగా ఉన్నపుడు ఉక్రెయిన్‌కు ఆయుధాలు, నిధులు ఎడతెగక సరఫరా చేసారు. లెక్కలేనన్ని ఆర్థ్ధిక ఆంక్షలు విధించారు. కాని రష్యాను ఓడించలేకపోయారు. స్వయంగా యుద్ధంలోకి ప్రవేశించకుండా రష్యన్ అణ్వస్త్రశక్తి భయపెట్టింది. ట్రంప్ ఇంకా గెలవక ముందు ఈ పరిస్థితి ఏర్పడగా, ఆయన ఎన్నికల ప్రచారం ఇంకా సాగిస్తుండగానే యుద్ధానికి, జెలెన్‌స్కీకి, యూరప్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన గెలవటంతో తన మనసు మార్చేందుకు జెలెన్‌స్కీ, యూరప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
సరిగా అక్కడి నుంచి మొదలయ్యాయి ట్రంప్ శాంతి ప్రయత్నాలు. తాను అధ్యక్షుడైనట్లయితే యుద్ధం ఒక్క రోజులో ముగిసేట్లు చూడగలనంటూ ఎన్నికల ప్రచార సమయంలోనే ఆరంభించిన ఆయన, ఎన్నికైన వెంటనే యుద్ధవ్యతిరేక అధికారులను కీలక పదవులలో నియమించారు. జెలెన్‌స్కీ కన్న ముందు పుతిన్‌తో మాట్లాడారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా) నినాదం మేరకు, కీలకమైన ఖనిజాలు, ఇతర వనరులు ఉక్రెయిన్‌లో ఉన్నందున, వాటిని తమకు అప్పగించినట్లయితే యుద్ధం ముగిసేట్లు చూడ గలనంటూ విషయాన్ని అనూహ్యంగా వ్యాపారపు మలుపు తిప్పారు.
అంతేగాక, రష్యా దాడికి ఉక్రెయిన్‌దే బాధ్యత అని, తాము మూడేళ్లపాటు ఇన్నిన్ని ఆయుధాలు, నిధులిచ్చినా రష్యాను ఓడించలేకపోయారని, భవిష్యత్తులోనూ ఓడించలేరని అన్నారు. పనిలో పనిగా, మళ్ళా ‘మాగా’ నినాదానికి అనుగుణంగా రష్యాతో సత్సంబంధాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రయత్నాలు ఎటువంటి దాపరికం లేకుండా ఆరంభించారు. ఈ పరిస్థితులలో విధిలేని జెలెన్‌స్కీ రాజీకి ముందుకొచ్చారు. నిజానికి రష్యా ఆక్రమించిన ప్రాంతాలను వదలుకునేందుకు ఆయన ట్రంప్ ఎన్నికకు ముందే సుముఖత చూపారు. కాకపోతే భవిష్యత్తులో తమ రక్షణకు అమెరికా, యూరప్ కలిసి ఖచ్చితమైన హామీలివ్వాలని పట్టుబట్టారు. ఆ పని తాను చేయబోనని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేయగా, యూరప్ కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది గాని, అమెరికా బలం తోడులేనిదే సాధ్యం కాదని గ్రహించింది.
జెలెన్‌స్కీ సైతం గ్రహించినందువల్లనే ఫిబ్రవరి 28న ట్రంప్‌తో వైట్ హౌస్ సమావేశంలో భంగపాటుకు గురై కూడా పది రోజులు తిరిగే సరికి జెడ్డా సమావేశానికి వెళ్లారు. అప్పటి నుంచి తర్వాత పది రోజులుగా రష్యా అధ్యక్షుడిని కాల్పుల విరమణకు అంగీకరింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరిగా ఈ దశలో పుతిన్ దౌత్యనీతి చాతుర్యం మళ్ళీ కనిపిస్తున్నది. రష్యా ప్రయోజనాల కోసం తనకు కావలసింది పైన పేర్కొన షరతుల ప్రకారం తమ లక్షాలను వీలైనంత ఎక్కువగా సాధించుకోవటం, ఈ ప్రక్రియలో యూరప్ ప్రమేయం ఉండకుండా అరికట్టటం, ట్రంప్ ప్రతిపాదనలను సూత్రరీత్యా అంగీకరిస్తూ తనను సంతృప్తి పరుస్తూనే, వెంటనే పూర్తిగా సమ్మతించకపోవటం.
ఆ విధంగా జెలెన్‌స్కీ పై ఒత్తిడి పెంచటం. ట్రంప్ కూడా ఒత్తిడి చేసేట్లు చూడటం. రకరకాల ఆర్భాటాలు చేస్తున్న యూరప్‌ను నిస్సహాయంగా మిగల్చటం. ఉక్రెయిన్‌లోని ఖనిజాలే గాక తమ ఖనిజాలు కూడా ఇచ్చేందుకు సిద్ధమంటూ ట్రంప్‌కు ఆశ చూపటం. ఈ క్రమం అంతా ఒక దౌత్యపరమైన దోబూచులాటవలే సాగుతుండగా ఆ సమయాన్ని ఉపయోగించుకుని కుర్‌స్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ సేనల నుంచి తిరిగి ఆక్రమించుకోవటంతో పాటు దోన్‌బాస్‌ను మరింత గెలవటం. రష్యన్ సేనలు కుర్‌స్క్‌ను ఈ శాంతి చర్చలు సాగుతుండగానే దాదాపు పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి కూడా. అంతటితో ఆగకుండా ఉక్రెయిన్‌కు చెందిన సుమీ ప్రాంతంలోకి ఎదురుదాడులతో చొచ్చుకుపోయి ఆక్రమించటం మొదలుపెట్టాయి.
జెలెన్‌స్కీ, యూరోపియన్ నాయకుల కొత్త భయాలు ఇవే. సమయం గడిచిన కొద్దీ పరిస్థితులు మరింత ప్రతికూలం అవుతాయి గనుక, పుతిన్ పై నేరుగా విమర్శలు చేయటం ద్వారా, ట్రంప్‌తో ఒత్తిడి చేయించటం ద్వారా రష్యాతో వెంటనే బేషరతుగా నెల రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటన చేయించేందుకు ప్రయాస పడుతున్నారు. వారు అంతా తమ కోణంనుంచి తాము చేస్తుండగా, పుతిన్ ఎంత మాత్రం తొణుకుబెణుకు లేకుండా రష్యా కోణం నుంచి అవసరమైనది చేస్తున్నారు. ట్రంప్‌తో 18 నాటి ఫోన్ సంభాషణలో జరిగింది అదే.
– టంకశాల ఆశోక్