కీవ్ : నిరాయుధుడైన ఉక్రెయిన్ పౌరుడిని చంపినందుకు రష్యా సైనికుడికి ఉక్రెయిన్ కోర్టు జీవితఖైదు విధించింది. రష్యా సైనికుడి యుద్ధ నేరంపై విచారణ జరిపిన కోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. రష్యన్ ఆర్మీ ట్యాంక్ కమాండర్, 21 ఏళ్ల సార్జెంట్ వాడిమ్ షిసిమరిన్, ఫిబ్రవరి 28న ఈశాన్య ఉక్రేనియన్ గ్రామమైన చుపాఖివ్కాలో 62 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపాడు. ఈనేరాన్ని షిషిమరిన్ ఒప్పుకున్నాడు. రష్యా సైనిక అధికారి సెల్‌ఫోన్ ద్వారా ఆదేశించడంతో కాల్పులు జరిపినట్టు అంగీకరించాడు. దీంతో న్యాయమూర్తి సెర్హి అగాఫోనోవ్ రష్యా సైనికుడికి జీవిత కారాగార శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24 న ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించింది. అయితే రష్యా యుద్ధ నేరాలకు సంబంధించి ఉక్రెయిన్ కోర్టు ఒక రష్యా సైనికుడికి తొలిసారి ఈమేరకు శిక్ష విధించింది. తమ దేశంపై దండెత్తిర రష్యా సేనలపై ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాల కింద విచారణ మొదలైన విషయం తెలిసిందే.