లండన్ : దేశద్రోహానికి పాల్పడ్డాడన్న నేరారోపణపై సైబీరియాలో గత వారం అరెస్టయిన రష్యా శాస్త్రవేత్త జైలు పాలైన రెండు రోజుల్లోనే మాస్కోలో మృతి చెందారు. 54 ఏళ్ల భౌతిక శాస్త్రవేత్త డిమిట్రీ కోల్కర్ క్లోమగ్రంధి కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతుండగా అరెస్టు చేసి మాస్కో లోని లెఫెర్టోవో జైలుకు విమానంలో తరలించారు. ఆయన విమానం లోనే తీవ్ర అస్వస్థతతో నాలుగు గంటలు ప్రయాణించవలసి వచ్చింది. జైలు పాలైన తరువాత సమీపం లోని ఆస్పత్రిలో ఆయన చనిపోయారని ఆయన న్యాయవాదులు చెప్పారు. లాసర్ స్పెషలిస్టుగా పేరొందిన ఆయన దేశద్రోహంతో చైనాకు సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోపణలు అసంబద్ధమైనవని ఆయన సమీప బంధువు ఆంటోన్ డయానోవ్ అమెరికా లోని వార్తా సంస్థ రాయిటర్‌కు వివరించారు. ఆయన శాస్త్రవేత్త అని, దేశాన్ని ప్రేమించాడని, విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలల నుంచి ఆహ్వానాలు అందినా వాటిని తిరస్కరించి స్వదేశం రష్యా లోనే పనిచేశారని, రష్యా లోని విద్యార్థులకు బోధిస్తూ రష్యా లోనే ఉండాలని కోరుకునే వారని ఆంటోన్ డయానోవ్ పేర్కొన్నారు.