కీవ్ : ఉక్రెయిన్ కీలక నగరాల్లోకి రష్యాసేనలు అడుగుపెట్టాయి. ఉక్రెయిన్ అధికారిక వర్గాలే ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఖర్కీవ్, నోవా కఖోవ్‌కాల్లోకి ప్రవేశించాయి. ఖర్కీవ్‌లో పోరాటం జరుగుతుండగా… వోవా కఖోవ్‌కా నగరాన్ని మాత్రం పూర్తిగా అధీనం లోకి తీసుకొన్నాయి. ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్దనగరం ఖర్కీవ్. తేలికపాటి రష్యాసాయుధ వాహనాలు నగరం లోకి అడుగుపెట్టినట్టు నగర ప్రాంతీయ కార్యనిర్వాహక విభాగం అధిపతి తెలిపారు. ఈ నేపథ్యంలో షట్టర్లను వీడి బయటకు రావొద్దని ప్రజలను ఆయన హెచ్చరించారు. పారిశ్రామిక కేంద్రమైన ఖర్కీవ్‌లో ప్రభుత్వ రంగానికి చెందిన టర్బోఆటమ్, ఎలక్ట్రోట్యూజ్మాష్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా హెవీ పవర్ ఎక్విప్‌మెంట్ నిర్మాణంలో 17 శాతం వాటా ఈ కంపెనీలకు ఉంది. ప్రపంచంలో విమానాలను సొంతంగా నిర్మించగల అతికొద్ది దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి.
ఇక్కడి యాంటినోవ్ సంస్థ రవాణా విమానాలను తయారు చేస్తుంది. దీనికి సంబంధించిన కీలక ప్లాంట్ ఖర్కీవ్‌లో ఉంది. భారత్ కూడా యాంటినోవ్ విమానాలను వాడుకుంటోంది. కీలకమైన నౌకలు, సాయుధ వాహనాలు, లోకోమోటీవ్ వాహనాలు, ఇంజిన్లు తయారు చేసే మలిషేవ్ ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది. ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద ఐటీ హబ్ ఖర్కీవ్‌లో దాదాపు 500 కంపెనీల్లో 25 వేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడి ఐటీ కంపెనీలు 800 మిలియన్ డాలర్లకు పైగా వ్యాపారం చేస్తాయి. చమురు పైపులైన్ పేల్చివేత
ఖర్కీవ్ లోని సహజవాయు పైప్‌లైన్‌ను రష్యా సేనలు పేల్చివేశాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసి పడడంతో పర్యావరణంపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
నీపర్ నదిపై పట్టు సాధించిన రష్యా
నోవా కఖోవ్‌కా నగరంపై పట్టు సాధించడంతో క్రిమియా ద్వీపకల్పానికి సెవస్థపపోల్ నగరానికి మంచినీరు అందించే నీపర్ నదిపై రష్యాకు పట్టు లభించింది. వ్యూహాత్మకంగా ఇది చాలా కీలకమైన ప్రాంతం. రష్యాలో పుట్టిన ఈ నది నుంచి సోవియట్ సమయంలో నిర్మించిన ఉత్తర క్రిమియా కాల్వ ద్వారా క్రిమియాకు నీటిసరఫరాను చేస్తున్నారు. కానీ కొన్నేళ్లుగా ఉక్రెయిన్ నీటి సరఫరాను అడ్డుకోవడంతో క్రెమ్లిన్ ఆగ్రహానికి కారణంగా నిలిచింది. క్రిమియాలో తగిన నీటి వనరులు లేవు. 2014 తర్వాత కీవ్ నీటి సరఫరాలో సమస్యలు సృష్టించడంతో గత ఏడాది క్రిమియాలో కరవు పరిస్థితి నెలకొంది. దీనికి ఉక్రెయిన్ కారణమని రష్యా గుర్రుగా ఉంది. తాజాగా రష్యా దళాలు నగరం లోకి ప్రవేశించి ఎగ్జిక్యూటివ్ కమిటీ భవనాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అక్కడ ఉన్న ఉక్రెయిన్ జెండాలను తొలగించాయి. ఇక ఖెర్సావ్, మైకోలైవ్, మెల్టోపోల్‌పై కూడా రష్యా దళాలు దృష్టి పెట్టాయి.