మాస్కో : రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విధానాలను ప్రశంసించారు.“ మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయంలో ఆయన సరైన రీతిలో ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. వ్లాదివోస్తోక్‌లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో రష్యా తయారీ కార్ల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు. ‘మనకు గతంలో దేశీయంగా తయారైన కార్లు లేవు. కానీ ఇప్పుడు ఉన్నాయి. మనం 1990లో భారీ స్థాయిలో కొనుగోలు చేసిన ప్రముఖ కంపెనీ కార్లతో పోల్చుకుంటే ఇవి కూడా మెరుగైనవే. అయితే స్వదేశీ తయారీ విషయంలో మనం మన భాగస్వాములు తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలించాలి.
భారత్ విషయానికొస్తే ఆ దేశం స్వదేశీ తయారీ, వినియోగంపై దృష్టి పెట్టింది. మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయంలో మోడీ నాయకత్వం లోనే భారత్ సరైన రీతిలో ముందుకు వెళ్తోంది. ” అని పుతిన్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా పుతిన్ , తన ప్రసంగంలో మేకిన్ ఇండియా గురించి ప్రస్తావించారు. రష్యాకు గొప్ప స్నేహితుడు అయిన ప్రధాని మోడీ , కొన్ని సంవత్సరాల క్రితం మేకిన్ ఇండియాను తీసుకువచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు దీని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన స్నేహితుడు చేసింది సత్ఫలితాలిస్తుంటే అనుకరించడం తప్పేమీ కాదు’ అని అన్నారు.